
సన్నగా పడుతున్న వాన చినుకుల్ని నాలుక బయటపెట్టి, రుచి చూస్తూ కేరింతలు కొడుతోంది సత్య. వానలో తడవొద్దని కిటికీలోంచి వారిస్తున్నాడు జేమ్స్. ఎంతకీ వినకపోయే సరికి... బయటకు వెళ్లి, సత్యని ఎత్తుకుని ముద్దులాడుతూ లోపలికి తీసుకొస్తూ పగలబడి నవ్వుతున్నాడు. వాన చినుకులు పడిన వెంటనే గుభాళించిన 'మట్టి వాసన' నన్ను చుట్టుముట్టింది ... నాన్న జ్ఞాపకం వచ్చాడు.
నాన్నకి తెలిసినవి రెండే రెండు వ్యాపకాలు.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ చదివించు కోవడం.. ఇష్టంగా వ్యవసాయం చేయడం..
'ఎందు కొచ్చిన యవసాయంరా సత్నాణ! ఏం గిట్టుబాటవుతోందని? పొలం అమ్మి పడేయొచ్చు కదా!' అంటున్న అత్త మాటలు వినేవాడు కాదు.
'నీకు తెల్దు ఊరుకోవే!' అంటూ.. ఎద్దుల్ని తోలుకుంటూ వెళ్ళి అరకతో పొలం దున్నుతుంటే కూడా వెళ్ళి గట్టున ఉన్న చెట్ల నీడలో కూర్చొని, పుస్తకాలు ముందేసుకుని చదువుతుంటే.. ఓరకంటితో నన్ను చూసుకుంటూ పని చేసుకునేవాడు. ఏకాగ్రతగా పొలంలో నాట్లు వేస్తున్న నాన్నని చూడడం భలేగా అనిపించేది. మడిలో కలుపు తీసినా, కొబ్బరి నారతో చాంతాడు పేనినా... ఏ పనైనా పూర్తి అయితే గానీ లేచేవాడు కాదు. ఆ ఏకాగ్రత, శ్రద్ధ నాకు కూడా అబ్బాయి. పుస్తకం చదవడం మొదలుపెడితే, మధ్యలో ఆపడం ఇష్టం వుండదు.
'ఈ పొలం మనదేరా బంగారు!' అంటున్న నాన్న మాటలు విని విని, పొలాన్ని చూస్తే.. ఏదో తెలియని గర్వం, ఆనందం కలిగేవి. ఆ నేలతల్లి ఒడిలో కూర్చుని చదువుతుంటే, 'ఇంకా బాగా చదువు జానకమ్మ!' అని చెట్టూ చేమా ప్రేమగా చెబుతున్నట్టుగా అనిపించేది.
నాకు ఏ తరగతిలో ఫస్టు మార్కులు వచ్చినా.. ఆనందంతో పొంగి పోయి చుట్టుపక్కలందరికీ స్వీట్లు పంచిపెట్టి 'మా జానమ్మ బళ్ళో పస్టోచ్చింది తెలుసా!' అంటూ హడావుడి చేసేవాడు. నాకు ఏ లోటూ లేకుండా, నా చదువుకి ఏ అడ్డంకీ లేకుండా చూడడమే తన జీవిత పరమావధిగా భావించేవాడు. తలపాగా చుట్టుకున్న ఆయన ముఖంలో నా మీద ప్రేమ 'మబ్బు చాటు చందమామ వెదజల్లిన సన్నని వెన్నెల రేఖలా' మెరిసేది.
పొలం మీద వచ్చే కాస్త ఆదాయంలో తనకంటూ ఏమీ దాచుకోకుండా, నా అవసరాలకే ఎక్కువ ఖర్చుచేసేవాడని.. మా అత్త మాటల్లో తెలిసింది. నా చదువు బాగా సాగడానికి అనుకూలమైన వాతావరణం మా ఇంట్లో ఉండేలా చూసుకునే వాడు. ఎప్పుడైనా మా అత్త గట్టిగా మాట్లాడుతుంటే..
'జానకమ్మ సదువుకుంటంది.. కాత్త నిమ్మళంగా మాటాడవే కాంతం!' అని 'లోగొంతుక'తో అంటే.. 'ఆడపిల్లని సూసుకుని.. ఓ ఇరగబడిపోతన్నావ్! అది పెద్ద సదువులు సదివేత్తే మన కులంలో దాన్ని పెళ్ళి సేసుకునేవోడు ఏడ దొరుకుతాడొరోరు తమ్ముడు?'.. అన్న అత్త మాటలు విని, నవ్వి వూరుకునేవాడు తప్ప.. తిరిగి సమాధానం చెప్పేవాడు కాదు. వాగి వాగి అత్త... 'నువ్వొట్టి మొండోడివి రా సత్నాణా!' అంటూ విసుక్కునేది.
అమ్మ పోయిన తర్వాత, నాన్నని మళ్ళీ పెళ్ళి చేసుకోమని అత్త ఎంత పోరు పెట్టినా ఒప్పుకోలేదుట!
'నువ్వు మీ అమ్మని మింగి పుట్టినా, నిన్ను ఏవైనా అన్నిత్తేగా? నువ్వు మూడోనెల గుప్పిళ్ళు తెరిత్తే ముద్ద కుడుములు, లడ్లు, బొక్కబోర్లా పడితే బొబ్బట్లు! అడుగులేత్తే అరిసెలు, నీ బోసి నవ్వులకు.. నువ్వులుండలు మనూరంతా పంచి, సంబడ పడిపోనాడు. పెళ్లై పరాయి ఇంటికిపోయే ఆడపిల్ల మీద ఏంటో అంత పేమ!'... అన్న అత్త మాటలు గుర్తొచ్చాయి.
'ఏతమేసి తోడిన నీరులా' వస్తున్న ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ జేమ్స్ వచ్చి.. నా డల్‌నెస్ చూసి.. 'హారు హనీ! వాట్స్ అప్?'.. అంటూ దగ్గరకు తీసుకున్నాడు.
'ఏమి లేదు ! నాన్న గుర్తుకొచ్చాడు..' అన్నాను.
'డు యు వాంట్ టు సి హిమ్? షల్ ఐ బుక్ ఫ్లైట్ టు ఇండియా ?' ఆతృతగా అడిగాడు.
'వద్దు! వచ్చే నెల వూర్లో అమ్మవారి తీర్థం జరుగుతుంది. అప్పుడు వెడతాను' అంటూ సత్యకి స్నాక్స్ పెడదామని లేచాను.
'ఓకే యాజ్ యు విష్..' అంటూ భుజాలు ష్రగ్ చేసి, తన పనిలో మునిగిపోయాడు.
మళ్ళీ గతంలోకి జారుకున్నాను..
నా స్కూల్ చదువు అయ్యాక, పట్నంలో కాలేజీ చదువుకి ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగింది.
'ఇల్లు గడవటమే శానా కట్టంగా వుండి.. డబ్బులు సరిపోక ఆళ్ళని ఈల్లని అప్పడుగుతున్నావు.. అలాంటిది, పట్నంలో వుంచి చదివించడం ఇప్పుడవసరమా ఈ పిల్లకి? రెండేళ్ళు పోగానే పెళ్లి సేసి పంపెయ్యి..' అంటూ గొడవ చేసింది అత్త.
'ఏ కలో గంజో తాగుతాను.. నా చిట్టితల్లి చదువు మటుకు ఆపడం కుదరదు..' అని ఖరాకండిగా చెప్పి, నన్ను పట్నం కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు.
అక్కడ..'మా అమ్మాయి సిన్నప్పటి నుండి సదువులో ఫస్టండీ! తవరే మంచి 'కళాసు'లో ఎయ్యాలండి..!' అంటూ మరి మరి చెప్పి తన నీరుకావి పంచె మీద వేసుకున్న మాసిపోయిన బనీను జేబులో దాచిన డబ్బు తీసి, వాళ్ళ చేతులో పెట్టి, జాగ్రత్తలు చెప్పి, క్లాసులో కూర్చోబెట్టి వెళ్ళాడు.
'హడ్సన్ రివర్ పక్కన కొత్తగా పెట్టిన ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా బాగుందిట... మనమూ వెడదామా ?' అడిగాడు జేమ్స్..
'వద్దు ! నెక్స్ట్ సండే వెళదాం..' అన్నాను ఆలోచనల వలని తప్పించుకుంటూ.
జేమ్స్ నన్ను సంతోష పెట్టడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు...నేను డల్‌గా వున్నప్పుడు మరీను!.. కిచెన్ లోంచి రొట్టెలు కాల్చిన వాసన వస్తోంది.. అంటే లంచ్ తను తయారుచేసి సత్యకి, నాకు తినిపించే ప్రయత్నం జరుగుతోందన్నమాట..
'హౌ ఆర్ థీజ్ డిషెస్ డియర్? అంటూ 'కేస్ రోల్'లో వేడి వేడి రొట్టెలు, ఎగ్ స్క్రంబుల్డ్ శాండ్విచ్, పొటాటో కర్రి, చెఫ్ లా డ్రెస్ వేసుకుని మా ఇద్దరికి వడ్డిస్తోంటే సత్య.. జేమ్స్‌ని ముద్దు పెట్టుకుని... 'వావ్! డెలీషియస్' అంది వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో.. కూతురి పొగడ్తకి పొంగిపోయిన జేమ్స్, ఆమె కేసి మరింత ప్రేమగా చూశాడు.. అప్రయత్నంగా నాన్న స్వయంగా తాటిరొట్టి చేసి, తినిపించిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఆ రోజు నేను తింటున్నప్పుడు నాన్న మొహంలో కలిగిన ఆనందపు వెలుగుల కాంతిని చూసి.. అప్రయత్నంగా నాన్న ఒళ్లో తల పెట్టుకోవాలనిపించి.. వెంటనే ఆ పని చేశాను 'పిచ్చి తల్లి!' అంటూ నా తల నిమిరాడు. ఎంతో హాయిగా అనిపించింది.. నాన్న అంటే ఒక భరోసా! నాన్న అంటే ఒక ధైర్యం..నాన్న అంటే ఒక ఆలంబన..
చిక్కని చీకటి న్యూయార్క్ నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. లైట్లతో నగరం కాంతిలీనుతోంది. జేమ్స్ తన కొలీగ్‌తో ఫోనులో ఏదో పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నాడు. నా పెళ్లికి అత్త చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. తనకి తెలిసిన చుట్టాల అబ్బాయిని మంచి సంబంధం అని తీసుకువచ్చింది. చదువు పూర్తి అయ్యాకా ఆలోచిస్తాను అన్న నా మాటకి అత్త.. 'అవునులే! దగ్గర వాళ్ళంటే లోకువ. అయినా నా మాట ఎప్పుడు విన్నావు కనక' అంటూ దెప్పింది. 'అది కాదు అత్తా! ఇప్పటికిప్పుడు నిర్ణయం చెప్పమంటే ఎలా? కాస్త టైమియ్యి' అని సర్ది చెప్పబోయాను. కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది అత్త.
నాన్న నా దగ్గరకు వచ్చి 'బంగారు! నీకు ఎలా బాగుంటే అలా సెయ్యి.. పెద్దదానవు అయ్యావు. నీకు ఏది మంచో.. ఏది కాదో తెలుసుకునే వయసు వచ్చింది.. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో!' అన్నాడు.
ఇంతలో 'సత్నాణ..!' అంటూ ఎదురింటి సూరయ్య పిలిచాడు..
'సెప్పు సూరయ్య బావా!' అంటూ నాన్న అరుగుమీద మంచం వాల్చాడు అతన్ని కూర్చోమని.. నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి..
''పిల్ల సదువుకని అపుడో కొంత అపుడో కొంత అప్పు సేసావుట. అది ఇప్పుడు తడిసి మోపెడయిందంట .. షావుకారు రంగయ్య మొన్న నన్ను కలిసి గోలపెట్టాడు.. నువ్వు మధ్యలో శానా వడ్డీ బాకీ పడ్డావంట.. నా దగ్గర సెప్పుకున్నాడు.. నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు కూకున్నావట.. మనం సిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి.. నీతో అంటే బాధ పడతావని.. నన్ను సెప్పమన్నాడు..!' అంటూ గట్టిగా చెప్తున్నాడు.
'గట్టిగా మాట్లాడకు.! మా జానకమ్మ ఇంటే బాధ పడతాది.. దాని సదువు అయిపోవచ్చింది.. అది అయిన వెంటనే దాన్ని ఒక అయ్య సేతిలో పెడితే.. నేను ఎలా వున్నా పర్లేదు.. ఆడికి నేను సద్ది సెప్పుకుంటాలే పొలం కాయితాలు సేతిలో పెట్టి.. కొంత టైము అడుగుతా!' అన్నాడు నాన్న.
'నీ ఇట్టం!.. మరి వత్తాను..' అని లేచాడు సూరయ్య.
'విన్నావా? మీ నాన్న కట్టాలు, నీ సదువు కోసం సేసిన అప్పుల ఊబిలో పడి, గిలగిలా కొట్టుకుంటున్నాడు. నాలుగు ఏళ్ళ క్రితం పరిచ్చల్లో ఫస్టొచ్చావని పేపరోళ్ళు రాసిన కాయితం తలగడ కింద పెట్టుకుని, అస్తమాను సూసుకుంటూ ఉంటాడు.. అదేం పిచ్చో? ఇంకా ఎంతకాలం తల్లి నీ సదువు?' అడిగింది అత్త కోపంగా.
'అదే నేను ఆలోచిస్తున్నాను అత్తా! ఇక్కడితో చదువు ఆపేసి, ఏదైనా ఉద్యోగంలో చేరిపోతాను..' అన్నాను.
మా మాటలు విన్న నాన్న.. 'బంగారు! మీ అత్త మాటలు ఏయీ పట్టించుకోకు. ఇంకా పై సదువులు సదివితే గానీ లాబం లేదంట కదా?..' మన వూరి యగసాయం ఆపీసరు గారు సెప్పారు. నువ్వు సదవాలిసిందే..!' అని ధృడంగా అన్నాడు.
'తర్వాత చదువుతా నాన్న! కొంతకాలం మన పరిస్థితులు సర్దుకునేదాకా..' అని సర్ది చెప్పబోయాను.. నాన్న వినలేదు. ఐ.సి.ఏ.ఆర్‌లో సీటు వచ్చింది. నాన్న ఎంతో సంతోషించాడు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇంక నా పెళ్ళికి డోఖా లేదు అనుకున్నాడు. కానీ వచ్చినవాళ్ళు నా చదువు పట్టించుకోలేదు. మా వెనకాల ఆస్తులు ఏమీ లేవని తెలిసి, మొఖం చాటేశారు.. మా కులంలో కొంతమంది నా చదువు ఎక్కువని రాలేదు.
ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్ళినప్పుడు, అమెరికా నుంచి వచ్చిన జేమ్స్ ఇస్కాన్ టెంపుల్‌లో కలిశాడు.. మాటల్లో భారతీయ వ్యవసాయ భూముల మీద అతను ఒక ఆర్టికల్ రాస్తున్నాడని తెలిసి, నేను సహకరించాను. క్రమేపీ ఇద్దరికీ స్నేహం కుదిరింది. మనసులు, భావాలు కలిసాయి. అతనికి 'నా' అనే వాళ్ళు ఎవరూ లేరని చెప్పాడు. పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు.. 'నాన్న ఒప్పుకుంటే చేసుకుంటా!' అన్నాను.
నాన్నని ఒప్పిద్దామని ఇద్దరం మా వూరు వెళ్ళాము.
'బంగారు! నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు. ఇతను సదువుకున్నవాడిలా కనిపిత్తన్నాడు.. నిన్ను శానా బాగా సూసుకుంటాడని నాకు అనిపిత్తంది!' అన్నాడు. నాన్న సమక్షంలో అరబిందో ఆశ్రమంలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అత్త కోపంతో రాలేదు.. ఇంటి పరువు తీసానంది. మన దేశము, కులము, మతము కాని వాడిని చేసుకున్నానని తిట్టి పోసింది. జేమ్స్ నాతో పాటే వుండి, ఇండియాలో ఒక పెద్ద ఎం.ఎన్.సీ.లో వుద్యోగం చూసుకున్నాడు. అప్పుడప్పుడు వూరు వెళ్లి, నాన్నని చూసొచ్చేదాన్ని. నాన్నలో మునుపటి ఉత్సాహం లేదు. చుట్టలు ఎక్కువ తాగడం వల్ల మనిషి అనారోగ్యం పాలయ్యాడు. మొహంలో ఏదో దిగులు కనిపించింది. అత్తకి కోపం తగ్గలేదు. నాతో మాట్లాడడం మానేసింది.
చివరికి పొలం అమ్మి, అప్పులు తీర్చాడని తెలిసింది. 'ఇప్పుడు పొలం అమ్మడం ఎందుకు నాన్నా? నీ జీవితం వెళ్ళక్కర్లేదా!' అని బాధగా అడిగితే..
'నాకేం కావాలె ? సొంతిల్లుంది.. మీ అత్త ఈ ఊళ్లోనే ఉంటోంది.. అది కాత్త వుడకేసి పెడద్ది, రోజుకి మూడు లంక పుగాకు సుట్టలుంటే రోజు గడిసిపొద్ది. రేపన్నాడు నాకేదైనా అయితే, ఈ పొలం ఎవ్వారాలు నువ్వు సూడ లేవు.. అందుకే అమ్మేసాను' అని నవ్వాడు.. ఆ నవ్వులో జీవం లేదు.
'నాన్నా ! చుట్టలు మానెయ్యి.. ఊపిరితిత్తులు పాడైపోతాయి!' అని ఎన్ని సార్లు చెప్పినా వినేవాడు కాదు..
ఏమైనా గట్టిగా అంటే.. 'నాకు కాత్త వూసుపోయేదే ఈ సుట్ట, సూరయ్యతో కబుర్లు, మీ అత్త తిట్లతోనే..!' అని నవ్వేసాడు..
ఏమనాలో తోచక.. 'మా దగ్గరకు వచ్చి వుండు నాన్నా!' అని బతిమిలాడితే.. 'నాకు ఈ వూళ్ళో తప్ప ఎక్కడా తోచదు బంగారూ!' అని రావడానికి నిరాకరించాడు.
'ఏయ్! జాను ! హౌ లాంగ్ యు సిట్ దేర్? ఆల్రెడీ మిడ్ నైట్.. డునాట్ స్పొయిల్ యువర్ హెల్త్ డియర్'...అని బెడ్ రూమ్‌లోంచి పిలిచాడు జేమ్స్.
'ఓకే ఓకే, జస్ట్ ఫ్యూ మినిట్స్!' అంటూ డెస్క్ మీద అన్నీ సర్దుతుంటే, డైరీలోంచి వంద రూపాయల నోటు పడింది. ఆ నోటు ముట్టుకోగానే నాన్న 'చేతి స్పర్శ' అనుభవానికి వచ్చింది.. జేమ్స్‌ని యు.ఎస్.ఎ పంపాలని అతని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇద్దరం అమెరికా వెళ్ళిపోవడం, వెంటనే సత్య పుట్టడం, త్వరత్వరగా జరిగిపోయాయి. అమెరికా వెళ్ళే ముందు నాన్న దగ్గరకు వెళ్ళినప్పుడు..
'సంతోషం బంగారు.. మనోళ్ళలో నువ్వు ఒక్కర్తేవే ఇదేశాలకి ఎడతన్నావు. సమయానికి అత్త వూరెల్లింది.. నీకు కాత్తంత.. పసుపు కుంకం పెట్టె వోల్లె లేరు' అంటూ ఏడిచాడు.. తన బనీన్లోంచి వంద రూపాయలు తీసి 'సీర కొనుక్కో' అని చేతిలో పెట్టాడు. డైరీలో కనబడ్డ ఆ నోటు పదిలంగా దాచుకున్నాను. చాలా ఏళ్లు గడిచిపోయాయి.. కెరీర్ రందిలో పడిపోయి, నాన్న 'జ్ఞాపకానికే' పరిమితమైపోయాడు.
మా వూళ్ళో ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, 'అన్నారు! జానకమ్మ వచ్చింది..సూడు!'.. అంది మా అత్త.. దిగ్గున మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కళ్ళకి చేయి దాపుగా పెట్టుకుని, నన్ను చూడడానికి ప్రయత్నిస్తున్నాడు.. నా కళ్ళకి నిరంతరం నా కోసం పరితపిస్తున్న బక్కచిక్కిన తండ్రి కనిపించాడు. దు:ఖం ఉప్పెనలా ఒక్కసారిగా పెల్లుబికింది. నాన్న కాళ్ళ దగ్గర కూలబడ్డాను. నన్ను చూడగానే .. నాన్న మొహంలోని వెలుగు ముందు వేయి చంద్రుల వెన్నెల కూడా దిగదుడుపే.
'వచ్చావా బంగారూ!' అంటూ చేయి పట్టుకోగానే.. ఆ స్పర్శకి నా శరీరం చలించిపోయి, కరిగి నీరై.. ఆయన కాళ్ళ ముందు ప్రవహించింది. కళ్ళల్లోకి చూస్తూ వుండిపోయాను. చాలాసేపు అయ్యాక తేరుకున్నాను. అప్పటివరకు నాన్న చేయి నా తలని నిమురుతూనే వుంది.
'మమ్మీ!' అంటూ సత్య నా దగ్గరకు వచ్చింది.. 'సత్యా! హి ఈజ్ యువర్ గ్రాండ్ పా.!.. తాత!' అంటూ నాన్నని చూపించాను.. బోసిగా నవ్వుతున్న నాన్నని చూసిన సత్య.. కొత్త లేకుండా దగ్గరకు వెళ్ళింది. మనవరాలి పేరు తెలుసుకుని, 'నా పేరే పెట్టావా?' అంటూ సంబరపడిపోయాడు. సత్యని ముద్దులాడేడు. నెల రోజులు వుంటామని తెలుసుకుని, ఆనందపడ్డాడు.
'అల్లుడుగారూ! బాగున్నారా?' అని అడిగాడు అక్కడ నిలబడ్డ జేమ్స్‌ని చూసి.. 'బాగున్నా మావయ్య గారు! మీరెలా వున్నారు?' మంచం మీద నాన్న పక్కనే కూర్చుని, ఆయన చేయి ఆప్యాయంగా నొక్కాడు.
'నాకే బండరాయిలా ఉన్నాను' అంటూ చిన్నగా నవ్వాడు.
నేను లేచే సరికి, ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ అరుగుమీద కూర్చున్న నాన్న కనబడ్డాడు. మేము అక్కడ వున్నన్ని రోజులు నాన్న బాగా హుషారుగా వున్నాడు.. ఆరోగ్యం కూడా బాగా మెరుగైంది. మేము అమెరికా తిరిగి వెళ్లిపోయే రోజు నాన్న ముఖం బెంగతో 'మసకేసిన చందమామ'లా వుంది.
సాయంకాలం పైరుగాలి చల్లగా మా ఇంటివైపు వీస్తోంది. నాన్నని మా పొలం వైపుకి తీసుకెళ్ళాం. పొలం గట్టు మీద కూర్చోబెట్టి, 'నాన్నా! మన పొలం మనకే తిరిగి అమ్మడానికి రంగయ్య ఒప్పుకున్నాడు. రెండ్రోజుల్లో ఈ పొలం మనదవుతుంది' అన్నాను.
ఆ మాట వినగానే... నాన్న ముఖంలో ఆనందం, దు:ఖం ఒకేసారి ముప్పిరిగొన్నాయి.. వెంటనే కిందకు ఒంగుని, చేత్తో మట్టిని తీసుకుని ముద్దు పెట్టుకుని, వెక్కి వెక్కి ఏడ్చాడు. మమ్మల్నిద్దరినీ ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు.. అవి కన్నీళ్ళు కాదు... అవధులు లేని ఆకాశపు చిరుజల్లుల్లా అనిపించాయి నాకు.
'నాన్నా! ఈ ఆలోచన మీ అల్లుడు గారికే వచ్చింది. నువ్వు స్వంతంగా వ్యవసాయం చేయలేవని, మనిషిని కూడా నియమించాడు జేమ్స్..!' అన్నాను.
'అల్లుడు గారు! మీకు టాంకు'.. అన్నాడు వచ్చీ రాని ఇంగ్లీషులో.
'టాంకు కాదు తాత! థాంక్యూ..!' అని నవ్వింది సత్య.
'నువ్వు తెలుగు పుత్తకం నాలా సదువు..!' అంటూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
సత్య తెలుగు వాచకంలో పదాలు కూడబలుక్కుని చదువుతోంది. గట్ల మీద వున్న చెట్లకొమ్మలు వింటున్నట్టుగా తలలు ఊపుతున్నాయి.
చాగంటి ప్రసాద్
9000206163