Oct 01,2023 09:49

పుట్టిన ప్రతి మనిషి వృద్ధాప్యంలోకి రావాల్సిందే. బాల్యం, యవ్వనం, పెళ్లి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం ఇదే జీవితచక్రం. పిల్లల్ని కని, కంటికి రెప్పలా పెంచి, ప్రయోజకులవ్వాలని తల్లిదండ్రులుగా ఎంతో తపిస్తారు. చేస్తారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకాడక శ్రమిస్తారు. వారికి రెక్కలొచ్చాక.. తల్లిదండ్రులకు వయస్సు మీదపడుతుంది. వృద్ధాప్యం మరో పసితనం లాంటిది. ఆ దశలో చిన్న పలకరింపును, ఆత్మీయతను కోరుకుంటారు. కానీ వారిని చాలా మంది పిల్లలు ఏకాకుల్లా వదిలిలేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, డబ్బు పంచమని అడిగే వాళ్లే ఎక్కువ. కారణమేదైనా ఫలితం మాత్రం వృద్ధుల మీద పడుతోంది. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

11


నిషికి 65 ఏళ్లు దాటితే వృద్ధాప్యంలోకి వచ్చినట్లు అనేది శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్న విషయం. ఆ దశలో శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం ముడతలు పడటం, కళ్లు మసకబారడం, వినికిడి సమస్య, పళ్లు ఊడిపోవడం, మతిమరుపు, చిన్న పిల్లల మనస్తత్వం ఏర్పడటం వంటి రుగ్మతలు కనిపిస్తుంటాయి. అయితే వీరిని భరించలేక కుటుంబ సభ్యులు దూరం పెడుతూంటారు. బాల్యంలో పిల్లలు ఎంతో అల్లరి చేస్తారు. అయినా ఓర్పుగా భరించి, లాలించి తల్లిదండ్రులు వారిని పెంచి, పెద్దచేస్తారు. కానీ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నామనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి.
              విజయవాడకు చెందిన భార్యాభర్తలకు ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఐదుగుర్ని బాగా చదివించి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు. కూడబెట్టిన ఆస్తులను, డబ్బును సమానంగా పంచి, పెళ్లిళ్లు చేశారు. ముగ్గురు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు వాళ్ల వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్ల బాధ్యతల్లో ఉన్నామని చెప్పారు. దాంతో చివరికి ఆ భార్యాభర్తలు అందరూ ఉన్నా అనాథలుగా స్థానిక వృద్ధాశ్రమంలో చేరారు. ఇలా ఎంతోమంది అమ్మానాన్నలు చివరిదశలో కుమిలిపోతూ ఒంటరిగా బతుకుతున్నారు.
 

                                                                పెరుగుతున్న ఆయుర్దాయం..

మనిషి సగటు ఆయుర్దాయం 1950లో 46 సంవత్సరాలు. అది- 2010లో 68 ఏళ్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో 2019లో 65 ఏళ్లు దాటినవారి సంఖ్య 70.3 కోట్లు. అది 2050 నాటికి 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతికత అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణపై సమాజంలో పెరిగిన అవగాహన మనుషుల ఆయుర్దాయాన్ని పెంచింది.
 

