Dec 11,2022 12:38

ఏకాంతంగా నేనూ, నేల ముచ్చటించుకుంటాం
సాధక బాధలను పంచుకుంటాం
మట్టిలో దాగిన మాధుర్యాన్ని పెనవేసుకొని..
సాగుబడికై నడుంకట్టి కదులుతాను
మేఘం నల్లమబ్బులై భూమివంక చూస్తుంది
వర్షపు చినుకై పుడమిని పులకరింప చేయాలని
సెలయేరుగా ఉరకలెత్తి దుమకాలని
నీరు పంటకాపు పాదాలని కడుగుతూ
పొలం తనువుపై పురుడోసుకుంటున్న
మొక్కలన్నీ ఆకలి రూపాలై ఎదుగుతున్నాయి
సేద్యకాడి కలల్ని కళ్ళలో నింపుకొని
దుక్కిదున్నిన చేతులకు మట్టి.. గంధమై తాకుతుంది
స్వేదపు చినుకులు సేను ఎదను ముద్దాడుతున్నాయి
నేల...అన్నదాత ఇద్దరూ యుద్ధంలో మునిగిపోయారు
ప్రపంచానికి పట్టెడణ్ణం పెట్టడానికి
ఆశల స్వప్నాలను పొలం గట్టున కట్టేసి..
నేలపై సేద్యపు కవిత్వం రాస్తున్నాడు అన్నదాత
మట్టిని కప్పుకొని ఎదుగుతున్న విత్తుకు తెలుసు...
కర్షకుని కష్టమేంటో..
పంటకాపు గుండెల్లో నిండుకున్న దుఃఖపు..
మబ్బుల్ని చెరిపేసి..
ధాన్యపు రాసుల్ని ధనరాసులుగా గుమ్మరించాలని
రెండాకుల కొమ్మలై విరబూస్తున్నాయి
పువ్వులన్నీ విచ్చుకుంటున్నాయి పంటకాపు ప్రతిరూపమై.
నేలంతా రైతన్న కష్టం
పచ్చని పంటలై
వాళ్ళిద్దరి పోరు ఆగదు
ఎలాంటి ఫలితం ఆశించని సేవకులై సాగుతారు
వాళ్ళిద్దరి కష్టం ఎక్కడికి పోదు
బుక్కెడు అన్నం మెతుకులై ఆకలి తీరుస్తారు
ప్రపంచానికి ప్రాణంపోసే అమతమై కురుస్తారు
ఆ అన్నదాత ఎవరో కాదు
నేనే..నేనే..

అశోక్‌ గోనె
9441317361