Sep 17,2023 12:25

అమరావతి : భారతదేశంలో వాయుకాలుష్యం రోజురోజుకూ తీవ్ర స్థాయిలో పెరుగుతూ మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. దేశంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వాహనాలు వదులుతున్న విషపూరిత వాయువు కారణంగా ప్రజలు పలు వ్యాధుల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ప్రకారము ప్రతి ఏటా వాయు కాలుష్యం వలన 2.4 మిలియన్ల జనం మరణిస్తున్నారు. దేశ జనాభాలో 76.8 శాతం మంది శ్యాస కోస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాలుష్య కారకాలలో ప్రధానంగా పిఎం 2.5 ప్రాణాంతక రకంగా చెప్పొచ్చు.. ఎందుకంటే అది చిన్న పరిమాణంలో ఉండటంతో మానవ శరీర కణజాలాలలోకి లోతుగా దూసుకుపోతుందని తెలిపారు.

/Increasing-air-pollution-Acute-respiratory-cases


                                         మరణాలు పెరుగుతున్నాయి.. శ్వాస సంబంధ కేసులు అధికం..!

హైదరాబాద్‌లో గాలి కాలుష్యం క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు ... శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియా బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిహెచ్‌ఎఫ్‌ఐ, హెచ్‌ఎంఈ సహకారంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చేసిన అధ్యయనాన్ని కేంద్ర మంత్రి బఘేల్‌ లోక్‌ సభలో ప్రస్తావించారు.

                                                          జాగ్రత్తగా ఉండాలి : ఆరోగ్య నిపుణులు

హైదరాబాద్‌ నగరంలో ఆగస్టు మొదటి వారంలో తాజా పీసీబీ డేటా ప్రకారం ... 31 స్టేషన్లలో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం10 స్థాయిలు నమోదయ్యాయి. కోకాపేట పీఎం స్టేషన్‌ లో పీఎం 2.5 స్థాయిలు 40 కంటే ఎక్కువగా ఉన్నాయి. జీవ ద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గఅహ వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమనీ, దీనిపై జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

                                                                             డాక్టర్ల ఆందోళన...

వాయుకాలుష్యంలోని అన్ని భాగాల్లోని ధూళికణాలు వాయుమార్గాలు, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆస్తమా, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, క్యాన్సర్‌ లాంటి సీఓపీడీ, ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయన్నారు. వాయు కాలుష్యానికి గురైనప్పుడు గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవించారని పలు అధ్యయనాల్లో తేలిందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.

                                         ధూమపానంతో సంబంధం లేకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్‌..!

సీవోపీడీ కేసులు 20 శాతం పెరిగాయనీ, ధూమపానం చేయనివారిపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధూమపానంతో సంబంధంలేని ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కఠినమైన నిబంధనలు, క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు చేయడం, వాహన ఉద్గారాల స్థాయిలు పరిమితిని దాటకుండా చూసుకోవడం గాలి కాలుష్య నియంత్రణకు సాయపడుతుందన్నారు.