Jul 21,2023 18:04

వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకడం చాలా మందిలో కనిపిస్తుంది. అయితే పాదాలను సంరక్షించుకోకపోతే చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా బయటి నుంచి వెళ్లినప్పుడు కాళ్లను కడుక్కోకపోవడం వల్ల బ్యాక్టీరియా అలానే ఉండి.. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్‌కి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఇన్ఫెక్షన్స్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు
- బురద, మురికినీటిలో నడిచి వచ్చి.. కాళ్లను శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్‌ సోకుతాయి. అందుకే బయట నుంచి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి. అలా కడుక్కున్న వెంటనే టవల్‌తో తుడుచుకోవాలి. కాళ్లపై బ్యాక్టీరియా అలానే ఉంటే.. ఇన్ఫెక్షన్స్‌ సోకి దురదకు దారితీస్తాయి.
- పాదాలకు ఇన్ఫెక్షన్స్‌ సోకి దురదతో బాధపడుతుంటే.. కొద్దిగా నిమ్మరసం, వెనిగర్‌లను కలిపిన మిశ్రమాన్ని దురద ఉన్నచోట రాసుకుని, కాసేపాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. దురద తగ్గుతుంది.
- సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా తొలగించుకోవడానికి గోరు వెచ్చని నీటితో కాళ్లను కడగాలి. బకెట్‌ లో గోరు వెచ్చని నీరు పోసి, సాల్ట్‌ వేసి బాగా కలిపి అందులో పాదాలను ఉంచాలి. ఓ 15 నిమిషాల తర్వాత తీసేసి శుభ్రంగా, పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
- వర్షాకాలంలో లెదర్‌ షూలు, బూట్లు ధరించకుండా స్లిప్పర్లు, క్లాగ్స్‌ లాంటివి వేసుకోవాలి. అవి రబ్బరు లాంటి పదార్థంతో తయారు కావడం వల్ల ఎక్కువసేపు తడిగా ఉండవు.