Jan 04,2023 08:48
  • మధురవాడలో భూకేటాయింపులు ఆపాలి
  • హైడ్రో ప్రాజెక్టులు గిరిజన చట్ట ఉల్లంఘనే
  1. న్యాయ కమీషన్‌ విచారణ కోరుతూ ముఖ్యమంత్రికి ఇఎఎస్‌ శర్మ లేఖ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖలోని మధురవాడ సర్వే నెంబరు 409లో 130 ఎకరాల విస్తీర్ణంలో అదానీ గ్రూపు ఏర్పాటు చేయనున్న డేటా ఎనలటిక్స్‌ సెంటర్‌ (డిఎసి)కు అనుమతులిస్తూ భూమి కేటాయించడం సరైంది కాదంటూ విశాఖకు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో కారుచౌకగా కట్టబెట్టడం అభ్యంతరకమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో హైడ్రో ప్రాజెక్టులపైనా, గంగవరం పోర్టులో వ్యూహాత్మక ఈక్విటీ వాటా అమ్మేయంపైనా ఈ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.
 

                                                                 130 ఎకరాల మార్కెట్‌ విలువ రూ.4 వేల కోట్లు

అదానీ గ్రూపునకు ప్రభుత్వం ఇచ్చిన 130 ఎకరాల భూమి విలువ రూ.4000 కోట్లు దాటుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2012 సెప్టెంబర్‌ 14 నాటి జిఒ ఎంఎస్‌ నెంబర్‌ సంఖ్య 571 ద్వారా నోటిఫై చేసిన భూవినియోగ విధానం ప్రకారం చూస్తే ప్రజాప్రయోజనాల కోసం ప్రయివేట్‌ ఏజెన్సీలు, సంస్థలకు లీజుకు ఇచ్చిన భూమికి సంవత్సరానికి లీజు అద్దె దాని మార్కెట్‌ విలువలో పది శాతం కంటే తక్కువగా ఉండకూడదు. దీని ప్రకారం మధురవా డలో భూమి లీజుకు అద్దె సంవత్సరానికి రూ.400 కోట్లు కంటే తక్కువకు ఇవ్వకూడదు. కానీ, ప్రభుత్వం రూ.130 కోట్లకు కేటాయించడం దారుణం. భూమితో సహా సహజ వనరులను ప్రయివేట్‌ వ్యక్తులకు కేటాయించే విషయంలో పారదర్శకత అవసరమని సుప్రీం కోర్టు పదేపదే గతంలో నొక్కి చెప్పింది. అలాంటి పారదర్శకత లేకపోవడం దారుణం.
 

                                                                      ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను ఉల్లంఘిస్తూ...

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మొత్తం 5000 నుంచి 6000 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న నాలుగు నుంచి ఐదు పంప్డ్‌ స్టోరేజీ పథకాలను ఏర్పాటు చేయడానికి ఆదానీ గ్రూపు నేతృత్వంలోని జాయింట్‌ వెంచర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయులపై సంతకాలు చేసింది. ఇది పీసా, షెడ్యూల్డ్‌ ప్రాంతాలు, ఇతర అటవీ ప్రాంతాలకు వర్తించే ఎఫ్‌ఆర్‌ఎ చట్టాల కింద ఆదివాసీ గ్రామసభల ప్రాధాన్యతను ఉల్లంఘించడం కాదా? అటువంటి ప్రాజెక్టులు ప్రాథమికంగా చట్టవిరుద్ధం మాత్రమే కాక, స్థానిక ఆదివాసీ సంస్కృతికి విఘాతం కలిగిస్తాయి. ఆ ప్రాజెక్టులు గిరిజన ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రతికూల ప్రభావాన్నీ చూపుతాయి. ఆదానీ గ్రూపునకు కేటాయించిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు జాతీయ జల-విద్యుత్తు విద్యుత్తు విధాలా ఉల్లంఘించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదానీ గ్రూపునకు రాయితీలు కల్పించే తీరు ప్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టి రాష్ట్రం దివాళా తీయడానికే తోడ్పడుతుంది మినహా రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రమూ ప్రయోజనం ఉండదు.
 

                                                 గంగవరం పోర్టులోనూ వ్యూహాత్మక ఈక్విటీ వాటా అమ్మేయలేదా ?

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టులో తన వ్యూహాత్మక 10.5 శాతం ఈక్విటీ వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించింది. ఇది కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసే విధానం. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడానికి కేంద్రం తీసుకున్న తెలివితక్కువ చర్యను అనుసరించి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే దాని వాదనను బలపరిచేందుకు కూడా ఇది అదానీ గ్రూపునకు మార్గం సుగమం చేసినట్టు కాదా? ఓడరేవును పూర్తిగా ప్రయివేటీకరించే అత్యంత అభ్యంతరకర చర్యలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేతులు కలిపింది. ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు సెంటిమెంట్‌ ప్రభావం ఎక్కువగా ఉందని పరిగణలోకి తీసుకుంటే కేంద్రంతో కుమ్మక్కైన రాష్ట్రం ఉద్దేశపూర్వకంగా ఎపిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నడుచుకుందన్నది పైచర్య సూచిస్తోంది. కృష్ణపట్నం ఓడరేవుకు రాష్ట్ర ప్రభుత్వం యజమాని. దానిలో వాటాను ప్రభుత్వం కలిగి ఉన్నప్పటికీ దీన్ని పట్టించుకోకుండా ఆ పోర్టులో వంద శాతం వాటాను అదానీ పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అదే సమయంలో ఎంతో నైపుణ్యం, మరెంతో సామర్థ్యం, అనుభవం కలిగిన ప్రభుత్వ నిర్వహణలోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్వహణను కూడా రాష్ట్ర ప్రభుత్వం అదానీపరం చేస్తుందన్న పుకార్ల సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వంటి విలువైన ఆస్తులను వెండిపల్లెంలో అప్పగించి ఆ వర్గానికి అదనపు అనుచిత ప్రయోజనాలను కల్పించేందుకు రాష్ట్రం తన అసమ్మతిని వ్యక్తం చేయడానికి బదులు లొంగిపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అదానీ గ్రూపునకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలపై న్యాయ కమీషన్‌ విచారణ చేయాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నిర్ణయాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? ప్రయివేట్‌ ఏజెన్సీలకా? ప్రజల దృష్టిలో తన విశ్వసనీయతను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం పైనపేర్కొన్న వాటికి అంగీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను.