Sep 02,2023 15:14

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : ఇసుక రీచ్‌లకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు ఆరోపించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై శనివారం ఆయన స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ.. రాజంపేట డివిజన్‌లోని చెయ్యేరు పరీవాహక ప్రాంతాలైన కుమ్మర నూనె పల్లె, బాలరాజు పల్లి, నారాయణ నెల్లూరు, శేషమాంబ పురం, మందరం, కోమంత రాజపురంలలో ఇసుక రీచ్‌ లకు ఇచ్చిన గడువు ఈ ఏడాది మార్చి 15 నాటికి పూర్తయిందని అన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సైతం పెడచెవిన పెడుతూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారన్నారు. రీచ్‌ లలో 25 నుంచి 30 అడుగులు లోతున ఇసుక తవ్వకాలు జరిపి పర్యావరణానికి హాని చేస్తూ బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగం నిద్రపోతోందని ఆరోపించారు. వ్యవసాయ అవసరాలకు రైతులు పొలానికి ఎడ్లబండ్లలో ఇసుకను తోలుకున్నా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైసిపి నేతలను మాత్రం అడ్డుకోవడంలో పోలీసులు విముఖత చూపిస్తున్నారన్నారు. జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఇటీవల రీచ్‌ ల వద్ద ఆందోళనకు దిగితే పోలీసులు తమనే అడ్డుకుంటున్నారు కానీ ఇసుక దొంగలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులైన జిల్లా కలెక్టర్‌, విజిలెన్స్‌ ఎస్పి ఇసుక అక్రమ తవ్వకాలపై స్పందించి ఇప్పటివరకు వైసీపీ నేతలు పాల్పడిన ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుని ఇకమీదట అనుమతులు లేకుండా తవ్వకాలు జరపకుండా గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ చెన్నూరు సుధాకర్‌, వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.