Sep 18,2022 08:22

రంగు రంగుల పూల గుత్తులు, ఆ గుత్తుల్లో చిన్ని చిన్ని పువ్వులు గుచ్ఛంగా అచ్చం పూలబొకేని మరిపిస్తాయి హైడ్రాంజియా మాక్రోఫిల్లా పూల మొక్కలు. జపాన్‌కు చెందిన ఈ మొక్క హైడ్రాంజియా కుటుంబంలో పుష్పించే జాతికి చెందినది. వేసవికాలం, శరదృతువులో ఈ పూలు నీలం, లేతగులాబి, తెలుపు, పసుపు, ఆకుపచ్చ మరెన్నో రంగుల్లో గుత్తులుగా విరబూసి మురిపిస్తాయి.

హైడ్రాంజియా మొక్క ఏడెనిమిది అడుగుల పొడవు పెరుగుతుంది. సాధారణంగా శీతల ప్రాంతాల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. గత దశాబ్ద కాలంగా మనదేశంలోనూ కడియం నర్సరీలో ఈ మొక్కలు దొరుకుతున్నాయి. బిగ్లీఫ్‌ హైడ్రాంజియా, ఫ్రెంచ్‌ హైడ్రాంజియా, లేస్‌క్యాప్‌ హైడ్రాంజియా, మోప్‌హెడ్‌ హైడ్రాంజియా, పెన్నీ మాక్‌ హార్టెన్సియాలు వీటిలో రకాలు. పూర్తిగా ఎండ తగలని, వెలుతురు బాగా ఉండే సెమీషేడ్‌ వాతావరణంలో ఇవి బాగా పెరుగుతాయి. నీరు అందేలా వనరు అందిస్తే సరిపోతుంది. ఇవి ప్రపంచంలో అనేక ప్రాంతాలలో విస్తతంగా సాగు చేయబడుతున్నాయి. దీని ఆకులు ఆరు అంగుళాల పొడవుండి, మద్ది చెట్టు ఆకులను పోలి ఉంటాయి. ఒక్కో పుష్పగుచ్చం వాతావరణం అనుకూలిస్తే మూడు, నాలుగు నెలల వరకు వాడిపోకుండా ఉంటుంది. చెట్టు నుంచి వేరుచేసిన తరువాత ఈ పూలు శీతల ప్రాంతాల్లో నాలుగైదు రోజుల వరకు పాడవవు. అందుకే ఎక్కువగా వీటిని అలంకరణలకు ఉపయోగిస్తారు.

టాల్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..



                                                                   టాల్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..

టాల్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా మొక్కలు 7 లేదా 8 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వీటిని ఇంటి ప్రహరీగోడల వద్ద, పార్కులలో, ల్యాండ్‌ స్కేపింగ్‌ మధ్యలో అలంకరణగా పెంచుతారు. నేల మీద ఒక పొదలా పెరిగి, ఆకులతో విచ్చుకుంటుంది. సీజన్‌ రాగానే పూలు గుత్తులు గుత్తులుగా వచ్చి, ఆకులను కప్పేస్తాయి. సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, తూనీగలు మకరందం కోసం నిత్యం ఈ పూలను ఆశ్రయిస్తాయి.

డ్వార్ఫ్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా..


                                                               డ్వార్ఫ్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా..

నేల మీదే కాకుండా కుండీల్లోనూ పెంచుకునే వెసులుబాటు ఉన్న పొట్టి రకం మొక్కలు హైడ్రాంజియా మాక్రోఫిల్లా. ఈ మొక్కలు ఒకటి నుండి రెండున్నర అడుగుల ఎత్తు పెరుగుతాయి. కొబ్బరి పొట్టులో (కోకోపిట్‌) లో బాగా పెరుగుతాయి. ప్రతిరోజూ నీటిని అందిస్తే సరిపోతుంది. వీటిలో చాలా రకాలు, రంగులు ఉన్నాయి. వీటిని ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. కాకపోతే బాగా వెలుతురు తగిలేలా చూడాలి. ఇవి వేడిని తట్టుకోలేవు. ఏసీ గదిలో, చల్లటి ప్రదేశాల్లో ప్రకాశవంతంగా ఉంటాయి.

 శ్వేత బంతులు..



                                                                             శ్వేత బంతులు..

తెల్లని పుష్పగుచ్ఛాలు పాలపొంగులా అబ్బుర పరుస్తుంటాయి ఈ శ్వేతబంతులు. ఆకుపచ్చని ల్యాండ్‌ స్కేపింగ్‌లో హైడ్రాంజియా మాక్రోఫిల్లా మొక్కలు, వాటి మధ్య ఈ శ్వేత బంతులను అలంకరిస్తే ఆ అందమే వేరు. హైడ్రాంజియా మాక్రోఫిల్లా జాతిలో ఈ శ్వేతబంతులను రాణి పువ్వుగా అభివర్ణిస్తారు.

 మల్టీకలర్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..



                                                                మల్టీకలర్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..

ఒక్క పూలగుత్తిలోనే రంగురంగుల పూలతో అలరించేదే మల్టీకలర్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా. ఈ రంగులు చిలకరించినట్లు, కుంచెతో పెయింట్‌ అద్దినట్ల్లు, అనేక రంగుల కలబోతతో పూల గుత్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

లేత రంగుల హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..


                                                               లేత రంగుల హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..

లేత రంగుల హైడ్రాంజియా మాక్రోఫిల్లా ఎంతో నాజుగ్గా, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తెలుపు, లేత పింకు, లేత వయోలెట్‌ రంగుల పూలతో మొక్కను చూడగానే హాయిగా అనిపిస్తుంది.

బ్లూ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..


                                                                      బ్లూ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..

బ్లూ హైడ్రాంజియా మాక్రోఫిల్లా అనేది హైడ్రాంజియా మాక్రోఫిల్లా జాతికి మాతకగా చెప్పవచ్చు. ఈ జాతి మొక్క ప్రాథమిక రంగు నీలంరంగే. పరిణామ క్రమంలో సాంకేతిక హంగులతో విభిన్న రంగుల్లో అలరిస్తున్నాయి. ఇప్పటికీ ముదురు, లేత నీలం రంగులతో ఈ పూల గుత్తులు ఉన్నచోట అవే ప్రత్యేక వాతావరణాన్ని సంతరించుకుంటాయి.

 పింక్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..


                                                                  పింక్‌ హైడ్రాంజియా మాక్రోఫిల్లా ..

ఈ రకం హైడ్రాంజియా మాక్రోఫిల్లా పెద్ద పెద్ద పూలగుత్తులతో ముదురు గులాబీ రంగులో ఉండి, చాలా అందంగా ఉంటాయి. ఎన్ని రకాల మొక్కలలో ఉన్నప్పటికీ వాటి రంగుతో రాజసం ఉట్టిపడేలా వాటి ప్రత్యేకతను సంతరించుకుంటాయి.


చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506