Nov 04,2023 21:45

-దేశంలో బిజెపి నాటకాలు సాగనివ్వం : పి.మధు
విశాఖలో ఉత్తేజంగా ప్రజారక్షణ భేరి యాత్ర
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, విలేకరులు :మూడోసారి మోడీ గెలిస్తే దేశంలోని ప్రజలకు రక్షణ ఉండదని సిపిఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యపరిచి దేశంలో బిజెపి నాటకాలు సాగనివ్వబోమని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర విశాఖలో శనివారం ఉత్తేజంగా జరిగింది. ఎన్‌ఎడి జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కంచరపాలెం, ఆర్‌టిసి కాంప్లెక్స్‌, జగదాంబ, పూర్ణామార్కెట్‌, శ్రీహరిపురం, గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో సాగింది. పూర్ణా మార్కెట్‌ వద్ద యాత్రా బృందానికి ప్రజలు, అసంఘటి రంగ కార్మికులు, చిరువ్యాపారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో మధు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ పాలన అధ్వానంగా ఉందన్నారు. ఆంధ్రా, తెలంగాణల్లో అధికారంలో ఉన్న వారిని అడ్డంపెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించాలని బిజెపి చూస్తోందని విమర్శించారు. ఆ నాటకాలను సిపిఎం సాగనివ్వదని హెచ్చరించారు. బంగాళాఖాతంలో బిజెపి కలిసిపోయే రోజులు వచ్చేశాయని, ఆ పార్టీని ప్రజలు ఛీత్కరిస్తున్నారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రానున్న రోజుల్లో తూర్పుకు తిరిగి దండం పెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బిజెపికి రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు, పవన్‌ వంతపాడడం మానుకోవాలని హితవు పలికారు. విభజన చట్టంలోని ఎపికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్‌ వంటి ఏ ఒక్క అంశాన్నీ కేంద్రం నెరవేర్చకున్నా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన నోరెత్తకపోవడం దారుణమన్నారు. స్కీం వర్కర్లకు పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలిపారు. దేశంలో మహిళలకు భద్రత కరువవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ జివిఎంసిలో టిడిఆర్‌ల పేరిట రూ.వెయ్యి కోట్లు దోచుకున్నారని, ఆ విషయంలో వైసిపి, టిడిపి దొందూ దొందేనని విమర్శించారు. 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, ఆ పార్టీని సమర్థించే పార్టీలకూ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న పరిస్థితులు ప్రజలందరినీ కలవరపరుస్తున్నాయని తెలిపారు. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసే కన్నా, మన బతుకులను, రాష్ట్ర భవిష్యత్తును సక్రమ మార్గాన నడిపించడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.

  • ప్రభుత్వ రంగ సంస్థలతోనే గాజువాక అభివృద్ధి : సిహెచ్‌.నర్సింగరావు

ప్రభుత్వ రంగ సంస్థలతోనే గాజువాక ప్రాంతం ఇంతలా అభివృద్ధి చెందిందని సిపిఎం సీనియర్‌ నాయకులు సిహెచ్‌.నర్సింగరావు తెలిపారు. పాత గాజువాక, కూర్మన్నపాలెం జంక్షన్ల వద్ద జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అదానీ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోతోందన్నారు. గంగవరం పోర్టును అదానీకే అప్పగించారని, మరో మూడు పోర్టులను ఆయనకే కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. త్యాగాలతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేట్‌పరం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగం ఉంటేనే రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. ప్రభుత్వ రంగ రక్షణ సిపిఎం విధానమన్నారు. విశాఖలో అన్నిచోట్లా యాత్రా బృందానికి ఘన స్వాగతం లభించింది. జనం పూల వర్షం కురిపించారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, ధనలక్ష్మి, ప్రభావతి, హరిబాబు, ఉక్కునగరం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు పాల్గొన్నారు.

  • వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటాం

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని పి.మధు అన్నారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాటకాలన్నిటికీ దేశ ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారని తెలిపారు. విశాఖలోని పూర్ణా మార్కెట్‌ వద్ద శనివారం జరిగిన సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సభలో పాల్గనేందుకు విచ్చేసిన ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్నా వైసిపి ప్రభుత్వం మౌనం దాల్చడం దారుణమన్నారు. చంద్రబాబును జైలులో పెట్టించిందే మోడీ అయితే, జైలు నుంచి చంద్రబాబు బయటకొచ్చి బిజెపికి అభినందనలు తెలపడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మోడీ హయాంలో రైలు ప్రమాదాలు నానాటికీ పెరుగుతున్నాయని, ప్రజలు రైలు ఎక్కాలంటే హడలిపోయే పరిస్థితి వచ్చేసిందని అన్నారు. ఉపా చట్టం కింద రెండేళ్లకు మించి జైలులో ఉండకూడదని, ముంబయిలో అనేక మంది సామాజికవేత్తలు, ప్రజాస్వామికవాదులు మూడేళ్లకు పైబడే మోడీ పాలనలో జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు.