ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని రెవెన్యూ కాలనీ లే అవుట్ అక్రమ మార్పిడిని రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1987లో ఆదోని మండిగిరి పంచాయతీ ఆదోని ఆర్ట్స్ కళాశాల వెనుక రెవెన్యూ శాఖ స్థలంలో లే అవుట్ వేసి రెవెన్యూ ఉద్యోగులకు మార్కెట్ ధరకు ఐదున్నర సెంట్ల చొప్పున ప్లాట్లు కేటాయించారన్నారు. 2019లో సదరు లే అవుట్‌ను నిబంధనలకు విరుద్ధంగా మార్చివేసి అన్యాయం చేశారన్నారు. విచారణ చేపట్టి సదరు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త లేఅవుట్‌ను రద్దు చేసి పాత లేఅవుట్‌ను గుర్తించాలన్నారు. రోడ్లు, పార్కునూ స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలన్నారు. లేనిపక్షంలో సదరు అక్రమ లే అవుట్‌పై స్టే తెచ్చి లోకాయుక్తలో కేసు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ వసీమ్ సాహెబ్, నరేంద్ర యాదవ్, జావేద్, గౌస్ పాల్గొన్నారు.










