Sep 24,2023 08:45

హీరోయిన్‌గా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలో తనదైన ప్రతిభతో నటించి, మంచి గుర్తింపు సాధించారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. మీది స్టార్‌ కుటుంబమైనా మీరెందుకు కష్టపడి పనిచేస్తున్నారు? అని అడగ్గా.. 'నేను స్టార్‌ని కాదు. మానాన్న పెద్ద హీరో. నేను సంపాదించింది మాత్రమే నాది అని భావిస్తా. అందుకే కష్టపడతా. ఒక నటిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలనుకుంటాను' అని నిండైనా ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. సినీ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆమె తర్వాత ఎన్నో విజయాలను అందున్నారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో తెలుగు, తమిళనాట అభిమానులను సంపాదించుకున్నారు.

2


నటుడు, చిత్రనిర్మాత కమలహాసన్‌, సారిక ఠాకూర్‌ పెద్ద కుమార్తె శృతిహాసన్‌. హాసన్‌ చెన్నైలోని లేడీ ఆండాల్‌ పాఠశాల్లో పదోతరగతి వరకూ చదవుకున్నారు. సెయింట్‌ ఆండ్రూస్‌ కళాశాలలో మనస్తత్వ శాస్త్రంలో డిగ్రీని పొందేందుకు ముంబైకి వెళ్లారు. చదువుతుండగానే సినిమా, సంగీతంపై దృష్టి పెట్టారు. కాలిఫోర్నియాలోని మ్యూజిషియన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకున్నారు. నటన, పాడటం అంటే ఆమెకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పియానో వాయిస్తూ పాడుతూ ఉంటారు. చదువుకునే రోజుల్లో సేల్స్‌గర్ల్‌ అవ్వాలని కోరుకున్నారు. అందుకే ఏ దుస్తుల దుకాణానికి వెళ్లినా అక్కడ కస్టమర్లతో చాలాసేపు కబుర్లు చెబుతూ ఉండిపోయేవారట. సినిమాల్లోకి వచ్చాక ఆమె ఆలోచన మారిపోయింది.
హిందీ చిత్రం లక్‌ (2009) తో తన నటనా రంగ ప్రవేశానికి ముందు తన తండ్రి దర్శకత్వం వహించిన హే రామ్‌ (2000) లో అతిథిపాత్రలో నటించారు. ఆమె తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' తో అరంగేట్రం చేశారు. 'సెవెన్త్‌సెన్స్‌' సినిమాతో తమిళ అరంగేట్రం చేశారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ మహిళా అరంగేట్రం - సౌత్‌ రెండింటికీ ఫిలింఫేర్‌ అవార్డును గెలుచుకున్నారు. ఆమె సినీ జీవితం మొదట పరాజయాలు పలకరించినప్పటికీ 'త్రి', 'గబ్బర్‌ సింగ'్‌ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి. ఈ సినిమాలు భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల, ప్రేక్షకుల దృష్టిలో శృతిహాసన్‌ స్థాయిని పెంచాయి. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టాయి. అంతేకాకుండా రవితేజతో 'బలుపు', జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'రామయ్యా వస్తావయ్యా', ఎవడు, 'ఓ మై ఫ్రెండ్‌, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్‌', భోళా శంకర్‌ ఇలా పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో అనేక చిత్రాల్లో నటిచారు. దాంతో తెలుగు, తమిళ అభిమానుల్లో మంచినటిగా ముద్ర వేయించుకున్నారు. ఆమె గాయనిగా కొన్ని సినిమాల్లో పాటలూ పాడారు.

3


హాసన్‌ తన తండ్రి నిర్మించిన 'ఉన్నైపోల్‌ ఒరువన్‌ (2009)' తో సంగీత దర్శకురాలిగా తన వృత్తిని ప్రారంభించారు. అప్పటి నుండి తన స్వంత సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎడిసన్‌ అవార్డ్స్‌లో 'ఉన్నైపోల్‌ ఒరువన్‌'కి ఉత్తమ సంగీత దర్శకురాలిగా అవార్డును అందుకున్నారు. దేశంలో పలు నగరాల్లో తన బృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. మానసిక ఆరోగ్యం, సినిమాలు, మీడియాలో మహిళలు, ఫ్యాషన్‌లో స్థిరత్వం వంటి సామాజిక అంశాలపై హాసన్‌ ఆన్‌లైన్‌ సెషన్స్‌ కూడా నిర్వహిస్తూంటారు. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'సలార్‌' పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆమె మొదటిసారి డబ్బింగ్‌ చెప్పనున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో తన డబ్బింగ్‌ తానే స్వయంగా చెప్పేలా పలు భాషాలను నేర్చుకుంటున్నారు. 'టాటూలంటే నాకు పిచ్చి. ఒకవేళ నటిని కాకుంటే ముఖం మీద కాకుండా ఒంటినిండా టాటూలు వేయించుకునేదాన్ని' అని నవ్వుతూ చెప్పారు.

పేరు : శృతిహాసన్‌
పుట్టింది : 28 జనవరి, 1986.
నివాసం : చెన్నయి
వృత్తులు : నటి, గాయని
సోదరి : అక్షర హాసన్‌ (నటి)
ఇష్టమైన ప్రాంతం : లండన్‌