Feb 14,2023 07:40

ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థకూ విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం చాలా అవసరం. ఒకసారి మన దేశ ప్రభుత్వం తప్పుడు పద్ధతులకు పాల్పడిన వ్యాపార దిగ్గజాన్ని నియంత్రించలేని చేతకానితనాన్ని ప్రదర్శించాక విదేశీ మదుపరుల విశ్వాసం మన దేశం మీద లేకుండా పోతుంది. అప్పుడు విదేశీ నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. అందువలన విదేశీ వ్యాపార చెల్లింపులలో లోటు పెరుగుతుంది. దాని పర్యవసానాలను తట్టుకోవడం కష్టసాధ్యం ఔతుంది.

అదానీ వ్యవహారాల మీద విచారణ జరపకుండా ఉండడం అసాధ్యం. అలా జరపకపోతే అంతర్జాతీయ మదుపరులలో మన మీద విశ్వాసం పోతుంది. ఒకవేళ ఏదో నామమాత్రపు విచారణ జరిపి అదానీ ఏ తప్పూ చేయలేదని నివేదికను తీసుకువచ్చినా, అటువంటి విచారణ పట్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులలో ఎటువంటి నమ్మకమూ ఉండదు. అందుచేత అదానీలకు ఏదో ఒక శిక్ష తప్పదు. అది చిన్న శిక్షే అయినా, ఆ తర్వాత రాజకీయ అధినేతకు, ఈ వ్యాపారదిగ్గజానికి మధ్య పాత స్థాయిలో లంకె కొనసాడం కష్టం ఔతుంది.

          హిండెన్‌బర్గ్‌ సంస్థ తనపై చేసిన ఆరోపణలు నిజానికి భారతదేశం మీద ఎక్కుపెట్టిన దాడి అని గౌతమ్‌ అదానీ అభివర్ణించడం ప్రాధాన్యత గల అంశం. ఈ ఉదంతం జరగడానికి కొద్ది రోజుల ముందే బిబిసి మోడీ మీద ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఆ డాక్యుమెంటరీ బ్రిటిష్‌ ప్రభుత్వపు వలసవాద దృక్పథానికి అద్దం పడుతోందని, అందుచేత అది వాస్తవానికి భారతదేశం మీద చేసిన దాడి అని దానికి ముద్ర వేశారు. సరిగ్గా మోడీ ప్రకటించిన మాదిరిగానే తనపై దాడిని మొత్తం దేశం మీదే జరిగిన దాడితో సమానంగా ప్రకటించే ధైర్యం అదానీకి వచ్చిందంటే దానికి కారణం అటువంటి ప్రకటనతో మోడీ పూర్తిగా ఏకీభవిస్తాడనే భరోసా అదానీకి ఉండబట్టే. మోడీ, అదానీ ఇద్దరూ తమని దేశానికి ప్రతిరూపంగా పరిగణించుకుంటున్నారు. కార్పొరేట్‌-హిందూత్వ కూటమికి కేంద్ర బిందువుగా మోడీ-అదానీ కూటమి ఉంది. అందుచేత వారి దృష్టిలో దేశం అంటే వారిద్దరే. ఈ దేశం భవిష్యత్తు బాగుండడం అంటే రాజకీయంగా మోడీ తిరుగులేని స్థానంలో కొనసాగుతూ వుండడం, ఆర్థిక రంగంలో అదానీ నిరంతరం సంపద పెంచుకుంటూ వుండడం. వారి దృష్టిలో ఈ రెండూ జరగకపోతే దేశానికి భవిష్యత్తు లేనట్టే.
          ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే, మోడీని గాని, అదానీని గాని అనైతికంగా వ్యవహరిస్తున్నారనో, నీతివిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనో విమర్శించలేం. ఎందుకంటే వారిద్దరూ ఏం చేసినా అది తప్పకుండా దేశ ప్రయోజనాల కోసమే చేసినట్టు. తక్కిన అన్ని అంశాలకన్నా దేశ ప్రయోజనాలే అత్యంత ప్రధానం. దేశ ప్రయోజనాలను కేవలం దేశద్రోహులో, దేశానికి శత్రువులుగా ఉన్నవారో మాత్రమే వ్యతిరేకిస్తారు. కనుక వారిద్దరినీ ఏ విధంగా విమర్శించినా అది దేశద్రోహమే ఔతుంది.
           తనను విమర్శించడం అంటే అది దేశ వ్యతిరేకమే అని అదానీ చేసిన ప్రకటనను హిండెన్‌బర్గ్‌ సంస్థ కొట్టిపారేసింది. మోసం చేసినవాడు దేశభక్తి ముసుగు వేసుకున్నంత మాత్రాన చేసిన మోసం చెరిగిపోదని ప్రకటించింది. దేశ ప్రయోజనాలు అంటే ఏమిటో, దేశ భక్తి అంటే ఏమిటో వ్యక్తులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ముందు నిర్వచించి ఆ తర్వాత ఆ కొలబద్ద ప్రకారం ఏదైనా ఒక ఘటనను పరిశీలించి అది దేశానికి ప్రయోజనకరమో కాదో నిర్ధారించాలి. కాని ఇక్కడ దేశ ప్రయోజనం అంటేనే మోడీ-అదానీ ద్వయం అన్నంతగా మమేకం అయిపోయాక ఇక విమర్శించడం అనేది సాధ్యమే కాదు. తనను తాను సమర్ధించుకోడానికి అదానీ వాడుకున్న వాదన ఇదే.
         మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానం ప్రజల ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేవలం తన 'ఆశ్రిత' కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నది. జాతీయ ఆర్థిక సంస్థలైన ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటి సంస్థలను అడ్డగోలుగా వాడుకుని ప్రైవేటు వ్యక్తుల సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. బడా పెట్టుబడిదారులకు పన్నులలో భారీ రాయితీలను కల్పిస్తున్నారు. దాని వలన ఏర్పడే లోటును పూడ్చుకోడానికి పేద ప్రజల సంక్షేమం కోసం చేయవలసిన ఖర్చులో కోతలు పెడుతున్నారు. మామూలుగా పెట్టుబడిదారులకోసం పని చేసే ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చేయవు. అందుకే ఈ ప్రభుత్వ విధానాలను 'ఆశ్రిత పెట్టుబడిదారీ' విధానం (క్రోనీ కేపిటలిజం) అని విమర్శిస్తాం. ఈ 'ఆశ్రిత పెట్టుబడిదారీ' విధానాన్ని సమర్ధించుకోడానికే వాళ్ళు ''ఇదంతా దేశ ప్రయోజనాల కోసమే' అన్న సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. దేశం అంటే ఏమిటో, ఆ దేశాన్ని ఏ విధంగా నిర్మించాలో హిందూత్వ సిద్ధాంతం చెప్పిదానిని వాడుకుంటున్నారు.
         కొద్దిమంది ఎంపిక చేసుకున్న వ్యక్తుల సంపదలను పెంచుకోడానికి అనుసరిస్తున్న వికృతమైన తప్పుడు విధానాలను మామూలుగా ఎవ్వరూ బాహాటంగా చెప్పుకోరు, సమర్ధించుకోరు. ఒకవేళ తప్పుడు విధానాలను అనుసరించినా, వాటిని ఏదో ఒక విధంగా కప్పిపుచ్చడానికి, చాటుమాటుగా చేయడానికి పూనుకుంటారు. కాని మోడీ హయాంలో 'ఆశ్రిత పెట్టుబడిదారీ' విధానం ఏకంగా ఒక ఆర్థిక వ్యూహంగా మారిపోయింది. దానిని కప్పిపుచ్చుకోడానికి మోడీ ప్రభుత్వం ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు సరికదా 'దేశ ప్రయోజనాల' ముసుగులో సమర్ధించుకోజూస్తున్నది.
        గతంలో దక్షిన కొరియా లో కూడా ఇదే విధంగా జరిగిందన్నట్టుగా చరిత్రకారుడు ఆడమ్‌ టూజె వంటి వారు అంటున్నారు. కాని అక్కడికీ, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నదానికీ మౌలికంగానే ఒక తేడా ఉంది. దక్షిణ కొరియాలో గాని, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్‌లో గాని యావత్తు ప్రభుత్వ వ్యవస్థలన్నీ గుత్త పెట్టుబడిదారీ గ్రూపులతో సమన్వయం చేసుకుని వ్యవహరించాయి. ప్రభుత్వం గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని తీసుకునే నిర్ణయాలను గుత్త సంస్థలు నిర్దేశించడం, ఈ వ్యవస్థలన్నీ ఆ గుత్త సంస్థల సంపదలను వృద్ధి చేయడానికి తోడ్పడడం జరిగింది. ఐతే అందుకు ఒక వ్యవస్థాపరమైన ఏర్పాటు అమలులో ఉండేది. కాని మన దేశంలో అటువంటి ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఉన్నది కేవలం దేశాధినేతకి, ఆ వ్యాపార దిగ్గజానికి మధ్య ఉన్న సంబంధం మాత్రమే. దాని కారణంగానే ఆ వ్యాపార దిగ్గజానికి సకల వ్యవహారాలూ జరిగిపోతున్నాయి.
          ఇక నాజీ జర్మనీలో కూడా పాలక పార్టీకి, వ్యాపార సంస్థలకు మధ్య ఒక సన్నిహిత కూటమి ఉండేది. యుద్ధం ప్రారంభానికి ముందు నాజీ జర్మనీలో ఒక్కో వ్యాపార సంస్థతో ఒక్కో నాజీ నేత సంబంధం పెట్టుకుని వ్యవహరించేవాడు. ఆ వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉండేది. ఒకానొక వ్యాపార సంస్థతో సంబంధం కలిగివుండే నాయకుడు గనుక పార్టీలో పట్టు కోల్పోతే ఆ సంస్థ కూడా నష్టపోయేది. లూషినో విస్కాంటీ తీసిన 'ది డామ్డ్‌' అన్న సినిమాలో దీనిని బాగా చూపించారు (ఒకసారి యుద్ధం మొదలయ్యాక ఉత్పత్తి యావత్తూ యుద్ధావసరాలకోసం ఒక కేంద్రీకృత ప్లాన్‌ ప్రకారం జరిగింది.).
         అన్ని రకాల ఫాసిస్టు ప్రభుత్వాల పాలనలోనూ గుత్త పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి నడుమ ఒక కూటమి (ఒక లాలూచీ) ఉండడం చూశాం. అందుకే ముస్సోలినీ ''రాజ్యం, కార్పొరేట్‌ శక్తులు కలగలిసిపోవడమే ఫాసిజం'' అని నిర్వచించాడు. మన దేశంలో సైతం ఇప్పుడు మనం చూస్తున్నది అదే.
         ఐతే కొద్దిమంది రాజకీయ నాయకులు, మరికొద్దిమంది బడా వ్యాపారవేత్తలు కూడబలుక్కుని వ్యవహరించడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను తమ చిత్తం వచ్చినట్టు నడిపించడం, ఆ వ్యవస్థను పూర్తిగా తమ కనుసన్నలలోనే నడిపించడం సాధ్యం కాదు. ఒక దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థను తక్కిన ప్రపంచంతో సంబంధం లేనివిధంగా దానిచుట్టూ ఒక కోటగోడను కట్టేయగలిగితే, అప్పుడు ఆ దేశంలో రాజకీయ అధినేత, వ్యాపార దిగ్గజం కలిసి తమ పెత్తనాన్ని చెలాయించడం సాధ్యపడవచ్చునేమో. కాని పెట్టుబడి ప్రపంచీకరణ జరిగిన తర్వాత అటువంటిది సాధ్యం కాదు.
          దేశం మీద పట్టు సంపాదించిన తర్వాత ఆ వ్యాపార దిగ్గజం కేవలం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిధి లోపలే తన ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేసుకోడు. అలా పరిమితం అయితే, దేశం లోపల ఉన్న పోటీలో అతడు తన పైచేయిని కోల్పోయే ప్రమాదం ఉంది. తక్కిన వ్యాపార దిగ్గజాలు అతడిని స్వాహా చేసే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ అగ్ర అధినేత ప్రాపకం సంపాదించిన తర్వాత ఆ వ్యాపార దిగ్గజం అంతర్జాతీయ రంగంలోకి అడుగుపెడతాడు. ఒకసారి ఆ విధంగా అడుగుపెట్టగానే ఇక అతగాడి లావాదేవీలన్నీ అంతర్జాతీయంగా వివిధ దిగ్గజాల పరిశీలనకు గురవుతాయి. అంతర్జాతీయ పోటీ లోకి అతడు దిగగానే ఆ అంతర్జాతీయ పోటీ నియమాలన్నీ పాటించవలసి వుంటుంది. ఒకవేళ ఆ నియమాలను గనుక అతిక్రమిస్తే వెంటనే అందరి చూపూ అతడిపైన పడుతుంది. అతడు శిక్షకు పాత్రుడౌతాడు. తక్కినవారందరికీ ఏవో నీతి నియమాలు ఉండినందువలన కాదుగాని, ఆ యా దిగ్గజాల మధ్య ఉండే పోటీ కారణంగా ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అదానీ విషయంలో జరిగిందదే.
         అతడి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం తన తోడ్పాటును అందించి వుండొచ్చు. కాని ఒకసారి అందరి దృష్టిలో పడి, అంతర్జాతీయ ''అభిప్రాయం'' అతడి సంస్థకు ప్రతికూలంగా మారిన తర్వాత అటువంటి తోడ్పాటును కొనసాగించడం కూడా కష్టం అవుతుంది. ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థకూ విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం చాలా అవసరం. ఒకసారి మన దేశ ప్రభుత్వం తప్పుడు పద్ధతులకు పాల్పడిన వ్యాపార దిగ్గజాన్ని నియంత్రించలేని చేతకానితనాన్ని ప్రదర్శించాక విదేశీ మదుపరుల విశ్వాసం మన దేశం మీద లేకుండా పోతుంది. అప్పుడు విదేశీ నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. అందువలన విదేశీ వ్యాపార చెల్లింపులలో లోటు పెరుగుతుంది. దాని పర్యవసానాలను తట్టుకోవడం కష్టసాధ్యం ఔతుంది.
ఒకవేళ ఈ వ్యాపార దిగ్గజం ఏదో ఒక విధంగా ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోగలిగినా, మోడీ ప్రభుత్వం ప్రదర్శించే పొగరుమోతుతనం మాత్రం కొనసాగడం కుదరదు. అదానీ వ్యవహారాల మీద విచారణ జరపకుండా ఉండడం అసాధ్యం. అలా జరపకపోతే అంతర్జాతీయ మదుపరులలో మన మీద విశ్వాసం పోతుంది. ఒకవేళ ఏదో నామమాత్రపు విచారణ జరిపి అదానీ ఏ తప్పూ చేయలేదని నివేదికను తీసుకువచ్చినా, అటువంటి విచారణ పట్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులలో ఎటువంటి నమ్మకమూ ఉండదు. అందుచేత అదానీలకు ఏదో ఒక శిక్ష తప్పదు. అది చిన్న శిక్షే అయినా, ఆ తర్వాత రాజకీయ అధినేతకు, ఈ వ్యాపార దిగ్గజానికి మధ్య పాత స్థాయిలో లంకె కొనసాడం కష్టం ఔతుంది. తన 'ఆశ్రితుడికి'' శిక్ష పడిన తర్వాత దేశ ప్రయోజనాలంటే ఆ ఆశ్రితుడి ప్రయోజనాలే అన్న సిద్ధాంతమూ పలచబడుతుంది. ఒక విధంగా కార్పొరేట్‌-హిందూత్వ కూటమి దూకుడు కొనసాగడం కష్టం అవుతుంది.
         పెట్టుబడి ప్రపంచీకరణ క్రమానికి, జాతి రాజ్యానికి మధ్య ఉండే వైరుధ్యం ఈ అదానీ ఉదంతం రూపంలో బైటపడింది. అది హిందూ రాజ్యమే కావొచ్చు. కాని, ప్రపంచీకరణ జరిగే క్రమంలో, అంతర్జాతీయంగా నెలకొన్న పోటీ నడుమ ఒక రాజ్యం ఆ అంతర్జాతీయ పోటీ నిబంధనలకు అతీతంగా వ్యవహరించడం సాధ్యం కాదు.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