Oct 08,2023 11:30

'జాతిరత్నాలు' చిత్రంతో ఫేమస్‌ అయిన నవీన్‌ పోలిశెట్టి గురించి పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చిన నటుడు. నేడు తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్‌ చేసుకున్నారు. యూత్‌లోనే కాదు.. ఫ్యామిలీలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇదంతా జాతిరత్నాలు తెచ్చిన గుర్తింపనే చెప్పాలి. ఈ సినిమా కంటే ముందు కొన్ని సినిమాల్లో చిన్న పాత్ర పోషించారు. ఆ స్థాయి నుంచి వచ్చి స్వయంగా ఎదిగిన నవీన్‌ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వరకూ అభిమానులను సంపాదించుకున్నారు.
పోలిశెట్టి హైదరాబాద్‌లో జన్మించారు. అతని తండ్రి ఫార్మాస్యూటికల్‌ వ్యాపారంలో ఉండగా, అతని తల్లి బ్యాంకు ఉద్యోగి. అతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. తోబుట్టువులు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. నవీన్‌ మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. పూణేలోని ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో కొన్నాళ్లు పనిచేశారు. తరువాత ఇంగ్లాండ్‌కు వెళ్లారు. కానీ ఉద్యోగంలో ఏమాత్రం సంతోషం లేకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేయకుండా ఇండియాకి తిరిగి వచ్చారు. ముంబైలో ఉండి నటనలో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ తీసుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకొని, కొన్ని పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేశారు. థియేటర్‌లోనూ పనిచేశారు. అనేక నాటకాలకు స్క్రీన్‌ రైటర్‌గా పనిచేశారు. యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా తన నటనకు సంబంధించిన వీడియోలు చేసేవారు.

1


దర్శకుడు శేఖర్‌కమ్ముల తీసిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' ఆడిషన్స్‌కు వెళ్లారు. ఆ టైంలో విజరు దేవరకొండతో పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో చిన్నపాత్రలో నటించారు. తర్వాత 'ఢ ఫర్‌ దోపిడి'... 'నేనొక్కడినే' లాంటి చిత్రాల్లోనూ కనిపించారు. కానీ అవన్నీ చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపురాలేదు. అయినా పట్టువదలకుండా సినిమా ప్రయత్నాలు చేశారు. స్వరూప్‌ దర్శకత్వం వహించిన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' కామెడీ మిస్టరీ చిత్రాన్ని తెలుగులో తీశారు. దీనికి నవీన్‌ స్క్రీన్‌ రైటర్‌గా వర్క్‌ చేశారు. ఈ సినిమాలో నవీన్‌ నటనకు వీక్షకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ సినిమా కమర్షియల్‌గానూ విజయం సాధించింది. ఇక 'జాతి రత్నం' చిత్రంతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలోని నవీన్‌ నటనకు థియేటర్స్‌లో ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేట్టు చేశారు. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఇతర దేశాల్లోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

3


ఇప్పుడు అనుష్కతో 'మిస్‌ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి' చేశారు. ఇందులో నవీన్‌ నటనకు అభిమానులే కాదు.. కుటుంబసభ్యుల నుంచీ భారీగా అభినందనలు వచ్చాయి. 'నా కెరీర్‌లో పెద్ద సినిమా. నేను ఫస్టు టైమ్‌ అవుట్‌డోర్‌కి వెళ్లిన సినిమా ఇదే. ఈ సినిమాతో పాటు మరో సినిమా చేసే వెసులుబాటు ఉంది. కానీ అలా చేయను. ఒక సినిమా ఒప్పుకుని, ఆ పాత్ర పూర్తయ్యే వరకూ అందులోనే ఉంటాను. ఎందుకంటే త్వరగా ఆ పాత్ర నుంచి నేను బయటకు రాలేను. అందువల్లే మరో సినిమా చెయ్యలేను. చెయ్యను కూడా. ఇది నేను తీసుకున్న నిర్ణయం' అని తన కెరీర్‌ గురించి చెప్పారు.
'ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కోసం స్టాండప్‌ కమెడియన్స్‌ను బాగా అబ్జర్వ్‌ చేశా. అందుకే బాగా నటించగలిగాను. చివరి 30 మినిట్స్‌ చేసిన పర్‌ఫార్మెన్స్‌ నేను గతంలో ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయలేదు. ఈ ఎమోషన్‌, డ్రామా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రీసెంట్‌గా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో సినిమా చూశా. ఒక పెద్దావిడ 80 ఏళ్లుంటాయి. వాళ్ల అబ్బాయితో వచ్చి మూవీ చూసింది. ఆమె 15 ఏళ్లుగా సినిమాలు చూడలేదట. మా సినిమా ఆమెకు బాగా నచ్చిందని చెప్పింది. నటుడిగా ప్రతి సీన్‌ను సెట్‌లో ఇంప్రువైజ్‌ చేసుకుంటా. సీన్‌లో నాలుగు జోక్స్‌ ఉంటే.. నేను చేసేటప్పుడు ఆడియెన్స్‌ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్‌ కావాలని దర్శకుల దగ్గర కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్‌ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్‌ ఇచ్చారు. సీన్‌ పేపర్‌లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. మరుసటి రోజు చేసే సీన్‌ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి, నా పాత్రకు న్యాయం చేయాలని తపన పడతా. అదే నా సినిమాలకు గుర్తింపు ఇస్తుంది' అంటారు.

3

పేరు : నవీన్‌ పోలిశెట్టి
తల్లిదండ్రులు : పి. రాజ్‌కుమార్‌, మంజుల
అభిమాన నటుడు : అనిల్‌ కపూర్‌
వృత్తి : నటుడు, రచయిత, స్టాండ్‌ ఆప్‌ కామిక్‌ అండ్‌ వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌
అవార్డు : దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ సౌత్‌ 2020లో 'ఉత్తమ నటుడు అవార్డు'