
అమరావతి : మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఎపి, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా వానజల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో... గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన వాతావరణశాఖ.. ఈ మేరకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
భారీ వర్షాల నేపథ్యంలో ... అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నగర పరిస్థితులను జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద నేపథ్యంలో... ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న వేళ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని చెప్పారు. మరో 2, 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తలసాని ఆదేశించారు.