న్యూఢిల్లీ : కెనడా- భారత్‌ల మధ్య రాజకీయ విబేధాల కారణంగా వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదంతో తలెత్తిన సమస్యల వల్ల ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి -20 సమావేశాల్లో కూడా ప్రధాని మోడీ కెనడా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖలిస్తాన్ మద్దతదారులు భారత దైత్యకార్యాలయాలపైనా, ప్రార్థనామందిరాలపైనా దాడి చేయడం, భారతీయుల్ని బెదిరించడం వంటి చర్యలు హింసను ప్రేరేపిస్తుందని.. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం కోరింది. అయితే ఖలిస్తాన్ మద్దతుదారుల దాడులపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. హింస నిరోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఇటీవల మీడియాతో అన్నారు. అయితే శాంతియుత నిరసన స్వేచ్ఛను కెనడా ఎల్లప్పుడూ కాపాడుతుందని ట్రూడో మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారు. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. అయితే వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం కెనడా వెల్లడించలేదు.