నర్సీపట్నం అర్బన్ (అనకాపల్లి) : విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలుకు రూ.42 వేల కోట్లకు బిడ్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన తండ్రి బర్నబాస్‌ను కలిసేందుకు శనివారం కేఏ పాల్ వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద స్థానికులతో మాట్లాడారు.
కేఏ పాల్ మాట్లాడుతూ.. ' బిడ్ వేసేందుకు కొన్ని లేఖలు అవసరం. ఆ లేఖలు ఇవ్వాలని అడుగుతున్నా. అవి ఇస్తే రెండు వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తా. విశాఖ ఉక్కు విలువ రూ.3.5 లక్షల కోట్లు. దాన్ని రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు. దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే టిడిపి, వైసిపి, సిపిఐ నాయకులను కలిసేందుకు విశాఖపట్నం వచ్చా. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తానంటోంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు కెసిఆర్ మాట ఉంది. చంద్రబాబు రూ.5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్‌కు అప్పగిస్తే.. ఈయన మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను సిఎం అయితే అమరావతిలో ఆపేసిన భవనాలన్నింటినీ ఏడాదిలో కట్టేస్తా. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ నాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు ' అని కేఏ పాల్ అన్నారు.










