Jan 21,2023 07:31

         దేశంలో మహిళల భద్రత పెను ప్రమాదంలో పడింది. తల్లి గర్భం మొదలు శ్మశానం వరకు ఏ మూల కూడా మహిళ నిర్భయంగా బతికే పరిస్థితి లేదు. మారుమూల గ్రామాలు, పట్టణాలు, నగరాలు, పని ప్రదేశాలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు..ఇలా అడుగడుగునా ఆడబిడ్డలు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీయాల్సిన దైౖన్య పరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. దేశ రాజధాని నగరం ఢిల్లీ నడివీధుల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌నే వేధింపులకు గురిచేస్తూ కారులో ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన యావత్‌ భారతావనినే నివ్వెరపాటుకు గురిచేస్తోంది. దేశ రాజధాని నగరం, శాంతిభద్రతలు నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఉన్నచోట సాక్షాత్తూ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే ఇక సాధారణ మహిళలకు ఏ పాటి రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఏళ్లతరబడి మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న దారుణం వెలుగుచూసిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
         'బేటీ బచావో..బేటీ పడావో..' వంటి ప్రచార్భాటపు నినాదాల మాటున మహిళలపై బరితెగించి ఆకృత్యాలకు ఒడిగడుతున్న బ్రిజ్‌ భూషణ్‌ లాంటి కాషాయ మూకలెందరో? ఒకరిద్దరు కాదు వందలాది మంది మహిళా రెజ్లర్లపై అతగాడు అఘాయిత్యాలకు ఒడిగట్టినట్టు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దే మహిళా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో కానీ, బిజెపి అధినాయకత్వంలో కానీ ఇసుమంతైనా చలనం లేదు. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మూడున్నర వారాల కిందట హర్యానా మంత్రి సందీప్‌ సింగ్‌పై ఆరోపణలు వస్తే ఆయనతో పదవికి రాజీనామా చేయించారు. ఆ ఘటన మరవక ముందే బిజెపి ఎంపీ బ్రిజ్‌పై ఆరోపణులు వచ్చినా..ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు సాగిస్తున్నా రాజీనామా ప్రస్తావనే లేకుండా నిస్సిగ్గుగా ఆయన ఎంపీగానూ, డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగానూ కొనసాగుతూనేవున్నాడు. స్వతహాగా క్రీడాకారుడైన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కు మహిళా రెజ్లర్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. కామాంధుల పట్ల మోడీ సర్కార్‌ ఎంతటి ఊదాసీన వైఖరి అవలంబిస్తోందో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. గుజరాత్‌ మత ఘర్షణల సమయంలో ముస్లిం మైనార్టీలపై ఆంబోతుల్లా అఘాయిత్యాలకు పాల్పడిన సంఫ్‌ు పరివార్‌ గూండాల బాటలో నడిచే పాలకులున్న చోట ఇంతకంటే గొప్పగా ఊహించేదేముంటుంది? నాటి ఘాతుకాలను స్వయంగా అనుభవించి నేటికీ ఆ వేదనతోనే న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్‌ బానో పట్ల మోడీ సర్కార్‌ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో చూశాం. హత్యలు చేసి, అఘాయిత్యాలకు పాల్పడి కఠిన కారాగార శిక్ష ఎదుర్కొంటున్న సంఫ్‌ు పరివార్‌ గూండాలకు నిస్సిగ్గుగా ఇదే మోడీ సర్కార్‌ స్వేచ్ఛను ప్రసాదించించడం దేనికి సంకేతం? దుండగుల పట్ల మోడీ సర్కార్‌ అవలంబిస్తున్న ఈ మద్దతు ధోరణే దేశంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలపై కామాంధులు ఇంతలా రెచ్చిపోవడానికి దోహదం చేస్తుందన్న విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి.
         కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వినాశకర సంస్కరణలకు ప్రయోగశాలగా మారిన మన రాష్ట్రంలోనూ మహిళల భద్రత ఎండమావులను తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)లో ఉన్నతోద్యోగులు తోటి ఉద్యోగుల పట్ల, మహిళా క్రీడా కారుల పట్ల లైంగిక వేధింపులకు తెగబడుతున్నారన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శాప్‌ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించడం స్వాగతించదగింది.
          'దిశ', నిర్బయ వంటి చట్టాలు తీసుకొచ్చేశామని, హెల్ప్‌లైన్లు పెట్టేశామని ప్రచారాలతో సరిపెట్టడంతోనే మహిళలకు రక్షణ లభించదు. మహిళలను చులకన చేసే మనువాద భావజాలాన్ని, పితృస్వామ్య పెడధోరణులను తరిమికొడితేనే వారికి రక్ష.