Sep 11,2022 12:36

అందిపుచ్చుకున్న ఆశయాలకు
అవాంతరాలే ఆశీస్సులు
అగమ్యగోచరంగా సాగే ఈ ఆకలి బాటకు
ఆరాటాలే పట్టుకొమ్మలు
కన్నీటి తెరలను తొలగించి
కష్టాన్ని కన్నుల్లో దాచుకున్నా
చలించని నా మనసుకు మనోధైర్యాన్నిస్తూ
ముందడుగు వేస్తున్నా

ప్రజ్వలిలో భవిష్యత్తు కోసం పరితపిస్తూ
పరిస్థితుల గండాలు దాటుతున్నా
భావోద్వేగాల బందీని అయ్యాను కానీ
భావాలన్నీ నింపుకొని నిండుకుండగా మారాను
ఆచరణలో పెడుతున్నా
అందుకోవాలి అనుకున్న ఆకాశపు అంచుల్ని

పతాకాన్ని నేనై రెపరెపలాడుతా
తుపాకీని నేనై చెలరేగిపోతా
చంద్రబింబంలా కనిపించి.. అగ్నిలా ఎగసిపడతా
కదిలే ఈ కాలాన్ని గుప్పెట్లో బంధించి
నా చేతి రేఖలు మారుస్తా
పరుగులు తీసే ఈ సంద్రాన్ని కలంగా మార్చి
నా నుదుటి రాత నేనే రాస్తా.....

పోలగాని భాను తేజశ్రీ
98665 97260