ఏంటోయ్ నువ్వు
ఎప్పుడూ ఏదో
ఆలోచిస్తూ ఉంటావ్
అర్థం కాకుండా ఏదో గీస్తూ..
తెల్లటి పేజీలను నల్లగా చేస్తూ ఉంటావ్
అనే ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళు.
అప్పుడు నేను
రెండు అక్షరాలై నవ్వాను..
అది చూసి పిచ్చోడు అన్నారు.
ఒక బాధ ఒక సంతోషం
అయినా నేను నవ్వడం ఆపలేదు..
క్యాలెండర్‌లో తేదీలు మారేకొద్దీ
నేను బిగ్గరగా నవ్వడం నేర్చుకున్నాను.
నెలలు మారేకొద్దీ భావాల అలలై
కదులుతూ..
రాగాల ఉయలై ఊగుతూ..
కలంలో కాలాన్ని పోసి
పేపర్‌పై నవ్వాను..
కవితై నవ్వాను..
నిజం నిప్పు అంటించి విప్లవమై నవ్వాను.
మళ్లీ వాళ్ళలో ఒకడు వచ్చి
కులం రాయితో
మరొకడు మతం రాయితో
ఇంకొకడు ప్రాంతం రాయితో
తర్వాత భాష రాయితో
నా మానస సరోవరంలో
అలజడి సృష్టించారు..
అప్పుడు నేను ప్రశాంతంగా మారి..
నిలకడగా నవ్వి అన్నాను..
'నేను మనిషిని ...
మానవత్వం ఉన్న మనిషిని' అని.
అప్పుడు
అందరూ నా చుట్టూ చేరి..
నా అక్షరాల వైపు ఒకసారి చూసి
నేనో కవిని అన్నారు
కాల్పనికుణ్ణి అన్నారు
గురువు అన్నారు..
ఒకరు యోగి అన్నారు..
మరొకరు భోగి అన్నారు
ఇంకొకరు ఇంకేదో అంటూ భజన చేశారు..
అప్పుడు నేను మళ్లీ నవ్వాను, విచిత్రంగా నవ్వాను..
చిత్రవిచిత్రమైన ఈ మనుషుల్ని చూసి
నా నవ్వు ఆగడం లేదు, నిర్విరామంగా సాగుతూనే ఉంది !
శ్రీతరం
78936 13015