Mar 12,2023 07:55

అదేపనిగా ప్రత్యర్థులపై దాడులు, దుష్ప్రచారాలతో లొంగదీసుకునే మోడీ ప్రభుత్వ పోకడలకు తోడు మీడియాలో పక్షపాత ధోరణుల వల్ల ఇడి, ఐటి, సిబిఐలను దుర్వినియోగ పరిచే త్రిశూల వ్యూహం తగినంతగా ప్రజల దృష్టికి రావడం లేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పార్టీలకూ సమానమైన హక్కులు వుంటాయనే సత్యం విస్మరించబడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. గతంలోనూ వీటిపై ఆరోపణలు వున్న మాట నిజమే గాని మోడీ హయాంలో వాటిని పూర్తి కీలుబొమ్మలుగా మార్చివేయడం సత్యం.

చాలామంది తప్పుగా భావిస్తున్నట్టు లేదా కొందరు వ్యాఖ్యాతలు చిత్రిస్తున్నట్టు ఇది అవినీతి నిరోధానికి సంబంధించిన అంశం కాదు. అవినీతి వ్యవహారాలకు ఆధారాలుంటే పార్టీల ప్రమేయం లేకుండా ఎవరిపైనైనా చర్య తీసుకోవాల్సిందే. శిక్షలు పడాల్సిందే. కాని ఒకవైపే చూడు అన్నట్టు తస్మదీయులను ఏరికోరి ఇబ్బంది పెట్టడం, వెంటబడి వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు చేసే అధికారం గతంలో వలెగాక మామూలు అధికారులకు కూడా కట్టబెడుతూ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు ఏ చిన్న అధికారి అయినా ఆరోపణ చేస్తే నిర్దోషిత్వం నిరూపించుకోవలసిన భారం నిందితులదే, ఇంతకన్నా తలకిందులు తర్కం మరొకటి వుండదు.

త నెల ప్రారంభంలో హిండెన్‌ బర్గ్‌ నివేదిక విడుదలైన తర్వాత ఒక్కసారిగా అదానీ సామ్రాజ్యం కుప్పకూలినంత పనైంది. దేశంలోనే గాక ప్రపంచ వ్యాపితంగా ఆ గ్రూపు ప్రభలు కొడిగట్టాయి. రాజకీయ పార్టీల నుంచి సుప్రీం కోర్టు వరకూ ఆందోళనతో ఆగ్రహంతో స్పందించాయి. దేశదేశాల మీడియా సంస్థలు కథనాలు ప్రకటించాయి. గౌతమ్‌ అదానీ ఇంతగా దేశాన్ని దగా చేయగలిగాడంటే ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వ అండదండలే కారణమని ప్రతివారూ విమర్శించారు. అదే విధంగా పార్లమెంటులోనూ ప్రతిపక్షాలు నిలదీశాయి. ఈ వ్యవహారం మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి) వేయాలని గట్టిగా పట్టుపట్టాయి. వారి కంఠశోష, పార్లమెంటు సమయం హరించుకుపోవడం తప్ప దమ్మిడీ ప్రయోజనం కలగలేదు. చివరలో చర్చకు సమాధానమిచ్చిన మోడీ వాటిపై సమాధానం ఇవ్వడం కాదు కదా కనీసం ఖండించడం కూడా జరగలేదు! ఎల్‌ఐసి, ఎస్‌బిఐల నుంచి లక్ష కోట్ల వరకూ అప్పులు ఇప్పించి అదానీని అందలమెక్కించిన కేంద్రం నిర్వాకం కనీసంగా విచారణకు నోచలేదు! దీనిపై పరిశీలనకు ఒక విచారణ కమిటిని నియమించాలని భావించిన సుప్రీం కోర్టుకు కూడా కేంద్రం సహకరించలేదు. తనుగానే అత్యున్నత న్యాయస్థానం ఒక కమిటీని వేసింది. ఈ దర్యాప్తునకు సహకరించకపోగా కేంద్రం సంస్థలు, బిజెపికి దగ్గరగా వుండే మహా కుబేరులు అదానీని కాపాడేండుకు రంగంలోకి దిగారు. అంతిమంగా అమెరికాకు చెందిన రాజీవ్‌ దేశారు భారీ రుణమిచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు ఆ గ్రూపు గట్టెక్కిందని కథనాలు వదులుతున్నారు. అదానీ చిక్కులెదుర్కొంటున్న మరో దేశం ఆస్ట్రేలియా ప్రధానిని పిలిపించి మరీ క్రికెట్‌ ఆట ముసుగులో మంతనాలాడి దారికి తెచ్చుకున్నారు. ఇది అస్మదీయుల సంగతి.
 

                                                                       తస్మదీయులే లక్ష్యం

మరి తస్మదీయులైతేనో? ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌ జరిగిందంటూ వార్తలు, లీక్‌లు వచ్చాయి. కిందటి ఏడాది నుంచి బిజెపి నేతలు దీని గురించి మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ నాయకులు, కెసిఆర్‌ కుటుంబ సభ్యులు అరెస్టు కాక తప్పదని చెబుతూ వచ్చారు. ఇంతలో ఈ కుంభకోణం విచారించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విజరు సక్సేనా సిబిఐని కోరారు. వారు రంగంలోకి దిగాక బిజెపి నేతల దాడి, దూకుడు మరింత పెరిగాయి. తెలంగాణలో ఆపరేషన్‌ ఫాం హౌస్‌ ప్రహసనం తర్వాత బిజెపి నేతల దాడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా అరెస్టు కావలసిందేనని బిజెపి అధ్యక్షుడు బండి సంజరు పలుసార్లు బెదిరించారు. తర్వాత ఈ దాడి ఎంఎల్‌సి కవితపైకి మరలింది. సౌత్‌ గ్రూపుగా ఏర్పడిన కొందరు వైసిపి, టిఆర్‌ఎస్‌ నాయకులు ఢిల్లీ మద్యపాన విధానాన్ని మార్పు చేసి తమకు లాభం వచ్చేలా చేసుకున్నారని ఈ క్రమంలో వంద కోట్లు ముడుపులు ముట్టాయని తెలంగాణ బిజెపి మోతమోగించింది. ఢిల్లీ లోనూ ఆప్‌ను దెబ్బ తీయడానికి ఇదే ప్రచారం మరింత తీవ్రంగా నడిచింది. కేవలం సందేహాల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) రంగంలోకి దిగింది. తమ ఇల్లు మొత్తం సోదా చేసిన ఇడి ఏ ఆధారాలు దొరకలేదని ప్రకటించిందని ఇప్పుడు అరెస్టులో వున్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ప్రకటించారు. అయితే అది వేగంగా మారిపోయింది. ఏవో ఆధారాలు దొరికాయంటూ హైదరాబాదులో కొన్ని అరెస్టులు చేశారు. ఆ తర్వాత దీనంతటికీ సంధానకర్త కవిత అంటూ ఆమెపై దాడి మొదలెట్టారు. కవిత ఇందుకు సంబంధించిన ఫోన్లు ధ్వంసం చేశారనేది మాత్రమే వారు చెబుతున్న ఆధారం. అంటే చచ్చిపోయిన గేదె పగిలిపోయిన కుండడు పాలు ఇచ్చేదన్న చందంగానే ఈ వాదన వుంది. తమాషా ఏమంటే ఇదంతా కూడా మొదట మీడియాలో రావడం తర్వాత ఇడి, సిబిఐ రంగంలోకి దిగడం. ఆ విధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో లిక్కర్‌ కంపెనీలకు మీడియా సంస్థలు లాబీయింగ్‌ వ్యవస్థకు సంబంధించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కవిత నిర్దేశకత్వంలో అరుణ్‌ రామచంద్ర పిళ్ల్తె అనే ఆసామి వీరందరినీ సమన్వయం చేశారనేది సిబిఐ, ఇడి ఆరోపణ. వారిని, వారి తర్వాత సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఆయన తర్వాత రాజకీయ ప్రచారం ఎక్కువ చేసింది కవిత గురించే. ఆమెను రెండు మూడు సార్లు విచారించారు. ఆ సమయంలో ఉద్రిక్తత కూడా తారాస్థాయికి చేరింది. ఈ వారంలో మరోసారి విచారణకు పిలిస్తే ఆమె ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించిన దీక్ష కారణంగా వాయిదా కోరి ఈరోజు హాజరైనారు. ఆ క్రమంలో ఆమె ఫోటోలు ప్రచురించి ఆమె చాలా భయపడుతున్నట్టు వ్యాఖ్యలు రాశారు. అనేక ఇంటర్వ్యూలు ఇచ్చిన కవిత తనకు ఈ వ్యవహారంతో ఏం సంబంధం లేదని, భయం కూడా లేదని చెబుతూ వచ్చారు. ఈ మధ్యలో ఆమె ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడటం, వ్యూహం నిర్ణయించుకోవడం ప్రతిదీ అపహాస్యం చేశారు. స్కాం ఇప్పటికే రుజువైనట్టు, ఆమె కుటుంబం పార్టీ కూడా పద్మవ్యూహంలో చిక్కినట్టు ప్రచారం సాగింది.
 

                                                                   పది పార్టీల అభ్యంతరం

ఈ సమయంలో ఎనిమిది పార్టీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు వారిలో నలుగురు ముఖ్యమంత్రులు, అయిదుగురు మాజీలు ప్రధాని మోడీకి లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపై నిర్బంధానికి దుర్వినియోగపర్చడం అప్రజాస్వామికమని విమర్శించారు. అదానీ ఉదంతంలో వలె బిజెపికి అనుకూలమైతే రక్షించడం, తమ పార్టీలో చేరితే వదలివేయడం ద్వంద్వనీతి అని తేల్చిచెప్పారు. లేఖపై సంతకం చేసిన బిఆర్‌ఎస్‌, ఆప్‌, టిఎంసి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన, సమాజ్‌వాది, ఆర్‌జెడి, నాయకులందరూ ఈ విధమైన వేటకు గురైనవారే, గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలతో చెలగాటమాడటం తప్పని కూడా హెచ్చరించారు (ఢిల్లీ లిక్కర్‌ వ్యవహారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దగ్గరే మొదలైందని గుర్తుంచుకోవాలి. ఆ లేఖ రాసిన రోజునే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై వివాదం రాజేయడం యాదృచ్ఛికం కాదు). ఈ లేఖలో సంతకాలు చేసిన వారంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారేనని ఆరోపిస్తూ దీనిపై కాంగ్రెస్‌, వామపక్షాల నేతల సంతకాలు లేకపోవడం గురించి ఎక్కువ చేసి చూపించారు. తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విడివిడిగా మోడీకి ఇదే విషయమై లేఖలు పంపించారు. కేసుల మంచి చెడ్డలు ఏమైనా దర్యాప్తు సంస్థల తీరు పారదర్శకంగా నిష్పక్షపాతంగా లేదని పినరయి సోదాహరణంగా వ్యాఖ్యానించారు. ఇంతకూ పినరయి విజయన్‌ తన లేఖలో పేర్కొన్నట్టు ఈ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా నగదు కాదంటే డేటా దొరికినట్టు ఇంతవరకూ వెల్లడి కాలేదు. సిసోడియాను విడుదల చేయాలని కూడా స్టాలిన్‌ తన లేఖలో రాస్తే జరిగింది ఆయనను మరో సంస్థ ద్వారా కస్టడీలో కొనసాగించడం. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేయొచ్చని బిజెపి చోటా నాయకులు బెదిరిస్తూనే వున్నారు. ఈ లేఖల తర్వాతనే బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమార్తెల ఇళ్లపై దాడులు చేశారు. అంటే ఇదంతా కావాలని జరుగుతున్నదేనని స్పష్టమవుతుంది.
 

                                                                          ఇదే మోడీ న్యాయం

అదేపనిగా ప్రత్యర్థులపై దాడులు, దుష్ప్రచారాలతో లొంగదీసుకునే మోడీ ప్రభుత్వ పోకడలకు తోడు మీడియాలో పక్షపాత ధోరణుల వల్ల ఇడి, ఐటి, సిబిఐలను దుర్వినియోగ పరిచే త్రిశూల వ్యూహం తగినంతగా ప్రజల దృష్టికి రావడం లేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పార్టీలకూ సమానమైన హక్కులు వుంటాయనే సత్యం విస్మరించ బడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. గతంలోనూ వీటిపై ఆరోపణలు వున్న మాట నిజమే గాని మోడీ హయాంలో వాటిని పూర్తి కీలుబొమ్మలుగా మార్చివేయడం సత్యం. సిబిఐ, ఇడి లకు అధిపతులను నియమించేప్పుడు సుప్రీం కోర్టు సూచనలు తోసిపుచ్చి తమకు లోబడివుండేవారిని సర్వీసు పొడగించి మరీ ఎంపిక చేస్తున్నారు. వారిని తమ ఇష్టానుసారం వేధింపులకు పాల్పడుతున్నారు. ముందే చెప్పినట్టు అస్మదీయులకు ఒక నీతి, తస్మదీయులకు మరో నీతి అంటున్నారు. తృణమూల్‌ నాయకులు సువేందు అధికారి, ముకుల్‌ రారు తమతో చేరగానే వారిపై దర్యాప్తులు ఆగిపోయాయి. తెలుగునాట కూడాకొందరు టిడిపి నేతలకు ఇదే విధమైన ఉపశమనం లభించింది. మరోవంక తమను వ్యతిరేకించే వారిపై నిరంతరాయంగా దాడులు, దర్యాప్తులు నాటకీయంగా సాగిస్తున్నారు. కేరళ వామపక్ష ప్రభుత్వంపైన ముఖ్యమంత్రిపైన కూడా బంగారం స్మగ్లింగ్‌ కేసు మోపాలని విఫలయత్నం చేసిన కేంద్రం దాన్ని ఏదో రూపంగా సాగదీస్తూనే వుంది. మోడీతో జోడీ లేదంటే ఇడి అన్నది ఇప్పుడు తారకమంత్రంగా మారింది. సంపన్న వ్యాపారవేత్తలు, వ్యాపారాలు గల సంపన్న రాజకీయ నేతలు స్వీయ రక్షణ కోసం బిజెపిని ఆశ్రయించితే రక్షణ దొరుకుతుందని భావిస్తున్నారు. మరోవంక మానవ హక్కుల కోసం ప్రజల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సహా లేనిపోని దాడులకు, వేధింపులకు గురవుతున్నారు. న్యూస్‌ క్లిక్‌, క్వింట్‌తో సహా అనేక మీడియా సంస్థలను నడిపించడం దుర్భరంగా మార్చేశారు. ఇవేవీ ప్రజాస్వామిక లక్షణాలు కావు. ఇది ప్రభుత్వ పరిధులు దాటి రాజకీయపార్టీగా బిజెపి ఇష్టారాజ్యంగా మారుతున్నది.
           చాలామంది తప్పుగా భావిస్తున్నట్టు లేదా కొందరు వ్యాఖ్యాతలు చిత్రిస్తున్నట్టు ఇది అవినీతి నిరోధానికి సంబంధించిన అంశం కాదు. అవినీతి వ్యవహారాలకు ఆధారాలుంటే పార్టీల ప్రమేయం లేకుండా ఎవరిపైనైనా చర్య తీసుకోవాల్సిందే. శిక్షలు పడాల్సిందే. కాని ఒకవైపే చూడు అన్నట్టు తస్మదీయులను ఏరికోరి ఇబ్బంది పెట్టడం, వెంటబడి వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. మనీ లాండరింగ్‌ కింద కేసు నమోదు చేసే అధికారం గతంలో వలెగాక మామూలు అధికారులకు కూడా కట్టబెడుతూ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు ఏ చిన్న అధికారి అయినా ఆరోపణ చేస్తే నిర్దోషిత్వం నిరూపించుకోవలసిన భారం నిందితులదే, ఇంతకన్నా తలకిందులు తర్కం మరొకటి వుండదు. దురదృష్టవశాత్తూ దీనికి సుప్రీం కోర్టు ఆమోదం కూడా పొందారు. కనకనే ప్రతిపక్షాలు సుప్రీంకోర్టుకు దీనిపై లేఖ రాసి పున:పరిశీలన కోరాయి. విచ్చలవిడిగా ఇడి కేసులు, దాడులు పెరగడానికి ఇదో ముఖ్య కారణం. కేసుల జాప్యం దీనికి తోడు. ఇటీవల న్యాయస్థానాలు కూడా ఇలాంటి తప్పు పోకడలను గుర్తించినా కేంద్రం వైఖరిలో మార్పు లేదు. ఆధారాలున్న అక్రమాలను చట్టప్రకారం విచారించి కోర్టుల ముందుంచాలి. అంతేగాని తామే తీర్పరులై దండనాయకులై ప్రతిపక్షాలపై విరుచుకుపడి లొంగదీసుకోచూడటం సహించరానిది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి