Feb 24,2023 07:25

సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్శిటీ ఉన్నత అధికారులే...మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బిజెపి, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వవిద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బిజెపి బలంగా వున్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా వుంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.

నంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయంలో గత రెండు నెలల్లో కొందరు ఉద్యోగులు చనిపోయారు. ఈ మరణాలతో వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌ ఆవేదన చెందారట! ఈ చావులను అడ్డుకునేందుకు బోధన, బోధనేతర సిబ్బందికి అత్యవసరంగా ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ నెల 24న యూనివర్శిటీ క్యాంపస్‌లో ధన్వంతరి మహా మృత్యుంజయ యాగం చేద్దాం, అందుకు బోధన ఉద్యోగులు రూ.500, బోధనేతర సిబ్బంది రూ.100 చెల్లించి తమ పేరిట పూజలు చేయించుకోవాలన్నారు. విద్యార్థి సంఘాలు, లౌకిక శక్తులు ప్రశ్నించడంతో రద్దు చేసుకున్నట్లు 23వ తేదీన రిజిస్ట్రార్‌ ప్రకటించారు. తాత్కాలికంగా యాగ ప్రయత్నాలు రద్దయినా ఈ ఆలోచన ఒక్క వి.సి, రిజిస్ట్రార్‌లకు తట్టినది కాదని, దేశంలో అనేక యూనివర్శిటీలలో జరుగుతున్న ఛాందసవాద భావజాల విస్తృతిలో భాగమని గుర్తించాలి. వైస్‌ ఛాన్సలర్‌, రిజిస్ట్రార్‌ ఇద్దరూ సైన్స్‌ విభాగాల్లోనే పిహెచ్‌డిలు చేశారు. వారు సైన్స్‌ అధ్యాపకులు కూడా. అయినా ఇలా ఎందుకు ఆలోచించారు. దీనికి మూలం దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న మతఛాందసవాదుల ప్రయత్నాలు, అధికారంలో వున్న వారి మనసును ఆకట్టుకోగలిగితే...ఎంతటి ఉన్నత పదవులైనా రాత్రికి రాత్రి వచ్చి తమను వరిస్తున్న తీరు ఇందుకు కారణాలు.
        తమ వ్యక్తిగత విశ్వాసాలకు యూనివర్శిటీని కేంద్రంగా చేసుకుంటూ వి.సి, రిజిస్ట్రార్‌లు అధికారికంగా ప్రయత్నాలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. విజ్ఞాన కేంద్రాలుగా వుండాల్సిన విశ్వవిద్యాలయాలను అజ్ఞాన కేంద్రాలుగా మారుస్తారా? అని విద్యార్థి సంఘాలు, మేధావులు వి.సి ని ప్రశ్నిస్తే, యాగం నిలిపివేసే ప్రసక్తి లేదని, అవసరమైతే యాగానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని వి.సి, యాగం నిర్వహించండి మీకు అండగా వుంటామని ఎబివిపి నాయకులు ప్రకటించారు. డబ్బు తనది కావచ్చేమో కాని (అది కూడా ప్రజలు చెల్లించే పన్నుల నుండి వస్తుందని ఆయన గమనించడంలేదు), యాగం నిర్వహించాలనుకుంటున్న స్థలం తనది కాదని, అది ఉన్నత పరిశోధనలకు, భావాలకు, కుల, మత, ప్రాంతీయ సంకుచిత పరిధులకు మించిన విశాల విశ్వవిద్యాలయమనే విషయాన్ని ఆయన మరచిపోయారు. బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు రూపాలుగా పని చేయడం విశ్వవిద్యాలయాల కర్తవ్యమని, ఈ కర్తవ్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను చూడాలిగాని, తన వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా యజ్ఞాలు, యాగాలు, బలులు, జాతరలు చేసుకోవడానికి కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలి. సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేసి ఈ స్థాయికి చేరుకున్న యూనివర్శిటీ ఉన్నత అధికారులే...మానవ మరణాలకు యాగాలు విరుగుడని భావించే స్థితికి దిగజారితే ఇక సమాజానికి దిక్కెవరు? విద్యను కాషాయీకరణ చేయాలనే బిజెపి, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల ప్రభావం ఎంత తీవ్రంగా విద్యాలయాల్లోకి చొరబడుతున్నదో అందునా విశ్వవిద్యాలయాల్లోకి ఎంత వేగంగా వస్తున్నదో ఈ ఘటన తెలియచేస్తోంది. బిజెపి బలంగా వున్నచోటే దాని భావజాల ప్రమాదం ఎక్కువగా వుంటుందనుకునే వారికి ఈ పరిణామం ఒక హెచ్చరిక.
 

