- పుంజుకున్న మిర్చి క్రయవిక్రయాలు
- వర్షాలతో తగ్గిన నాణ్యత
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ కొనసాగుతోంది. మంగళవారం లక్షా 5 వేల 607 టిక్కిలు యార్డుకు వచ్చాయి. పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, బళ్లారి జిల్లాల నుంచి ఎక్కువగా మిర్చి గుంటూరు యార్డుకు వస్తోంది. గత రెండు రోజులుగా రోజుకు లక్షకుపైగా టిక్కిలు రావడంతో యార్డు ప్రాంగణం నిండిపోయింది. లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలతో యార్డు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. తెల్లవారుజూమున భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవుల అనంతరం యార్డులో విక్రయాలు పుంజుకున్నాయి. కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.25 వేలు లభించిందని అధికారులు తెలిపారు. సంక్రాంతికి ముందు కనిష్ట ధర రూ.10 వేల వరకు పలకగా ప్రస్తుతం రెండు వేల వరకు తగ్గింది. అయితే, గత నెలలో నాణ్యమైన సరుకు వచ్చినప్పుడు సగటు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.17 వేల నుంచి రూ.20 వేల మధ్య వస్తోందని చెబుతున్నారు. సగటున గరిష్టంగా రూ.15 వేలకు మించి ధర వస్తోంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.17 వేలు సగటున ఉంటోంది.
గత వారం కన్నా ఈ వారంలో క్వింటాలుకు రూ.3 వేల వరకు తగ్గింది. ఈ ఏడాది ఆశించిన దిగుబడి రావడం లేదని రైతులు చెబుతున్నారు. మొత్తం నాలుగు కోతల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తుండగా, ఈ ఏడాది పది క్వింటాళ్లకు మించి రాదనే ఆందోళన వారిలో నెలకొంది. పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టినట్టు రైతులు తెలిపారు. కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి రావాలని, ధర క్వింటాలుకు రూ.20 వేలకు తగ్గకుండా ఉంటేనే కొంత వరకు నష్టాల నుంచి బయటపడతామని చెప్తున్నారు. గత అక్టోబరులో కురిసిన అధిక వర్షాలు, మాండూస్ తుపాను వల్ల పైరు తడిసిన ప్రాంతాల్లో కొంత మేరకు నాణ్యత తక్కువగా ఉందని చెప్తూ, వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నాణ్యత తగ్గలేదని, మార్పు సల్వమేనని అంటున్నారు. గత ఖరీఫ్‌లో సాగు చేసిన సరుకు ప్రస్తుతం యార్డుకు వస్తోంది. ధరలు నిలకడగా ఉన్నాయని, డిమాండ్ సప్లరు ప్రాతిపదికన స్వల్ప మార్పులతో యార్డులో సగటు ధర కొంత హెచ్చు తగ్గుదలతో ఉందని మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. సహజంగా యార్డుకు ఏటా ఫిబ్రవరి 15 తరువాత లక్ష టిక్కిలు వస్తాయని, కానీ ఈ ఏడాది జనవరి 17 నుంచి విక్రయాలు పుంజుకున్నాయని ఆయన చెప్పారు. గత వారం రోజుల్లో 60 వేల నుంచి 70 టిక్కిలు వస్తుండగా గత రెండు రోజులుగా లక్షకు పైగా టిక్కిలు వస్తున్నాయని ఆయన 'ప్రజాశక్తి' ప్రతినిధికి వివరించారు.










