
దేశ రాజధాని ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన హింసాకాండపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ ఆధ్వర్యంలోని నిజనిర్ధారణ కమిటీ వెల్లడించిన అంశాలు దిగ్భ్రాంతి కొలుపుతున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన మత ఘర్షణల్లో కేంద్రం లెక్కల ప్రకారం 53 మంది మరణించగా, 200 మంది వరకూ తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులు, గాయపడిన వారిలో మూడొంతులకు పైగా ముస్లిములే! ప్రజలను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం ఒక మతానికి చెందినవారిపట్ల కక్ష పూరితంగా వ్యవహరించిందని, రక్షించవలసిన పోలీసులు వారినే చితకబాదారని జస్టిస్ లోకూర్ కమిటీ తేల్చి చెప్పింది. రాజ్యం నగంగా మైనార్టీ మతస్తులపై విరుచుకుపడింది. వాస్తవాలను లోకానికి వెల్లడించాల్సిన మీడియా సంస్థల్లో కొన్ని అసత్యాలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశాయనీ ఇటువంటి కారణాల వల్లనే హింసాకాండ చెలరేగిందని కమిటీ స్పష్టంగా పేర్కొంది. జీ న్యూస్, రిపబ్లిక్ టివి వంటి ఛానెళ్లలో వచ్చిన కథనాలు అల్లర్ల విస్తరణకు తోడ్పడ్డాయని కమిటీ తెలిపింది. భారత ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా చెప్పబడే మీడియా లోని ఒక భాగం హింసాకాండకు ఆజ్యం పోయడం మరింత దారుణం. బిజెపి, సంఘపరివార్ శక్తుల విద్వేష ప్రసంగాల సంగతి చెప్పనక్కరలేదు.
ఘోర హింసాకాండ జరుగుతున్నప్పటికీ బాధిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించడానికి కేంద్రం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశాయి. ఫిబ్రవరి 23నే రెండు మతాల మధ్య హింస జరగనుందని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాల నుంచి కనీసం ఆరు అంతర్గత హెచ్చరికలు వచ్చినా అదనపు బలగాలను మాత్రం ఫిబ్రవరి 26నే మోహరించారు. తద్వారా అల్లర్లు మరింతగా పెరగడానికి, మూడు రోజుల పాటు తమ లక్ష్యాలపై మతోన్మాదులు తీవ్రంగా దాడులు చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలే పరోక్షంగా సహాయపడ్డాయన్నమాట. 'వాస్తవానికి సివిల్ పోలీసులు, పారామిలటరీ సిబ్బంది ఫిబ్రవరి 23 కంటే ఫిబ్రవరి 24న ఇంకా తక్కువగా ఉన్నారు. 26నే సిబ్బందిని పెంచారని, అది కూడా కనీస స్థాయిలోనే ఉంద'ని కమిటీ పేర్కొంది. ఫిబ్రవరి 24న కేంద్ర హోం సెక్రటరీ అజరు భల్లా పరిస్థితి అదుపులో ఉందని, తగినంత మంది భద్రతా సిబ్బందిని పంపించామని మీడియాకు చెప్పారు. అలర్లకు కాంగ్రెస్, సిఎఎ ఆందోళకారులు కారణమని, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లోని వ్యక్తులింతలా జనాన్ని తప్పుదారి పట్టించడం బహుశ ఇంతకు ముందెప్పుడూ జరగలేదు.
ముస్లింలపై జరిగిన హింసలో ఢిల్లీ పోలీసులు ఒక భాగంగా ఉన్నారని, అనేక చార్జిషీట్లను పరిశీలిస్తే బిజెపికి అనుకూలంగా వ్యవహరించినట్లు స్పష్టంగా వెల్లడైందని కమిటీ తెలిపింది. ఈ అల్లర్లపై 758 ఎఫ్‌ఐఆర్లు దాఖలు కాగా, ఎక్కువ భాగం సిఎఎ నిరసనకారులు, ముస్లిములపైనే కేసులు నమోదు చేశారు. అల్లర్లు జరగడానికి ముందు జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ ప్రాంగణంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి, క్యాంపస్‌ను ధ్వంసం చేసి, విద్యార్థులపై తీవ్రంగా దాడి చేసి భాష్పవాయువు ప్రయోగించడంతో 200 మంది వరకూ విద్యార్థులు గాయపడ్డారు. ఈ కేసుల్లో దర్యాప్తు బిజెపికి, వారి అనుయాయులకు అనుకూలంగానే జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించడంలో పోలీసులు తీవ్రమైన జాప్యం చేస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొట్టిన బిజెపి నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారని కమిటీ పేర్కొంది. మరోవైపు యుఎపిఎ చట్టం కింద అరెస్టు చేసిననవారు రెండేళ్ల నుంచి జైళ్లలో మగ్గుతున్నారు. యుఎపిఎ చట్టాన్ని సమగ్రంగా సమీక్షించాలన్న కమిటీ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తప్పక అమలు చేయాలి. మతోన్మాదులు అధికారంలో ఉంటే మైనార్టీ మతాలకు చెందినవారిపై ఎంతటి ఘోరకలి జరుగుతుందో ఫిబ్రవరి ఢిల్లీ అల్లర్లతో మరోసారి రుజువైంది. కార్పొరేట్ మతతత్వ కూటమి పాలన అంతమైతేనే ప్రజలకు రక్షణ.