Jul 23,2022 06:50

ఈ సందర్భంగా గ్రామాల్లోని పాఠశాలలు రద్దు చేయడం విస్మరించాలి. ఉపాధ్యాయ నియామకాలను విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పూర్తి చేయాలి. పాఠశాలలు విలీనం చేసిన దగ్గర ప్రత్యేకమైన ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రతి ఉదయం స్కూల్లో అసెంబ్లీ పూర్తవగానే పిల్లలకు పాలు, పౌష్టిక ఆహారాలు కల్పించాల్సి ఉంది. అలానే ప్రతి విద్యార్థికి ఇంట్లో చదువుకునే వసతి కల్పించాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గ్రామ విద్యను రద్దు చేస్తే రాష్ట్రాలను చీకట్లోకి నెట్టినట్టే అవుతుంది. తప్పు చేయడం కాదు. తప్పును తెలుసుకోవడం, సరిదిద్దుకోవడమే ప్రజాస్వామిక లక్షణం.

విద్య మహోజ్వలమైన జీవన స్రవంతి. విద్య ఒక సామాజిక విప్లవ జ్యోతి. విద్య మానవాభ్యుదయ విజయ మార్గం. విద్య నీతి, నిజాయితీ, వ్యక్తిత్వాలకు పెట్టని కోట. విద్యను విస్మరించిన ప్రభుత్వాలు కూలక తప్పవు. విద్యలో బోధన ముఖ్యమైనది. ఈనాడు ఉపరితలమైన బిల్డింగులు, బెంచీలు, బాత్రూంలు దృశ్యమానంగా ఉన్న పాఠశాలలో లైబ్రరీలు, అధ్యయన కేంద్రాలు, ల్యాబ్‌లు, బోధన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయులు కరువైపోయారు. అందుకే పదవ తరగతిలో కూడా ఒక పేరా రాయలేని పరిస్థితుల్లో పిల్లలున్నారు. కొత్త కళను పెంపొందించుకోగలగాలి. ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించగలగాలి. బహు భాషలు నేర్వగలిగిన సామర్థ్యం కలిగి వుండాలి.
     ప్రభుత్వ బడులలో ఉదయాన్నే అసెంబ్లీ జరిగే సమయాల్లో పది మంది కళ్లు తిరిగి పడిపోతున్నారు. వారికి పాలు ఇవ్వలేకపోతున్నారు. రాగి బిస్కెట్లు ఇవ్వలేకపోతున్నారు. జీడిపప్పు ఇవ్వలేకపోతున్నారు. బాదం పప్పు పెట్టలేకపోతున్నారు. లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంచుకొని చిన్న పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే భావదారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నాయనే అర్థం. ముఖ్యంగా పదవ తరగతి పాసైన తర్వాత ఇంటర్మీడియట్‌లో చేర్చడానికి సరైన యంత్రాంగం లేక, దూరాభారాలకు ఆడపిల్లలను పంపలేక ఎంతో మంది డ్రాపౌట్‌ అవుతున్నారు. దీంతో వారికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అటు శ్రమకు పనికి రాక అరకొర చదువులతో అత్తమామల వేధింపులతో కుటుంబాల్లో కునారిల్లుతున్నారు. కొద్దిగా స్తోమతుగలిగిన వాళ్లు పదవ తరగతి అయిపోయాక మగపిల్లలను మాత్రమే కార్పొరేట్‌ సంస్థలలో చదివిస్తున్నారు. ఆడపిల్లలను చదివించటంలేదు. నిజానికి ధారణ శక్తుల అధ్యయనంలోను, ఆడపిల్లలే ముందున్నారు. కానీ వారికి కుటుంబంలో, సమాజంలో, పాఠశాలలో ద్వితీయ స్థానమే ఉంది.
     పదవ తరగతి లోపే 8 తరగతిలోను, 9వ తరగతిలోను డ్రాపౌట్‌ అవుతున్న ఆడపిల్లలకు ప్రత్యేక విద్య సదుపాయం రూపొందించటం లేదు. ఇకపోతే ఇంగ్లీష్‌ విద్య పేరుతో రాష్ట్రంలో 86 వేల స్కూళ్లను రద్దు చేశారు. ఒక గ్రామం నుంచి చిన్న పిల్లలు 2, 3 కిలో మీటర్లు నడిచి వెళ్ళి చదవగలరా? వారికి మీరేమైనా ప్రత్యేక బస్సులు వేశారా? వారి ఇంటి దగ్గరి నుండి పిల్లలను తీసుకెళ్లటానికి విద్యా వాలంటీర్లను ఏమైనా నియమించారా? ఎటువంటి సదుపాయాలు లేకుండా ఇలా గ్రామాల్లోని స్కూళ్లను రద్దు చేయడంలోని ఆంతర్యం ఏమిటి ?
     దళిత బడగు మైనార్టీల విద్యార్థులు ప్రాథమిక దశ లోనే డ్రాపౌట్‌ అయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. గ్రామాల్లో స్కూల్‌ ఉంటే ఆ గ్రామానికి విలువ. పిల్లలు మంచి డ్రెస్సులో వెళ్లడం, మంచి పుస్తకాలు చదవడం, ప్లే గ్రౌండ్‌లో ఆటలు ఆడటం ... విద్యా వాతావరణం గ్రామాల్లో ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఎత్తివేసిన పాఠశాలల్లో పేకాటలు, అసాంఘిక కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ప్రైవేట్‌ సూళ్లకు విద్యార్థులను తీసుకెళ్ళడానికి బస్సులున్న విషయం తెలుసు. లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వాలు విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయలేవా ?
     పేరుకు జాతీయవాదం చెప్తారు. చాలా స్కూళ్ళలో హిందీ మాస్టార్లు లేరు. తెలుగు జాతి ముద్దుబిడ్డలం అంటారు. ఎన్నో స్కూళ్ళలో తెలుగు పండిట్‌లు లేరు. ప్రధానమంత్రి గానీ, ముఖ్యమంత్రులకు గానీ చేతిలో పుస్తకం ఉండదు. వీరు లైబ్రరీలు సందర్శించరు. కొత్త లైబ్రరీలు కట్టరు. ఎక్కడా సైన్స్‌ ల్యాబ్‌లు కట్టలేదు. యూనివర్సిటిల్లోనే సైన్స్‌ ల్యాబ్‌లు లేవు. వీరు ద్విభాషలను క్షుణ్ణంగా మాట్లాడలేరు.
    విద్యా గమనాన్ని మీరు గుంతల రోడ్డులో నడపగలరా! విద్యా వ్యాపారులను మరో పక్క ప్రోత్సహిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారు. కార్పొరేట్‌ వ్యవస్థ విస్తృతమై విద్యను కొని అమ్మే ఒక దుర్వ్యాపారం నడుపుతున్నారు.
తండ్రులు ఎక్కువ మంది తాగుతున్నారు. తల్లులు సీరియల్స్‌ చూస్తున్నారు. ఇళ్ళల్లో చదువుకునే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. పిన్న వయసు నుండే విద్యార్థులు వాట్సాప్‌ దృశ్యాలకు అలవాటు పడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు సిగరెట్లు తాగుతున్నారు. 10వ తరగతి లోపే మద్యానికి అలవాటుపడుతున్నారు. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు వ్యధ చెందే పరిస్థితులొచ్చాయి.
    దేశంలో విద్యా దానం పెరగడం లేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి, విజయవాడ కనకదుర్గకు, అన్నవరం సత్యనారాయణ స్వామికి, యాదాద్రి స్వాములకు ముడుపులు రూ. కోట్లల్లో ముడుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామాలయాలు, శివాలయాలు అంజనేయ స్వామి గుళ్ళు, చర్చీలు, మసీదులు, విపరీతంగా నిర్మించబడుతున్నాయి. ఇతర దేశాల్లో దేవుళ్ళను సందర్శించడానికి వెళ్ళే వాళ్ళకు ప్రభుత్వాలే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఈ రోజు తుఫాన్లలో గోదావరి పరివాహక ప్రాంతం పొడవునా కొన్ని వందల బడులు మునిగిపోయాయి వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు విడుదల చేయడం లేదు. ఆ గోడలన్నీ నానిపోయి ఉన్నాయి. రేపు బడులు తెరిచాక పిల్లల మీద ఇటుకలు పడే అవకాశం ఉంది. అన్ని పాఠశాలల్లో పెను పాములు చట్టుకుపోయి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాఠశాలల్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
      దేశంలో విద్యా వ్యవస్థ సన్నగిల్లడానికి కారణం విద్యకు సంబంధించిన ఎన్విరాన్‌మెంట్‌ రూపొందించకపోవడమే. విద్యకు పునాది పరిసరాలు. ఇళ్ళల్లో తాగుబోతు తండ్రులు తల్లిని దుర్భాషలాడుతున్నప్పుడు ఆ పిల్లల మనసు గాయపడుతుంది. విద్య మీద ఏకాగ్రతను చూపలేరు. కొన్నిసార్లు ఆకలితోనే పాఠశాలకు వెళతారు. ఆకలి వేస్తుండగా వాళ్లకు అక్షరం ఎక్కదు. ఉదయాన్నే కడుపు నింపాల్సిన బాధ్యత మనకు ఉంది. కనీసం పాలైనా తాగకుండా పరగడుపున పాఠం వినలేరు. ఆకలి కడుపును మెలిపెడుతుంది. అపస్మారక స్థితికి తెస్తుంది. రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు ప్రేయర్‌ సాంగ్‌, జాతీయ గీతాలాపన సమయంలోనే స్పృహ కోల్పోతున్నారంటే అది ఎంత కరుణార్థ్ర విషయమో పాలకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. విద్యార్థికి శారీరక శక్తి, మానసిక శక్తి, పర్యావరణ స్వచ్ఛత చాలా అవసరం. ప్రతి ప్రభుత్వం ఇళ్ళు కడుతూనే ఉంది. 40 శాతం మందికి ఇళ్ళు లేవు. మధ్యాహ్న భోజనంలో ఇస్తానన్న సోనా మసూరి తెల్ల బియ్యం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మంచి బియ్యం ఇవ్వకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని నిరాకరిస్తున్నారు. కోడిగుడ్ల విషయంలోనూ సరైన శ్రద్ధ లేదు. అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని ప్రకటనలకు పెట్టే ఖర్చుతో ఇంకా మెరుగైన సేవలు ఎన్నో అందించవచ్చు. ప్రభుత్వాల్లో ప్రచారార్భాటం బాగా పెరిగింది. దీని వల్ల పాలకుల వ్యక్తిత్వం వికసించదు. రోజుకొక ప్రకటన, ప్రతిరోజూ మీడియాలో ఫోటోలూ విద్యార్థుల ఆకలి తీర్చలేవు. రాజ్యం విద్యను పోషించకపోతే విద్యతో పాటు రాజు కూడా అప్రతిష్టపాలు అవుతాడు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వారి ప్రధాన కర్తవ్యం ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడం, చిన్న పిల్లలప్పుడు మెదడులో అక్షరాల ధారణ బలంగా ఉంటుంది. అప్పుడు మెదడుకు శక్తి చాలా అవసరం అవుతుంది. పాలు, వెన్న, జున్ను, జీడిపప్పు, బాదం వంటి బలవర్ధకమైన ఆహారంతో మెదడు శక్తిని చిన్నప్పటి నుంచీ పెంచాలి. విద్యను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని నాగరికం చేస్తూ సుసంపన్నం చెయ్యొచ్చు. విద్య ద్వారా జ్ఞానం, అవగాహన, సామాజిక స్పృహ, సాంస్కృతిక వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతాయి. గ్రామీణ పాఠశాలలు మరుగయ్యేకొద్దీ గ్రామం అరాచక పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంది. గ్రామాలలో పాఠశాలలు లేకపోతే నిరక్షరాస్యత, నిద్రాణత, అవిద్య, దారిద్య్రం అలుముకుంటాయి. గ్రామం మందమతులతో నిండిపోతుంది. ప్రజలు అజ్ఞాన సముద్రంలో మునిగిపోతారు. ఇంగ్లీషు భాషాధ్యయనం కోసం మాతృభాషల్ని నిర్లక్ష్యం చేయకూడదు. మాతృభాషలో వంద పద్యాలైనా రానివారు వాక్య నిర్మాణం చేయలేరు. దు:ఖాన్ని వ్యక్తీకరించలేరు. ఆనందాన్ని పొందలేరు. అర్థ మానవులుగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోవైపు పిల్లల్లో సామాజీకరణ పెంచాల్సిన బాధ్యత మనకుంటుంది. మరోపక్క పిల్లల్లో కలిగిన భయాలు విద్య ద్వారా పోతాయి. బూచాడి భయం, దెయ్యం భయం, చీకటి భయం, నిప్పు భయం, బల్లి భయం ఇలాంటివన్నీ విద్య ద్వారానే పోతాయి. విద్య లేని ఊళ్లు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోతాయి.
    ఈ సందర్భంగా గ్రామాల్లోని పాఠశాలలు రద్దు చేయడం విస్మరించాలి. ఉపాధ్యాయ నియామకాలను విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పూర్తి చేయాలి. పాఠశాలలు విలీనం చేసిన దగ్గర ప్రత్యేకమైన ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రతి ఉదయం స్కూల్లో అసెంబ్లీ పూర్తవగానే పిల్లలకు పాలు, పౌష్టిక ఆహారాలు కల్పించాల్సి ఉంది. అలానే ప్రతి విద్యార్థికి ఇంట్లో చదువుకునే వసతి కల్పించాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గ్రామ విద్యను రద్దు చేస్తే రాష్ట్రాలను చీకట్లోకి నెట్టినట్టే అవుతుంది. తప్పు చేయడం కాదు. తప్పును తెలుసుకోవడం, సరిదిద్దుకోవడమే ప్రజాస్వామిక లక్షణం.

/ వ్యాసకర్త : సామాజిక తత్వవేత్త, సెల్‌ : 9849741695/
డా|| కత్తి పద్మారావు

డా|| కత్తి పద్మారావు