                                                                 శాస్త్రీయ విద్య అందరి హక్కు

మన విద్యావ్యవస్థ ఎలా ఉండాలనేది జాతీయోద్యమంలో ప్రధాన చర్చనీయాంశం. ప్రాచీన కాలంలో విలు విద్య, గురుకుల ఆశ్రమ విద్య కేవలం కొద్దిమంది మాత్రమే పొందే అవకాశం వుండేది. కొద్దిమంది తమ ప్రయోజనాల కోసం బహుజనులను కులాలుగా విడగొట్టి, వ్యక్తిగత జ్ఞానానికి, సమాజ పురోగతికి అనేక శతాబ్దాలుగా ఆటంకంగా నిలిచారు. ఈ పరిస్థితులు కొనసాగాలన్న ఉద్దేశంతోనే బ్రిటిష్‌ పాలనాకాలంలో తమ పలుకుబడిని వినియోగించి చాలకాలంగా అసంఖ్యాకులను విద్యకు దూరం చేశారు. అయితే వ్యాపారంలో వచ్చే లాభం ముందు అన్ని ఆచారాలు, మూఢనమ్మకాలు పక్కకు పోయినట్లుగానే వీలైనంతమందికి ఎంతో కొంత చదువు నేర్పి తమ వ్యాపారాన్ని, పరిపాలనను విస్తరించాలనుకున్న బ్రిటీష్‌ పాలకులు క్రిస్టియన్‌ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించారు. పురాణ సాంప్రదాయవాదులు ఎంత గగ్గోలు పెట్టినా, శాపనార్థాలు పెట్టినా విద్య కింది వర్గాలకు కొంతమేరకైనా చేరింది. విద్యాభివృద్ధి లేకుండా సమాజ పురోగతి లేదని జాతీయోద్యమ నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యం నుండే అందరికి విద్య, విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అందించాలని రాజ్యాంగంలో ప్రత్యేకంగా పెర్కొనడం జరిగింది. ఆదేశిక సూత్రాల్లో ప్రాథమిక ఉచిత విద్య గురించి, ముఖ్యంగా ఆర్టికల్‌ 51ఎ హెచ్‌ లో శాస్త్రీయ విజ్ఞానాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పారు.
          1960-70 వరకు అనేక పరిమితులు వున్నప్పటికీ పాఠ్యాపుస్తకాల్లో కొద్దిమేరకైనా శాస్త్రీయ సిలబస్‌లు వుండేవి. ప్రపంచవ్యాప్తంగా వున్న పురోగామి భావజాలం, దేశ స్వావలంబనకు శాస్త్రీయ పరిశోధనలు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్‌, రవాణా, తంతి తపాలా లాంటి అనేక విజ్ఞాన కార్యకాలపాలు ప్రజలను ఉత్తేజితం చేశాయి. వీటన్నింటివల్ల తరాలుగా విశ్వసించిన అశాస్త్రీయ భావాలు ప్రజల నుండి కొద్దిమేరకైనా వెనుకపట్టు పట్టాయి. విజ్ఞానం కొద్దిమంది బుర్రల్లోనే వుండాలని, తమ పెత్తందారీ భూస్వామ్య భావజాలం ఎల్లకాలం కొనసాగాలని భావించే పరాన్నబుక్కు సాంప్రదాయవాదులు ఏదో రూపంలో తమ అజ్ఞాన భావాలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తూనే వచ్చారు. భారత ప్రజలు రచించుకున్న రాజ్యాంగం వీరికి ఆటంకంగా నిలిచింది. అందుకే వారు ప్రతినిత్యం ఏదోరూపంలో రాజ్యాంగాన్ని విమర్శిస్తూనో, ధిక్కరిస్తూనో వచ్చారు. ఇలాంటివారికి ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రంగా పనిచేసింది. తాము అధికారంలోకి వస్తే 'పాశ్చాత్య ప్రభావాల నుండి పాఠ్యపుస్తకాలను ప్రక్షాళన చేయడం, విద్యను కషాయీకరణ చేయడం' లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము సృష్టించుకున్న బిజెపి గతంలో అధికారంలోకి వచ్చిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వీరవిధేయుడైన మురళీ మనోహర్‌ జోషిని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించి ఇందుకు తెరలేపింది. 2014 తరువాత విద్యను పూర్తిగా కాషాయీకరణ చేసేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నది. 2005 నాటి నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ను పూర్తిగా ఉల్లంఘంచి హిందూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు చరిత్ర పాఠ్యాంశాలతో పాటు మొత్తం విద్యా వ్యవస్థనే మార్చేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు దేశాన్ని ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా మారుస్తామనే మాటల గారడీ చేస్తూ 21వ శతాబ్దపు సైన్స్‌ ఫలాలను సంపూర్ణంగా అనుభవిస్తూ, 18వ శతాబ్దం నాటికి దేశాన్ని తీసుకు వెళ్లాలని బిజెపి పాలకుల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది.
 

                                                                      ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా

మతమూఢత్వం ఎల్లపుడూ శాస్త్రవిజ్ఞానానికి విరోధమే. మతమౌఢ్యం విశ్వాసం ఆధారంగా అజ్ఞానాన్ని ఆశ్రయించి అందులోనే జీవించాలనుకుంటే...శాస్త్ర విజ్ఞానం పరిశోధనల ఆధారంగా తాను పురోగమించడమే గాక, అజ్ఞానులను కూడా శాస్త్రీయ మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నేడు కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాని పురణాల్లోనే ప్లాస్టిక్‌ సర్జరీ వుందని, అందుకు వినాయకుడు సాక్ష్యం అన్నారు. మరొక చోట టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రయోగాలకు కౌరవుల పుట్టుకను ఉదహరించారు. హోంమత్రి రాజనాథ్‌ సింగ్‌ 'ప్రఖ్యాత శాస్త్రవేత్త వెర్నర్‌ హైసెన్‌బర్గ్‌ అనిశ్చితి సిద్ధాంతం వేదాలపై ఆధారపడింది' అని ప్రకటించారు. విమానాన్ని కనిపెట్టింది జాన్‌ రైట్‌ సోదరులు కాదు, మన పురణాల్లోనే పుష్పక విమానం వుందని మరో కేంద్రమంత్రి సెలవిచ్చారు. ఇలా ఒకరిద్దరు కాదని, మాజీ ఉపరాష్ట్రపతి మొదలు అనేకమంది బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు అశాస్త్రీయ నిర్ధారణలు చేసి ఇవే నిజమంటున్నారు. ఇది కాదు అన్నవారిని దేశద్రోహులు అంటున్నారు. వీరి ఆలోచనలకు ఊడిగం చేసినవారికి ఉన్నత పదవులు, రిటైర్‌మెంట్‌ తర్వాత రాజ్యాంగ పదవులు కట్టబెడుతున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో చిలకజోస్యం, జ్యోతిష్యం, మంత్రపూజలను పి.జి కోర్సులుగా ప్రవేశపెట్టారు. బెనారస్‌ యూనివర్శిటీలో భూత వైద్య సర్టిఫికెట్లు ఇస్తున్నారు. యోగా గురు, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌తో ఐఐటి ఖరగ్‌పూర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్కృతాన్ని శాస్త్రీయ భాష అని, గో విజ్ఞాన (కౌ సైన్స్‌) పరిశోధనలు చేయాలని కేంద్ర పాలకులు చెబుతున్నారు.
            మృత్యుంజయ యాగం చేయాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అధికారులు ప్రయత్నించడం మొదలూ కాదు, ఆఖరూ కాదు. గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య దోణప్ప వైస్‌ ఛాన్సలర్‌గా వున్న కాలంలో జ్యోతిష్యాన్ని డిగ్రీ, డిప్లమో కోర్సులుగా ప్రవేశపెట్టారు. దీనిపై పెద్ద వివాదం జరిగి చివరకు ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి హయాంలో జ్యోతిష్యం నిరూపితమైన శాస్త్రం కాదని తొలగించారు. అప్పుడు కూడా మతతత్వవాదులు అల్లరి చేశారు. ట్రినిటి కాలేజికి చెందిన 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ సెక్యులరిజం ఇన్‌ సొసైటీ అండ్‌ కల్చర్‌', భారత దేశానికి చెందిన 'సెంటర్‌ ఫర్‌ ఎంక్వైరీ' కలిసి దీనిపై పరిశోధన చేశాయి. 130 సంస్థలకు చెందిన 1100 మంది సైంటిస్టుల మీద చేసిన సర్వేని ప్రకటించాయి. ఇందులో 24 శాతం మంది దైవాంశ సంభూతులు వున్నారని, వారు అద్భుతాలు సృష్టిస్తారని, 49 శాతం మంది ప్రార్థనల వల్ల ప్రయోజనం వుంటుందని, 16 శాతం మంది విశ్వాస స్వస్థతపై నమ్మకం వుందని, 14 శాతం మంది వాస్తుపై, మరో 14 శాతం మంది జ్యోతిష్యంపై నమ్మకం వుందన్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి సర్వే నివేదికలు చూసేనేమో 'దేశంలో 90 శాతం మంది మూర్ఖులు వున్నారని' జస్టిస్‌ మార్కండేయ కట్జూ ఆవేదన చెందారు.
           శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది మరణాలకు కారణాలను పక్కదారి పట్టించి పాలకుల ఆశీర్వాదాలు పొందేందుకు అధికారులు మృత్యుంజయ యాగ జపం చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయరు. ఏడు నెలలుగా వేతనాలు లేవు. సిబ్బందిపై పని భారం, వేధింపులు పెరిగాయి. అప్పుల ఒత్తిళ్లు, ఆరోగ్యాన్ని కొనలేని పేదరికం వారి చావులకు అసలు కారణాలు కాగా వాటిని పరిష్కరించకుండా యాగాల గురించి మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి? కార్మికుల సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని బిజెపి, ఎబివిపి లాంటి సంస్థలు... 'యూనివర్శిటీలో యాగం వద్దు' అనే కనీస రాజ్యాంగ స్ఫూర్తిని సహించలేకున్నాయి. సరస్వతీ పూజలు, విగ్రహాల ఏర్పాటు, జన్మాష్టములు, తల్లిదండ్రులకు పాదాభివందనం లాంటి అనేక ముసుగులతో విద్యాలయాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్‌ చొరబడి చిన్న వయసులోనే విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నది. విశ్వవిద్యాలయాలను తమ కంబద హస్తాల్లోకి తీసుకోవాలని యుజిసి లాంటి సంస్థల్లో తమ మనుషులను నియమించి వారి ద్వారా ఈ రకమైన యజ్ఞయాగాలు, క్రతువులు చేయిస్తున్నది. రాష్ట్ర పాలకులు ఈ ప్రమాదకరమైన పోకడలను మొగ్గలోనే అడ్డుకోకపోతే ప్రజల ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీరని ద్రోహం చేసినవారవుతారు.

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /
వి. రాంభూపాల్‌

వి. రాంభూపాల్‌