ఓరోరి.. వెర్రోడా!!
ఏం కూసితివి!!
లష్కర్ కోడి నయం!!
ఉరికించి దూకించి
కఠోర శ్రమని దోచుకునే కుట్ర కాదా?!
మా మంగలి గోపన్న
మా ఊర్లో రావి చెట్టు కింద
తలొంచి వేసే కత్తెర్లే
మాకు నేర్పుతాయి!
క్షవరం!! మీకిక తప్పదులే!
చౌడు మన్ను కనుగొన్న
మా చాకలన్న ఉతికే
బట్టలు మల్లెపూలోలే మెరియు!
మా చాకిరేవుల మీకిక ఉతుకులే!
గంపెడు సంసారం ఈదలేక
స్టీరింగ్ బట్టుకున్న మా హుస్సేన్
వేసే చక్కర్లు మా డ్రైవింగ్‌కి పునాది
చక్రాల కింద నలుగు రాజ్యం
మా సమాజంలో దొరికే శిక్షణ లొదిలి
మా చదువుల గాలికొదిలి
పరుగు పందేలు
లాంగ్ జంప్ హై జంప్‌లు
రకరకాల విన్యాసాలు ఈది
రాత పరీక్షల నెగ్గి మా వృత్తులు నేర్చుకోవాలా?!
ఏం జెబితివి!!
ఎన్నాళ్లున్నా మేం గీ వృత్తులల్ల బతుకులీడుస్తుంటే
మీరేమో రాజ్యమేలుతారా?!
సైన్యం నిండా కాలే కడుపుల బిడ్డలే
ఆక్రోశం పెల్లుబికితే
ధ్వనించేది విప్లవ శంఖారావం!!
తరగతుల వారీగా
నిరసన సెగలు రాజుకుంటున్నాయి
నిరంకుశత్వ పోకడల
అంతం చూసే దిశ గా!!
- గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201