                                                                              సమాజం బాధ్యత

పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం బాధ్యతల మధ్య తమ రోజువారీ పనులకు ముసలివాళ్లు అడ్డుగా ఉన్నారని.. 'చిన్న పనులు కూడా చేసుకోలేరా?' అంటూ కొంతమంది విసుక్కుంటూ ఉంటారు. అప్పుడు పెద్దల మనసు ఎంతో వేదనకు గురవుతుంది. మానసికంగా కుమిలిపోతారు. తాము 'ఏ పని చేసుకుని బతకలేకపోతున్నాం, పిల్లల మీద ఆధారపడి జీవిస్తున్నాం' అని లోలోపల మదనపడతారు.
           ప్రేమ, ఆత్మీయత చూపని పిల్లల వల్ల, ఉద్యోగాల కోసం దూరప్రాంతాల్లో ఉంటున్న కొడుకు- కోడళ్ల వల్ల, ఆస్తుల వివాదాలు.. ఇలా ఎన్నో కారణాలు, వాటి తాలుకు ప్రభావాలు- వృద్ధులు ఒంటరిగా జీవించేలా చేస్తున్నాయి. కన్న పిల్లల ఆదరణ కోసం, 'అమ్మా..నాన్నా' అన్న పిలుపు కోసం వారి హృదయాలు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాయి. ఇటువంటి వారికి చుట్టూ ఉన్న సమాజం అండగా ఉండాలి. పిల్లలు లేని వారు దత్తత తీసుకుని పెంచుకుంటారు. మరి ఏ దిక్కూలేని వృద్ధుల పరిస్థితి ఏంటి? అందుకే సమాజంలోనూ కొంత మార్పు రావాలి. ఆయా ప్రాంతాలో ఉన్న వృద్ధులందరినీ ఒక దగ్గరకు చేర్చి, నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో నిమగమయ్యేలా ప్రోత్సహించాలి. వారి అనుభవాలను పంచుకుంటే.. అవి జీవనోపాధి మార్గాలుగా నిర్వహించవచ్చు. చిన్న చిన్న ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, డ్యాన్స్‌, వ్యాయామం చేయిస్తుండాలి. తోట పని, మొక్కల పెంపకం అప్పగించాలి. దాంతో వారికి మానసికోల్లాసం కలిగి, ఒంటరి వాళ్లమన్న బాధ క్రమక్రమంగా తగ్గిపోతుంది. వీరిలో వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్నవారిని గుర్తించి, వారి మేధాజ్ఞానాన్ని భవిష్యత్‌ తరాలకూ అందించొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యశిబిరాల ద్వారా చికిత్స అందించాలి. శస్త్రచికిత్సలు చేయించాలి.. అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. అప్పుడే వారికి కొన్నాళ్లు అయినా జీవించాలన్న ఆశ కలుగుతుంది.
       ప్రభుత్వాలు కూడా వృద్ధుల పట్ల సానుకూలంగా ఆలోచన చేయాలి. పోషకాహారం అందజేయడం, అర్హులకు ఫించన్లు, ఉచిత వైద్యసదుపాయం కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించడం, ఉచిత రవాణా సదుపాయం, అత్యవసర పరిస్థితుల్లో సహాయచర్యలు చేపట్టాలి.
 

                                                                        పెరుగుతున్న వృద్ధాశ్రమాలు..

చాలా మందికి పెద్దవాళ్లు అయిన తల్లిదండ్రుల సలహాలు, మాటలు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్నారన్న భావనతో చిన్నచూపు చూస్తుంటారు. మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం ప్రభావం చూపుతుందనడం సందేహం లేదు. ఈ క్రమంలో వారిని భరించలేక కన్నబిడ్డలే వృద్ధాశ్రమాల్లో చేర్చుతున్నారు. పిల్లలు లేనివారు, విదేశాలకు వెళ్లిన పిల్లల తల్లిదండ్రులు ఆశ్రమాల్లో చేరుతున్నారు. యాభై, ఆరవై ఏళ్లు కన్నబిడ్డల కోసం శ్రమించి, వృద్ధాప్యంలో అయినవాళ్లకు దూరంగా బతకడం వారికి నిజంగా నరకమే.

33

                                                                        వాదనలు విడిచి..

భార్యాభర్తల్లో ఏ ఒక్కరి తల్లిదండ్రులైనా వృద్ధులైతే.. ఇరువురూ వారి బాధ్యతను స్వీకరించాలి. 'కొడుకు-కోడళ్లు చూడాలి.. ఆస్తిలో సగభాగం తీసుకున్న కూతురే చూడాలి..' అనే వాదనలు వస్తూ ఉంటాయి. ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే.. మన బాల్యంలో అల్లరి భరించి, చదివించి, ఇష్టమైనవి అన్నీ అందించి, పెళ్లిళ్లు చేసి, పురుళ్లు పోసి, మన సంతానాన్ని పెంచుతారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతారు. కానీ చివరకు తమ పని తాము చేసుకోలేని స్థితికి చేరతారు. అప్పుడే కుటుంబసభ్యుల ఆదరణ అవసరం. 'ఆస్తులు ఏమీ కూడబెట్టలేదని, అంతా కూతురికే ఇచ్చావు.. కొడుక్కే పెట్టావు..' అంటూ గొడవలు పడటం కన్నా.. వారితో ప్రేమగా 'నేనున్నా.. ఉన్నదాంట్లోనే మిమ్మల్ని చూసుకుంటా' అన్న మాటలే వారికి ప్రాణం నిలుపుతాయి. కొంతమంది అమ్మలను, అత్తలను తమ అవసరాలకు వాడుకుని, చివరకు వదిలేస్తుంటారు. ఎన్ని ఒత్తిళ్లు, బాధ్యతలున్నా ముసలివాళ్లను పసిపిల్లల్లా చూసుకోవడమే మానవత్వం.
 

                                                                                 బాధ్యతగా...

చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను మంచానికే పరిమితం చేస్తుంటారు. ఇది సరైనది కాదు. వీల్‌ఛైర్స్‌ సాయంతో వారంలో ఒకసారి అయినా బయటకు తీసుకెళ్లాలి. ప్రతిరోజూ గంట అయినా రక్తసంబంధీకులు వారి దగ్గర కూర్చొని, కొత్త విషయాలు చెప్పాలి. మేమున్నామని భరోసానివ్వాలి. దాంతో ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా నిద్ర పోగలుగుతారు. రోజూ పౌష్టికాహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకునేలా చేయాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఎక్కువగా తాజా కూరగాయలు ఉండేలా చూడాలి. నిత్యం పండ్లు తినేలా ప్రోత్సహించాలి. ఉప్పు, తీపి, కొవ్వు కలిగిన ఆహారాలను తగ్గించాలి. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడపాలి. కళ్లజోడు, వినికిడి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. మతిమరుపు సమస్య నుంచి బయటపడేందుకు డైరీ మెయింటేన్‌ చేయాలి. మెదడుకు పదును పెట్టే వ్యాపకాలపై దృష్టి పెట్టేలా చూడాలి. బిపీ, షుగర్‌ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు చెక్‌ చేయిస్తూ బాధ్యతగా ఉండాలి.
 

                                                                         సహనం పాటించాలి..

వయస్సు రీత్యా పెద్దవాళ్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవీఇవీ చెబుతూంటారు. అప్పుడు వారిపై కోపం తెచ్చుకోకుండా ఓపికగా వ్యవహరించాలి. వారు రోజువారీ పనుల్లో చాలా విషయాలు మరిచిపోతూ ఉంటారు. పదే పదే చెప్పాల్సి వస్తోందని విసుక్కోవడం, అందుకు వారిని నిందిస్తూ దుర్భాషలాడటం చేయకూడదు. సహనం చూపాలి. పసిపిల్లలు చేసే అల్లరి ఏవిధంగా భరిస్తామో.. వీరిని అదేవిధంగా చూసినప్పుడే ప్రశాంతమైన జీవనం గడుపుతారు. ఇప్పుడు తల్లిదండ్రులను చూడని పిల్లలు రేపటిరోజున తామూ వృద్ధులమవుతామని గుర్తించుకుని మసులుకోవాలి. ఇరువైపుల కన్నవారిని కనిపెట్టుకుని ఉండాలి.

                                                                    ఇలా వృద్ధుల దినోత్సవం...

ప్రతి ఇంట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన పెద్దలకు వయస్సు పైబడ్డాక వారిపట్ల నేటితరం వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని.. అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించారు. వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్‌ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1991లో, అక్టోబరు 1ని 'అంతర్జాతీయ ప్రపంచ వృద్ధుల దినోత్సవం'గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు వివిధ చర్యలు చేపట్టాయి.

పద్మ
94905 59477