ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దాపురం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై సీఎంకు బహిరంగ లేఖ కరపత్రాన్ని ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కరణం ప్రసాదరావు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పెద్దాపురం మెయిన్ రోడ్డులో 2018 జూలై 18న జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. ఈ హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.పెద్దాపురం, సామర్లకోట పట్టణాలకు ధవలేశ్వరం నుండి నేరుగా పైపులైను వేసి విడివిడిగా గోదావరి మంచినీటి సరఫరా చేస్తానని హామీ ఇచ్చారన్నారు.యువతకు ఉపాధి కల్పనే తన లక్ష్యమన్న ఆయన సామర్లకోట పంచదార ఫ్యాక్టరీ మూసేసినా,సగ్గుబియ్యం మిల్లులు మూతపడినా పట్టించుకోవడం లేదన్నారు.టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను వారి వాటా సొమ్ము కట్టవద్దని,తాను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే కడుతుందని చెప్పారని,కానీ ప్రతి లబ్ధిదారుని నుంచి సుమారు మూడు లక్షలు కట్టించుకున్నాకే ఇంటిని అప్పగించారన్నారు. టిడ్కో కాలనీలో ప్రజలు అనేక సమస్యలు తో సతమతమవుతున్నారన్నారు.ఏటుపట్టు లోని 11 గ్రామాల ఇళ్ల లబ్ధిదారుల సమస్య పరిష్కారం కాలేదన్నారు.రామేశ్వరం పేట మెట్టను వైసిపి నాయకులే తవ్వుకు పోతున్నారన్నారు.పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తానని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్,కేదారి నాగు,గడిగట్ల సత్తిబాబు,మహాపాతిన రాంబాబు,కూనిరెడ్డి అప్పన్న,దారపు రెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.










