Nov 19,2022 08:17
  • తొలి ప్రయోగం విజయవంతం
  • పిపిపిలో కొత్త శకం : కేంద్ర మంత్రి

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో శుక్రవారం తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాకెట్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ అంతరిక్షరంగంలోని ప్రైవేటు నిర్వాహకులలో హర్షం వ్యక్తమైంది. ప్రయోగం అనంతరం కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ చేసిన ప్రకటన కూడా దీనికి కారణమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో రానున్న రోజుల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్ద పీట వేస్తామని ఆయన ప్రకటించారు. తాజా విజయంతో పిపిపి రంగంలో కొత్త శకం ప్రారంభమైందని అన్నారు. మంత్రి చేసిన ఈ ప్రకటనతో ఇస్రోలో ప్రైవేటు పాత్రపై చర్చ ప్రారంభమైంది. నిజానికి ఇస్రో సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే శుక్రవారం చేసిన ప్రయోగం చాలా చిన్నది. అయినా కేంద్ర ప్రభుత్వం దీనికి భారీ ప్రాధాన్యతనిచ్చింది. కేంద్ర మంత్రి స్వయంగా హాజరయ్యారు. ఇస్రో ఛైర్మన్‌తో పాటు, కీలక శాస్త్రవేత్తలు, అధికారులు తరలివచ్చారు. ప్రైవేటు రంగానికి సానుకూల సంకేతాలు ఇవ్వడానికే ఇంతమంది హాజరయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

నాలుగు నిమిషాల్లోనే...
తొలిసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటు భాగస్వామితో కలిసి పనిచేస్తుండటంతో మాస్టర్‌ కంట్రోల్‌ రూం శుక్రవారం కిటకిటలాడింది. ఇస్రో చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు కనిపించారు. స్టాపాన్‌ మోటర్లు లేకపోవడంతో చడీచప్పుడు లేకుండా మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సిగ్నిల్‌ రావడంతోనే మబ్బుల మాటున నింగిలోకి విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ దూసుకుపోయింది. నాలుగు నిమిషాల అనంతరం భూమికి 89.5 కిలోమీటర్లు ఎత్తులోకివెళ్లి 130 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయింది. కేవలం నాలుగు నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. ఈ సమయంలో వాతావరణ పరిస్థితులను రాకెట్‌ అధ్యయనం చేసినట్లు శాస్రవేత్తలు తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, అందుకే ఈ ప్రయోగానికి 'న్యూ ప్రారంభ్‌' అని పేరు పెట్టామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు స్కైరూట్‌ ఏరో స్పేస్‌ సంస్థ సింగిల్‌ స్టేజ్‌ సబ్‌- ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ గా ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇది మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రాకెట్‌ను రూపొందించినట్లు స్కైరూట్‌ ఏరో స్పేస్‌ చైర్మన్‌ పవన్‌ గోయాంక్‌ తెలిపారు. ఇస్రో, ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పాక్‌) సంస్దల నుంచి వచ్చిన సహకారంతోనే ఈ ప్రయోగం జరిగిందని చెప్పారు. ఈ ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌, స్పేస్‌ డైరెక్టర్‌ అజరు జ్వోతి, షార్‌ డైరెక్టర్‌ రాజారాజన్‌, ప్రయోగంలో కీలక వ్యక్తులు స్కైరూట్‌ డైరెక్టర్లు భరత్‌ కుమార్‌, పవన్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

                                                                     కేంద్ర మంత్రి ఏమన్నారు ?

సాంకేతిక రంగంలో వస్తోన్న మార్పులు, అవసరాల కోసం ప్రయివేటుసంస్దలతో కలిసి ఇస్రో రానున్న రోజుల్లో పనిచేయనుందని కేంద్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ ప్రకటించారు. 1967 నవంబర్‌ 21 షార్‌ నుంచి తొలి రాకెట్‌ను ఇస్రో ప్రయోగించిందని, ఇప్పుడు 2022 నవంబర్‌ 18న షార్‌ నుంచి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం చేశామని చెప్పారు. ప్రధాని మోదీ కల ఇదేనని, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. షార్‌ నుంచి ప్రైవేటు కంపెనీలు రాకెట్‌ ప్రయోగానికి అన్ని వసతులూ కల్పిస్తామని, ఉన్న వసతులు ఉపయోగించుకున్నా, కొత్తవి కావాలన్నా కేంద్ర ప్రభుత్వ సమకూర్చుతుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కొత్త శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో ఏరో స్పేస్‌ సంస్దలు 150 వరకు ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రయోగం చేయడానికి అన్ని సంస్థలూ దరఖాస్తు చేసుకున్నాయని, అందులో 15 సంస్థలు మాత్రమే ఎంఒయులు కుదుర్చుకున్నాయని తెలిపారు.అటామిక్‌ ఎనర్జీని కూడా ప్రైవేటీకరించనున్నట్లు చెప్పారు.

                                                                         ఇప్పుడే ఎందుకు ?

పతిష్టాత్మక సంస్థలను ఒకదాని తరువాత ఒకటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)పై కూడా కన్నేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రయోగాల కోసం నిధుల కోసం కేంద్రంవైపు చూసే స్థితి నుండి ఇటీవలే ఇస్రో స్వయం పోషకంగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనేక వాణిజ్య ప్రయోగాలకు షార్‌ వేదికగా మారుతోంది.అనేక దేశాలు ఇక్కడి నుండి ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి. విజయాల రేటు ఎక్కువగా ఉండటం దీనికి కారణం. ఒకప్పుడు ఏడాదికి ఒకటి, రెండు ప్రయోగాలు జరగడమే కష్టంగా ఉన్న పరిస్థితుల నుండి ఇప్పుడు నెలకు రెండు, మూడు రోజులు ప్రయోగాలు చేసే స్థితికి ఇస్రో చేరింది. ఇందుకోసం ప్రతినిత్యం 15 వేల మంది సిబ్బంది, సుమారు నాలుగు వేల మంది శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పనిచేస్తున్నారు.అంతరిక్షంలో కూడా లాభాలు పిండుకునే అవకాశం ఉండటంతో కార్పొరేట్‌ రంగం కొంత కాలంగా దీనిపై దృష్టి సారించింది. వారికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.