వాన చినుకులు ఇట్టా తడిపితే.. వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది మనసు.. అందుకే ఈ వర్షాకాలం కారం కారంగా.. వేడి వేడిగా తింటే ఆ అనుభూతే వేరబ్బా.. అది వెజ్ రోల్స్ అయినా.. మీల్‌మేకర్‌తో వడలైనా.. బ్రొకోలీ చీజ్ స్టిక్స్ అయినా.. చికెన్ లాలీపాప్‌లైనా.. ఏవైనా వేడివేడిగా, స్పైసీగా చేసుకుని తింటే.. ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి.. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
బ్రొకోలి చీజ్ స్టిక్స్
కావలసిన పదార్థాలు : బ్రొకోలి ముక్కలు - కప్పు, క్యాప్సికమ్ ముక్కలు - కప్పు (పెద్దగా తరిగినవి), ఉల్లిగడ్డ ముక్కలు - కప్పు, పార్సిమన్ చీజ్ - పావు కప్పు, చీజ్ ముక్కలు - కప్పు, ఆరిగానో, రోస్‌మేరీ - టీస్పూన్, ఉప్పు - తగినంత.
తయారీ విధానం : బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడినీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి. టూత్‌పిక్‌లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి. ఒవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రొకోలి స్టిక్స్‌ను పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి, పై నుంచి తురిమిన పార్సిమన్ చీజ్, ఆరిగానో, రోజ్ మేరీ, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే వేడివేడి బ్రొకోలి చీజ్ స్టిక్స్ సిద్ధం.
వెజ్ రోల్స్
కావలసిన పదార్థాలు : మైదా - అర కప్పు, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్‌స్పూన్లు, టమాట, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిగడ్డ - ఒకటి, నూనె - పావు కప్పు, ఉప్పు- తగినంత, కారం- టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్, గరం మసాలా- పావు టీస్పూన్, కొత్తిమీర తురుము- కొద్దిగా.
తయారీ విధానం : పాన్‌లోని నూనె వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. అవన్నీ వేగాక క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసి, బాగా వేయించాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర తురుము జోడించి, మరో మూడు నిమిషాలు వేయించి, దించి చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని, పావుగంటపాటు నానబెట్టాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పలుచని చపాతీల్లా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి, చపాతీలను పది సెకన్లపాటు రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇప్పుడు ఒక్కో చపాతీ మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి అన్నివైపులా మూసి రోల్స్‌లా చుట్టుకుని చివర్లను మైదా నీళ్లతో అంటించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక చుట్టి ఉంచిన రోల్స్ వేసి, దోరగా కాల్చుకుంటే కరకరలాడే వెజ్ రోల్స్ రెడీ.
లెమన్ చికెన్ లాలీపాప్
కావలసిన పదార్థాలు : చికెన్ లాలీపాప్ - కిలో, పసుపు - అర టీ స్పూన్, కారం - రెండున్నర టేబుల్ స్పూన్లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, గుడ్డు - ఒకటి, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్ స్పూన్లు, మైదా పిండి - మూడు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - టేబుల్ స్పూన్, నిమ్మరసం - పావు కప్పు, ఉల్లి ఆకుల తరుగు - అర కప్పు, ఆలివ్ నూనె - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - సరిపడా.
తయారీ విధానం : ఒక పెద్ద గిన్నెలో చికెన్ లాలీపాప్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, గుడ్డు సొన, మిరియాల పొడి, నిమ్మరసం కలపాలి. అందులోనే మొక్కజొన్న పిండి, మైదాపిండి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. వీటిని పావుగంటసేపు పక్కనబెట్టి, తర్వాత నూనెలో వేయించాలి. ఆపైన వాటిపై కొద్దిగా నిమ్మరసం, ఉల్లి ఆకుల తరుగుతో గార్నిష్ చేసి, సర్వ్ చేసుకోవాలి.
మీల్‌మేకర్ వడ
కావలసిన పదార్థాలు : సోయా గ్రాన్యూల్స్ (మీల్ మేకర్స్) - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - తగినంత, కొత్తిమీర తురుము - కొద్దిగా, శనగపప్పు - పావు కప్పు, శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూన్, ధనియాలు - టీస్పూన్, జీలకర్ర - టీస్పూన్, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, లవంగాలు - ఆరు.
తయారీ విధానం : సోయా గ్రాన్యూల్స్‌లో కొద్దిగా ఉప్పు వేసి, వేడినీళ్లు పోసి గంటపాటు నానబెట్టి, గట్టిగా పిండుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలను బరకగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, మసాలాపొడి వేసి, బాగా కలపాలి. దీనిలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ, గట్టి ముద్దలా కలుపుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి, వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, అరచేతిలో ఒత్తుకుని వడలు వేసుకుంటే కరకరలాడే మీల్‌మేకర్ మసాలా వడలు సిద్ధం.