Jun 29,2023 07:46

ముంబయి : వాణిజ్య రాజధాని ముంబయిలోని ఐఐటి-బొంబాయి భారత విద్యా వ్యవస్థలో బుధవారం ఒక మైలురాయిని నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మైన మొదటి 150 విశ్వవిద్యాలయాల జాబితా లో చోటు సంపాదించింది. క్యుఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్‌ తాజా ఎడిషన్‌లో ఈ ఘనత దక్కింది. గతేడాది 177వ స్థానంలో వున్న బాంబే ఐఐటి ఈసారి 149వ స్థానంలోకి వచ్చింది. గత 8ఏళ్ళలో భారత ఉన్నత విద్యా సంస్థ టాప్‌ 150లోకి చేరుకోవడం ఇదే మొదటిసారి. 2016లో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి)కి 147వ ర్యాంక్‌ లభించింది. కాగా ఈ ఏడాది ఐఐఎస్‌సి ర్యాంక్‌ 225కి పడిపోయింది. గతేడాది 155వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది 174వ స్థానంలో వున్న ఐఐటి ఢిల్లీ ఈసారి 197కి పడిపోయింది. కానీ, ఈ జాబితాలోని రెండో ఉన్నత భారత విద్యా సంస్థ ఇదే. టాప్‌ 150లో చేరినందుకు ఐఐటి బాంబేను కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అభినందించారు. భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయని అన్నారు. ఇక ఇప్పుడు మెరుగైన విద్య కోసం విదేశాలకు తక్కువమంది భారతీయులు ప్రయాణిస్తారని వ్యాఖ్యానించారు. భారతీయ విద్యా వ్యవస్థ బాగుండడం కాదని, ప్రపంచంలోనే ఉత్తమంగా వుందని అన్నారు. పరిశోధనల నాణ్యతలో స్థిరమైన మెరుగుదలలతో కూడిన అద్భుతమైన ప్రయాణం ఐఐటి బాంబేదని క్యుఎస్‌ అనలిస్ట్‌ జారీ చేసిన ప్రకటన పేర్కొంది.