May 12,2023 07:38

ప్రశ్నను తొక్కిపెడితే అది ఎప్పుడూ ఏ కాలంలోనూ భూస్థాపితం కాలేదు. విత్తనాన్ని తొక్కి పెడితే ఎప్పుడైనా ఎక్కడైనా భూస్థాపితమైందా ? మొక్కగా ఎదిగి, వృక్షంగా విస్తారమైపోలేదూ ? ఆ నిర్ణయం తీసుకున్న వారి అజ్ఞానం బయటపడుతుందే తప్ప, ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో విజ్ఞానాన్ని తొక్కిపెడతానంటే మాత్రం వీలు కాదు - విజయం ఎప్పుడూ సైన్సుదే !

          సామాన్యంగా తెలివైన వాళ్ళు తెలివిగల పనులు చేస్తారు. తెలివిలేని వారు తెలివి తక్కువ పనులు చేస్తారు. కానీ, ఇక్కడ జరిగేదేమంటే...మత పిచ్చి నెత్తికెక్కితే, తెలివైన వారు కూడా తెలివి తక్కువ పనులు చేస్తారు. ఆ పనులు అత్యంత హీనంగా కూడా ఉంటాయి. ఈ విషయం మనం సమకాలీనంలో చూస్తున్నాం. అందుకే మన సమాజంలో గౌరవనీయులైన మూర్ఖుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థుల పాఠ్యాంశాల్లో జాతిపిత గాంధీజీ స్థాయి తగ్గించడం, మొఘల్‌ చరిత్ర తీసెయ్యడం, అలాగే జీవశాస్త్రానికి సంబంధించి డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం తీసెయ్యడం వల్ల ఈ దేశ పాలకుల అజ్ఞానం, కుత్సిత బుద్ధీ అవగతమవుతోంది. జీవపరిణామ సిద్ధాంతం తొలగించి - ఈ దేశంలో ఒక 'ప్రమాదకర పరిణామం' తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశిస్తున్నారు. విజ్ఞానం సముపార్జించాలంటే ఎంతో శ్రమించాలి. పరిశ్రమించాలి. కాని, విద్యార్థులకు శ్రమ లేకుండా చేస్తున్నారు. రాబోయే తరాలన్నీ తమలాగే అజ్ఞానవంతులు కావాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా వీరు 'రేషనలైజేషన్‌' అనే పదం ఉపయోగిస్తున్నారు. అసలు ఆ పదం ఉపయోగించే అర్హత తమకు ఉందా లేదా అని కూడా వారు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. దీనికి ప్రతిస్పందనగా ఎన్‌సిఇఆర్‌టి తొలగించిన పాఠాలను తిరిగి చేరుస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఆయన మంత్రివర్గ సభ్యుడు శివన్‌ కుట్టి, తామే తమకు కావాల్సిన పాఠ్యగ్రంథాలు ముద్రించుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సైన్సు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ సంతకాలు చేసి కేంద్రానికి పంపారు. విడతలు విడతలుగా ఇంకా పంపుతూనే ఉన్నారు.
           జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించి, దాని స్థానంలో సృష్టివాదాన్ని జొప్పించాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే గుజరాత్‌లో, కర్ణాటకలో 8 నుండి 10 తరగతులకు భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టింది. అంతే కాదు, దాన్ని జాతీయ గ్రంథం చేయాలని యోచిస్తోంది. గాయత్రీ మంత్రాన్ని పార్లమెంట్‌లో ప్రార్థనా గీతంగా పెట్టాలని పథకం వేస్తోంది. కర్ణాటకలోనైతే ఒక మతవాది సావర్కర్‌ ఉపన్యాసాల్ని పాఠ్యాంశాలుగా చేర్చింది. చరిత్ర పాఠ్యగ్రంథాల్లో అనేక మార్పులు, చేర్పులు చేసింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో వాస్తు, జ్యోతిష్యం పాఠ్యాంశాలుగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భూతవైద్యం కోర్సు ప్రవేశపెట్టింది. సమాజాన్ని వెనక్కి నడిపించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని మన పాలకులకు తెలుసు. ఇకపోతే, ఆవు మూత్రంలో ఎంత బంగారం ఉందో పరిశోధించమని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు పంపడం-హాస్యాస్పదమని, మూర్ఖత్వమని మనం అంటున్నాం గానీ, ఎంతో దార్శనికతతో విప్లవాత్మకమైన, ప్రగతిశీలమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పాపం పాలకులు భ్రమలో బతుకుతున్నారు. వీటన్నింటి మీదా మేధావుల నిరసన వెల్లువెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం, విన్నపాలు, పిటిషన్లు వెళుతున్నాయి.
            ఇవన్నీ ఇలా ఉంటే...మరో భయంకరమైన వార్త దేశ ప్రజల నెత్తి మీద పిడుగులా పడింది. కేంద్ర ప్రభుత్వం ఒక అహేతుకమైన నిర్ణయం తీసుకుంది. ''విజ్ఞాన్‌ ప్రసార్‌''ను మూసివేస్తున్నామని అకస్మాత్తుగా ప్రకటించి, దేశ ప్రజల అవకాశాన్ని లాగేసుకుంది. అంతే కాదు, ఆ చర్య ఈ దేశ ప్రజల గౌరవాన్ని అవనతం చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ-భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న 'విజ్ఞాన్‌ ప్రసార్‌' గురించి 24 ఏప్రిల్‌ 2023న ''ద స్టేట్స్‌మన్‌'' పత్రిక సంపాదకీయం రాసింది. 'విజ్ఞాన్‌ ప్రసార్‌-అన్‌నేచురల్‌ డెత్‌' అనే శీర్షికతో వచ్చిన ఆ ఎడిటోరియల్‌ ఎన్నో వాస్తవాల్ని దేశ ప్రజల ముందు పెట్టింది. అది వచ్చిన వెంటనే ఎఐపిఎస్‌ఎన్‌ (ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌) తన తీవ్రమైన నిరసనను ప్రకటించింది. న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో-విజ్ఞాన్‌ ప్రసార్‌ను మూసివేయొద్దని... తీవ్రంగా హెచ్చరించింది. విజ్ఞాన్‌ ప్రసార్‌ను మూసివేయాలని సూచించిన నీతి ఆయోగ్‌ చర్యను తీవ్రంగా ఖండించింది. వైజ్ఞానిక దృక్పథంతోనే ఈ దేశం ముందుకు పోతుందన్న తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూని-మొన్నటి దాకా తక్కువ చేయడానికి ప్రయత్నించి విఫలమైన కేంద్రం, ఇప్పుడు వైజ్ఞానిక సంస్థల్ని మూసివేయడం ప్రారంభించింది !
            'విజ్ఞాన్‌ ప్రసార్‌' సంస్థ ఏం చేస్తుంది? అంటే, దేశంలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందుకు అవసరమైన పుస్తకాలు, పత్రికలు ప్రచురిస్తుంది. హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే కాకుండా కొన్ని భారతీయ భాషల్లో కూడా పత్రికలు ప్రచురిస్తుంది. రాజ్యాంగంలోని 51(ఎ)హెచ్‌ ప్రకారం దేశంలో వైజ్ఞానిక స్పృహను కలిగి ఉండటం, దాన్ని ప్రచారం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత-అయినప్పుడు సమాజంలో వైజ్ఞానిక స్పృహను ప్రచారం చేసి, పెంపొందించే సంస్థను, అన్ని స్థాయిల్లో విద్యార్థులందరికీ చేరువైన సంస్థను ఉన్నఫళంగా అకారణంగా మూసివేయడం హేయమైన చర్య! ప్రభుత్వ పెద్దల ఛాందసానికి, ప్రభుత్వాధికారుల బాధ్యతా రాహిత్యానికి ఈ చర్య అద్దం పడుతుంది.
'విజ్ఞాన్‌ ప్రసార్‌' ఒక స్వతంత్ర సంస్థగా 1989లో ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ సంస్థ వైజ్ఞానిక దృక్పథం ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేస్తూ ఉంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంత ముఖ్యమో, వాటి వివరాలు సామాన్య జనానికి అందించడం కూడా అంతే ముఖ్యం! దేశవ్యాప్తంగా ప్రజా సైన్సు కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్న విజ్ఞాన్‌ ప్రసార్‌ను మూసివేయడమంటే - దేశ ప్రజలను అవివేకులుగా, అజ్ఞానులుగా తయారు చేయాలని భావించడమే - రైతు నల్ల చట్టాలు తిప్పికొట్టినట్టు - పౌరసత్వ చట్టాలు తిప్పికొట్టినట్టు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తవా? గతంలో వేల సంఖ్యలో షహీన్‌బాగ్‌లు వెలసినట్టు - ఉద్యమాలు ఊపందుకోవా? వెనక్కి నడుద్దామన్న వారి మెడలు వంచి ముందుకు నడిపించవా? ఈ 21వ శతాబ్దపు భారతీయ యువత అంత తేలికగా రాజీపడిపోరు. ఒప్పుకోరు. అసలు ప్రపంచమే వైజ్ఞానిక సృష్టి అయినప్పుడు - ఎవడో చెప్పే దైవసృష్టిని ఈ దేశ ప్రజలు విశ్వసిస్తారా? సైన్సు ఊపిరిగా బతుకుతున్న నేటి యువతరం ఆ సైన్సునే ఆయుధం చేసుకొని ఎందుకు తిరగబడరూ? ఈ తాత్కాలిక ప్రభుత్వాలు సైన్సు శాశ్వతత్వాన్ని శాసించగలవా? మత పిచ్చి ముదిరితే దాన్ని వదిలించే శక్తి ఈ దేశ ప్రజలకు ఉంది. నియంతలు శాశ్వతంగా నిలిచిపోయిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు.
              విజ్ఞాన్‌ ప్రసార్‌ ఇప్పటి వరకు వేర్వేరు శాస్త్రవేత్తలు, వేర్వేరు వైజ్ఞానిక రచయితలు రాసిన 300 పుస్తకాలు ప్రచురించింది. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డుల్ని ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది. అందులో సైన్సు ప్రచారానికి యునెస్కో కళింగ అవార్డు, నేషనల్‌ సైన్సు పాపులరైజేషన్‌ అవార్డు, ఇందిరాగాంధీ ప్రయిజ్‌ ఫర్‌ సైన్స్‌ పాపులరైజేషన్‌, ఆత్మారాం అవార్డ్‌ ఫర్‌ సైన్స్‌ బుక్‌ రైటింగ్‌...వంటి అవార్డులు నెలకొల్పి నిర్వహిస్తోంది. ఇంగ్లీషు, హిందీ భాషలలో 'డ్రీమ్‌ 2047' పేరుతో కళాశాల విద్యార్థుల కోసం సైన్స్‌ జర్నల్‌ ప్రచురిస్తోంది. బెంగాలీ, తమిళం, కన్నడం, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ వంటి భారతీయ భాషలలో సైన్సు ప్రచురణలు తెస్తోంది. ఇవేకాక మంత్లీ న్యూస్‌ లెటర్స్‌ ప్రచురిస్తోంది (ఉర్దూలో తజస్సుస్‌, తమిళంలో అరివియల్‌ పలగై, బెంగాలీలో బిగ్యాన్‌ కథ, కన్నడంలో కుతూహల్‌ ఇవి న్యూస్‌ లెటర్ల పేర్లు). ఇక దూరదర్శన్‌తో కలిసి నిర్వహించే సైన్స్‌ కార్యక్రమాలు కొన్ని. అలాగే 'హోమ్‌ రేడియో' ద్వారా పిల్లలకు, పెద్దలకు అవసరమైన వైజ్ఞానిక సమాచారం అందిస్తోంది. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 'యాక్టివిటీ కిట్స్‌' అందిస్తోంది. వాటివల్ల వాళ్ళు సరదాగా ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటారు. విజ్ఞాన్‌ ప్రసార్‌ మహిళల మీద కూడా దృష్టి పెట్టింది. వారి కోసం 'జెండర్‌ అండ్‌ టెక్నాలజీ' ప్రోగ్రాం రూపొందించింది. ఒక డిజిటల్‌ లైబ్రరీ'ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. సైన్స్‌ క్లబ్‌లు విరివిగా ఏర్పాటు చేసి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. సైన్స్‌ ప్రదర్శనలు, జాతాలు క్రమం తప్పక నిర్వహించింది. గ్రహణాల సమయంలో ఖగోళ పరిజ్ఞానం సామాన్యులకు అందించి, అంధ విశ్వాసాలు తగ్గించింది. చలన చిత్రాల ద్వారా సైన్స్‌ ప్రచారం చేయడమే కాదు, నేషనల్‌ సైన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఐ)ను పెద్ద ఎత్తున నిర్వహించింది. విజ్ఞాన్‌ ప్రసార్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ''ఇండియా సైన్స్‌'' టి.వి ఒటిటి ఛానెల్‌ రెండు వేల సైన్స్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించింది. అవి 85 మిలియన్ల మందికి అందాయి. నిర్విరామంగా ఇంతగా కృషి చేస్తున్న ఒక గొప్ప సంస్థను మూసేయడం సబబా ?
                 విజ్ఞాన్‌ ప్రసార్‌లో పనిచేస్తున్న సంపాదకులు, వైజ్ఞానిక రచయితలు, ఇతర ఉద్యోగులు అందరూ కలిసి ఎన్నో ప్రచురణల్ని ఎంతో శ్రద్ధగా ప్రజలకు అందిస్తున్నారు. ప్రచురణలు ఊపందుకుంటున్న దశలో-ఇంకా ఇతర భాషల్లో కూడా వైజ్ఞానిక స్పృహను పెంచే ప్రచురణలు వెలువరించాలని పథకాలు సిద్ధం చేసుకుంటున్న దశలో కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా, అనూహ్యంగా విజ్ఞాన్‌ ప్రసార్‌ను మూసివేయడం బాధాకరం! వైజ్ఞానిక ప్రపంచంలో బతుకుతున్న మనకు ఒక పెద్ద వైజ్ఞానిక సమాచార సంస్థ మూతపడటం తీరని లోటు! కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా సైన్సు కార్యకర్తలే కాదు, బాధ్యత గల పౌరులందరూ ఏక కంఠంతో కోరుతున్నారు. కోరుతున్నారంటే బతిమిలాడుతున్నారని కాదు, ప్రభుత్వ పెద్దలు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుంటే-పునరాలోచించి ప్రజా నిర్ణయానికి అనుకూలంగా పనిచేస్తే...దేశం ముందుకు పోతుంది. వైజ్ఞానిక స్పృహ గల వారే ఆధునిక మానవులవుతారన్నది ఈ దేశ పౌరులకు బాగా తెలుసు!
ప్రశ్నను తొక్కిపెడితే అది ఎప్పుడూ ఏ కాలంలోనూ భూస్థాపితం కాలేదు. విత్తనాన్ని తొక్కి పెడితే ఎప్పుడైనా ఎక్కడైనా భూస్థాపితమైందా? మొక్కగా ఎదిగి, వృక్షంగా విస్తారమైపోలేదూ? ఆ నిర్ణయం తీసుకున్న వారి అజ్ఞానం బయటపడుతుందే తప్ప, ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో విజ్ఞానాన్ని తొక్కిపెడతానంటే మాత్రం వీలు కాదు-విజయం ఎప్పుడూ సైన్సుదే !

(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు