ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న విజయవాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు శనివారం మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్.శ్రీనివాస్, డి.క్రాంతి కుమార్‌లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయటం లేదన్నారు. పెద్దాపురం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్‌కి యూనిఫామ్, జోళ్ళు, నూనె అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి విజయవాడలో ధర్నా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వర్రె గిరిబాబు, శివకోటి అప్పారావు, సింహాచలం, సత్తిబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.










