
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో డిసెంబర్ మొదటి వారంలో పర్యటించారు. ఆ తర్వాతే జగన్ క్యాబినెట్ అదానీ గ్రీన్ ఎనర్జీకి హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పగించాలని నిర్ణయించింది. 2023 బడ్జెట్‌లో నేషనల్ గ్రీన్ ఎనర్జీకి రూ.19,500 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రహదారి, భూమి ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని, ప్రాజెక్టు ఏర్పాటుకు కొనుగోలు చేసే నిర్మాణ యంత్రాల సామాగ్రిపై 100 శాతం జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కార్పొరేట్ సంస్థల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం పెదకోట, చిట్టంపాడు, గుజ్జెలి ప్రాంతాల్లో సుమారు 5500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనివల్ల పచ్చని అడవి జలసమాధి అయ్యే ప్రమాదముంది. ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెట్ క్యాప్)ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టడానికి ఆ ప్రాంతాల్లో 8 డ్యామ్‌లు నిర్మించనున్నారు.
గిరిజన ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి నెట్‌క్యాప్ సంస్థను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఇంధనశాఖ వారు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో గత 2 సంవత్సరాలుగా రహస్యంగా సర్వే నిర్వహించారు. పర్యాటకులు, పోలీసులు, అటవీశాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితర పేర్లతో ఫీజబిలిటీ రిపోర్టు రూపొందించడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించారు. కమ్యూనికేషన్‌లో వెనుకబడిన గిరిజన ప్రాంతంలో సెల్ టవరు ఏర్పాటు చేస్తామని గిరిజనులకు మాయమాటలు చెప్పి సర్వే నిర్వహించారు.
మోడీ రాకతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రకటన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో డిసెంబర్ మొదటి వారంలో పర్యటించారు. ఆ తర్వాతే జగన్ క్యాబినెట్ అదానీ గ్రీన్ ఎనర్జీకి హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పగించాలని నిర్ణయించింది. 2023 బడ్జెట్‌లో నేషనల్ గ్రీన్ ఎనర్జీకి రూ.19,500 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రహదారి, భూమి ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని, ప్రాజెక్టు ఏర్పాటుకు కొనుగోలు చేసే నిర్మాణ యంత్రాల సామాగ్రిపై 100 శాతం జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కార్పొరేట్ సంస్థల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పంపు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అవసరమైన ప్రోత్సాహకాల కోసం కార్పొరేట్ సంస్థలు తహతహలాడుతున్నాయి.
గిరిజన జీవనం విధ్వంసం
హైడ్రో ప్రాజెక్టు ప్రాంతంలో అటవీ వ్యవసాయ ఉత్పత్తులు సేకరించుకొని గిరిజనులు జీవిస్తున్నారు. కాఫీ, పైనాపిల్, కమలా, బత్తాయి, జీడిమామిడి, చింతపండు మొదలగు ఉత్పత్తులే ప్రధాన ఆర్థిక వనరులు. పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి దిగువ ఎగువ డ్యామ్‌లు నిర్మాణం ద్వారా అటవీ, పోడు, సాగు భూములు జలసమాధి కానున్నాయి. 10 పంచాయితీ పరిధిలలో సుమారు 20 వేల ఎకరాలు, 97 గ్రామాల్లో 15 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారు. ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతాన తాండవ రిజర్వాయరు, పెదకోట దిగువ ప్రాంతాన రైవాడ రిజర్వాయర్ కింద సాగు, తాగునీరును వినియోగస్తున్న వారు వేలాది మంది వున్నారు.
ఎస్టీ కమిషన్ అనుమతి లేదు
భారత రాజ్యాంగం గిరిజన హక్కులు, చట్టాలకు రక్షణ కవచంగా ఉంది. 5వ షెడ్యూల్డ్ ఏరియాలో మేజర్, మైనర్ ప్రాజెక్టుల నిర్మాణానికి జాతీయ ఎస్టీ కమిషన్ అనుమతి పొందాలని ఆర్టికల్ 338లో పేర్కొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రాజ్యాంగ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించలేదు.
అటవీ, గిరిజన చట్టాల ఉల్లంఘన
ఫారెస్టు, షెడ్యూల్డు ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం అటవీ ప్రాంతంలో అటవీయేతర కార్యకలాపాలకు అటవీ హక్కుల కమిటీ ఆమోదం తప్పనిసరి. కానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో సర్వే నిర్వహణకు గాని, నిర్మాణానికి గాని సుమారు 15 అటవీ హక్కుల కమిటీల నుండి ప్రభుత్వం అనుమతి పొందలేదు. పంచాయితీ రాజ్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పీసా) చట్టం నిబంధనలు-2011 ప్రకారం పీసా కమిటీలను 2014లో ప్రభుత్వం నియమించింది. వాటి కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమే. 2019 చివరి నాటికి పీసా కమిటీ కాలపరిమితి పూర్తయినప్పటికీ నేటికీ పునరుద్ధరణ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే గిరిజన ప్రాంత సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్ర పాలకులు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం పీసా కమిటీని పునరుద్ధరించి గ్రామసభ ఆమోదం తప్పనిసరిగా పొందవలసి వుంది. గిరిజన శాసన సభ్యులతో రాజ్యాంగం ద్వారా నియమితమైన గిరిజన సలహా మండలి (టిఎసి)లో కూడా చర్చించలేదు. గిరిజన మంత్రి చైర్మన్‌గా వుంటూ మౌనం వహిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే, టిఎసి సభ్యురాలు భాగ్యలక్ష్మి సైతం వైసిపి ప్రజాప్రతినిధుల సమావేశంలో కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇవ్వాలని కోరడం దారుణం.
బాక్సైట్ తరహాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు
నాడు చంద్రబాబు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎపిఎండిసి ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి బాక్సైట్ దోచిపెట్టడానికి రస్‌ఆల్‌ఖైమాతో అక్రమ ఒప్పందం చేసుకున్నారు. అయితే గిరిజన హక్కులు, చట్టాలతో పాటు తమ అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి గిరిజనులు నిర్వహించిన పోరాటాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తలొగ్గింది. 'జి.ఓ నెం.97 రద్దుపై అంతర్జాతీయ న్యాయ స్థానంలో విచారణ కొనసాగుతోంది. బాక్సైట్ ఒప్పందం గిరిజన హక్కులు, చట్టాలకు విరుద్ధమ'ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే జి.ఓ నెం.97 రద్దు సందర్భంగా ప్రకటించారు. గిరిజన మనోభావాలను వైసిపి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. నేడు అదే ప్రభుత్వం 2022 డిసెంబర్ 13న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ కడప వారికి అప్పనంగా గిరిజన ప్రాంత సహజ సంపదను దోచిపెడుతున్నారు.
పాఠాలు నేర్వరా !
జోలాపుట్, మాచ్‌ఖండ్, సీలేరు తదితర ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు సుమారు 25 వేల మంది గిరిజనులు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయారు. మైదాన ప్రాంతాల్లో వలస కూలీలుగా మారిపోయారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని రావికమతం, వి.మాడుగుల, దేవరాపల్లి తదిరత నాన్‌షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాల్లో వలస వెళ్లారు. ఉద్యోగం కావాలని స్థానిక గిరిజనులు పోరాడుతున్నారు. పవర్ ప్రాజెక్టు పక్క గ్రామాలకు కూడా ప్రభుత్వం విద్యుత్ అందించలేదు. ఉపాధి కల్పన, అభివృద్ధి పేరుతో మోసపూరిత ప్రకటనలను ప్రభుత్వం మానుకోవాలి.
ప్రజా ఉద్యమంతోనే ...
గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలని ఇప్పటికే గిరిజన సంఘం ఉద్యమం నిర్వహిస్తున్నది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యమంలో కలిసి వస్తున్నాయి. గిరిజన ప్రయోజనాలు కాపాడడానికి, జీవన వైవిధ్య రక్షణకు, హక్కులు, చట్టాల పరిరక్షణకు విశాల ఐక్య ప్రజాఉద్యమమే శరణ్యం.
(వ్యాసకర్త : హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ కన్వీనర్, సెల్ : 9440896147)
బోనంగి చిన్నయ్య పడాల్