రాళ్ళు రప్పల రహదారుల్లో ..
చీకటి చెలిమి తోడుగా.. నిర్భయంగా ..
సాగిపోతూనే ఉండేది తృప్తిగా నా గమనం ఒక నాడు ..
నేడు విశాలమైన రహదారులపై,
అధునాతనమైన సౌకర్యాలతో
నిర్భయంగా నడవలేని పరిస్థితుల్లో..
ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో
అనే భయం వెంటాడుతూనే ఉంది ప్రతిక్షణం
సద్ది కట్టుకుని , చంటి దాన్ని సంకనెత్తుకుని
అడివిలో దొరికేటి పుట్టతేనే, ఇప్పపువ్వు సంతలో
అమ్ముకుని, పచారీ సరుకులు తెచ్చున్న రోజుల్లో
పస్తులుండడం తెల్వలేదు నాకెన్నడూ..
ఐదంకెల బత్తెం పుచ్చుకునే కొలువు చేస్తూ
కుటుంబ భారాన్ని లాగలేక లాగుతూ
ప్రతి నెలా చాలీచాలని చిల్లర ఖర్చులకు
పక్కవారిని నిత్యం ఆశ్రయిస్తూ
నేడు పస్తులు ఉండక తప్పడం లేదు
ఆపద వచ్చిందంటే ఊరు ఊరు కదిలొచ్చే
పల్లెనొదిలి, పలికరింపులే కనుమరుగౌతున్న
పట్నంలో బతుకు దుర్భరంగా మారితే కానీ..
నా పల్లె విలువ నాకు తెల్వలా..
నే పోతున్నా! నా పల్లెకు.
అనురాగాలు.. ఆప్యాయతలు..
పలకరింపులు.. పలవరింతలు..
స్వాగతిస్తున్నాయి..
కమ్మని మట్టి పరిమళం..
కల్మషమెరుగని పల్లె జీవనం పిలుస్తోంది
నే పోతున్నా! నాపల్లె తల్లి ఒడిలో సేద తీరాలని
రాము కోలా
9849001201