Mar 30,2023 08:11
  • రూ.250 కోట్ల ఛార్జీల భారం
  • ఈ నెల 31న ఆందోళనలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రవాణా రంగంలో ఇప్పటికే భరించలేనంతగా ఉన్న టోల్‌ ఛార్జీలపై మరో పదిశాతాన్ని పెంచిన నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. పెరుగుతున్న పెట్రో ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా వాహనదారులకు బాడుగలు లేకున్నా ప్రతిఏటా 10 శాతం టోల్‌ ఛార్జీలను పెంచాలని కేంద్రం ప్రకటించడం, దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం పట్ల లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల రవాణా రంగ వాహనాలపై ఈ పెంపుదల తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్ర వాప్తంగా 8,650 కిలోమీటర్ల జాతీయ రహదారులపై 58 టోల్‌గేట్లు ఉన్నాయి. సగటున ప్రతివాహనానికి కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్‌ఫీజ్‌ వసూలు చేస్తున్నారు. సగటున ఒక్కో ట్రక్కు లేదా బస్సు నుంచి నెలవారీ ఛార్జీని రూ.10 వేలకు పైగా వసూలు చేస్తుంటే, భారీ లారీలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టోల్‌గేట్ల నుంచి ఏటా దాదాపు రూ.2,500 కోట్లను టోల్‌ ఛార్జీస్‌ పేరుతో రవాణా వాహనాలు చెల్లిస్తున్నాయి. ఇపుడు 10 శాతం పెంపుదలంటే మరో రూ.250 కోట్ల భారం అదనంగా రవాణా వాహన యజమానులపై పడనుంది. ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌ భారాలతోపాటు నిర్వహణ భారాలు పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్ర రవాణా రంగంపై కేంద్రం ఇలా విధాన నిర్ణయంగా టోల్‌ ఛార్జీలను వసూలు చేయడాన్ని వాహన యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై ప్రయాణం సాధారణ ప్రజలకు కూడా మరింత భారం కానుంది. 10 శాతం అదనంగా టోల్‌ ఛార్జీలను పెంచాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

  • టోల్‌ ట్యాక్స్‌ పెంచడం సరికాదు :  వైవి ఈశ్వరరావు, ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ లాజస్టిక్‌ పాలసీలో ఇప్పుడున్న 15 శాతం రవాణా ఖర్చును 9 శాతం తగ్గిస్తామని చెప్పి, రవాణా ఖర్చులు పెరిగేలా టోల్‌ ఛార్జీలను పెంచడం సరైంది కాదు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎక్కువగా భరిస్తున్న వాహన యజమానులపై మరింత భారం మోపేలా టోల్‌ ఛార్జీలు పెంచడం తగదు. టోల్‌ ఛార్జీలను పెంచాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

  • 31న నిరసనలను జయప్రదం చేయాలి : ఎం అయ్యప్పరెడ్డి, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

పెంచనున్న టోల్‌ ఛార్జీలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు వాహన యజమానులుగా ఈ నెల 31న మధ్యాహ్నం 12 నుంచి 12:10 వరకు పది నిమిషాలపాటు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేసి చక్కాజామ్‌ నిరసనను జయప్రదం చేయాలి. టోల్‌ ఛార్జీలతోపాటు డీజిల్‌ ధరలను తగ్గించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాహన యజమానులతోపాటు ఆర్‌టిసి ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలి.