తన దారిలోనే
ప్రవహించిన నది
ఇపుడు ఇండ్ల మధ్యలోకొచ్చింది
గింజలను మొలిపించి
కడుపులను నింపి
గొంతులను తడిపి
ప్రాణాలను నిలిపిన నది
ఇపుడు విలవిల్లాడించేస్తోంది
కరకట్టలు దాటి
పల్లె గుండెల మీదుగా ప్రవహిస్తోంది
మాటల తీగలు తెగిపడి
వెలుతురు వంతెనలు కూలిపడి
కన్నీళ్లూ కలిసినందుకేమో
ఉధృతి మరింతగా పెరిగి
అలలతో పాటూ జీవితాలూ
తేలుతున్నాయిప్పుడు
జీవనాలు కొట్టుకుపోతున్నాయిప్పుడు
పాలు.. పట్టెడు మెతుకుల పొట్లాలు
విసిరితే పట్టుకుందామని
ఇంకా చాచే ఉంచిన చేతులు
పాలకులు ఇవ్వాల్సిన ఆసరా మాత్రం
ఆమడల దూరంలోనే ఆగిపోయింది
ఇపుడు ఊర్లలో ఎక్కడ చూసినా
నీళ్లే తిరుగాడుతున్నాయి
మనుషుల్ని మంచెల మీదా
మిద్దెల మీదకీ తరిమేసిన
వరద దురాక్రమణ
వరదను దిగమింగుకుంటూ
విపత్తులకు కారణాలు వెతుక్కునే పనిలో
తెరిచిన నోళ్లతో.. ఆనకట్టలు
- డా.దారల విజయకుమారి
91771 92275