మాటలకందని మారణహోమం.. ఊహకందని యుద్ధోన్మాదం... గాజాలో పెను మానవీయ విపత్తుకు దారితీస్తోంది. 23 లక్షల జనాభా కలిగిన గాజా స్ట్రిప్‌లో గత మూడు వారాలుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న దారుణ మారణకాండను ఎంత ఖండించినా తక్కువే. ఇది మానవాళి పట్ల మహా నేరం. అన్ని అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను కాలరాస్తున్న ఈ ఇజ్రాయిల్ ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాల్లో నిరసనలు హౌరెత్తుతున్నాయి. లండన్‌లో ఆదివారం అయిదు లక్షల మందితో జరిగిన భారీ ర్యాలీ ఇజ్రాయిల్ ఆటవిక దాడులను నిర్ద్వంద్వంగా ఖండించింది. అమాయక పౌరుల సామూహిక హననాన్ని ఆపేందుకు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. నెతన్యాహు నేతృత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వం వీటిని బేఖాతరు చేస్తూ తన హంతక దాడులను మరింత ఉధృతం చేయడం దాని కండకావరాన్ని తెలియజేస్తోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అండ చూసుకునే అది ఇంతగా పేట్రేగిపోతోంది. కాల్పుల విరమణకు అంగీకరించడమంటే హమాస్ మరింత బలపడేందుకు అవకాశమివ్వడమేనని, ఉగ్రవాదానికి మరింత ఊతమి వ్వడమేనంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఆయనలోని కరడుగట్టిన జాతి దురహంకారానికి దర్పణం పడుతున్నాయి... అక్టోబరు 7 హమాస్ దాడి తరువాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై నిరంతరాయంగా సాగిస్తున్న దాడుల్లో ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు చివరికి ఐరాస సహాయక శిబిరాలు సైతం ధ్వంసమయ్యాయి. ఓ వైపు గగన తలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తూ, మరోవైపు భూతల దాడులు, సముద్రం నుంచి ఇలా ముప్పేట దాడులు సాగిస్తూ, అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నది. అభంశుభం తెలియని పసిబిడ్డలను, అమ్మలను సైతం అంతమొందిస్తోంది. ఈ మారణహోమాన్ని ఖండించి, పాలస్తీనీయులకు అండగా నిలవాల్సిన భారత్ తద్భిన్నమైన వైఖరి తీసుకోవడం దారుణం.
1948లో పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి ఒక పథకం ప్రకారం భూ ఆక్రమణకు పాల్పడుతూ పాలస్తీనీయులను తన సొంత గడ్డపై శరణార్థులుగా మార్చింది. తూర్పు జెరూసలెం రాజధానిగా 1967 నాటికి ముందున్న సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఐరాస చేసిన తీర్మానాలను తుంగలో తొక్కి దాదాపు 90 శాతం పాలస్తీనా భూభాగాన్ని కబళించింది. తీర్మానాలు, ఒడంబడికలు ఎన్ని జరిగినా... వాటన్నింటినీ అమెరికా, పశ్చిమ దేశాల మద్దతుతో బాహాటంగా ఉల్లంఘిుస్తున్నది. గాజాను బహిరంగ జైలుగా మార్చేసింది. శాంతియుత మార్గంలో వెళితే పది రెట్లు బలంతో అణచివేతకు దిగుతున్నదని, దీనికి సాయుధ ప్రతిఘటనే మార్గం అన్న భావన నుంచి ఉద్భవించినదే హమాస్ అనే విషయం గుర్తించాలి. అక్టోబరు 7 దాడి తరువాత ఆగమేఘాల మీద ఇజ్రాయిల్‌లో పర్యటించిన అమెరికా, ఫ్రాన్స్, యుకె అధినేతలు ఈ యుద్ధానికి మరింత ఆజ్యం పోశారు. . అమెరికా, బ్రిటన్ ఇచ్చిన ఆయుధాలతోనే ఇజ్రాయిల్ పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్నది. వారికి ఆహారం, మందులు, అత్యవసర వైద్యం సైతం అందకుండా దిగ్బంధించి మానవీయ సంక్షోభానికి కారణమవుతున్నది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 3,200 మందికిపైగా చిన్నారులుసహా ఎనిమిదివేల మందికిపైగా పాలస్తీనా వాసులు చనిపోయారు. ఈ మృతుల్లో 75 శాతం చిన్నారులు, మహిళలేనని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది.
కాల్పుల విరమణ పాటించాలని, పౌరులందరికీ రక్షణ కల్పించి, తక్షణమే మానవతా సాయం అందించాలని కోరుతూ ఐరాస జనరల్ అసెంబ్లీలో తెచ్చిన తీర్మానానికి అనుకూలంగా 121 దేశాలు, వ్యతిరేకంగా 14 ఓటు వేయగా, భారత్, మరో 44 దేశాల ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అలీనోద్యమానికి కట్టుబడి గాంధీ, నెహ్రూ కాలం నుంచి అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా మోడీ సర్కారు వ్యవహరించి పాలస్తీనీయులకు తీరని ద్రోహం చేస్తున్నది. ఇండియా- మధ్య ఆసియా- యూరోప్ వాణిజ్య కారిడార్‌లో అదానీ ఓడరేవులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనో, అమెరికా ఒత్తిడి ఫలితమో కానీ ఇజ్రాయిల్ ఫాసిస్టు దాడులకు మద్దతు పలకడం ద్వారా భారత దేశ ప్రతిష్టను మోడీ ప్రభుత్వం మంటగలిపింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా అనుకూల, ఇజ్రాయిల్ అనుకూల విధానంగా మార్చిన మోడీ ప్రభుత్వ ఈ తిరోగమన వైఖరిని ప్రతి ఒక్కరూ నిరసించాలి. అదే సమయంలో అమెరికా, పశ్చిమ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా వాసులకు మద్దతుగా సాగుతున్న సంఘీభావ కార్యక్రమాల్లో దేశంలోని లౌకిక, ప్రజాతంత్రవాదులంతా పాల్గొనాలి. తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలి.