Oct 23,2022 09:04

జిహ్వకో రుచి...పుర్రెకోబుద్ధి అన్నారు. నాలుక ఎప్పుడూ రుచులను కోరుతూనే ఉంటుంది. మెదడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అయితే నిత్యం ఎన్ని రకాల రుచులు చవి చూసినా కాలానుగుణంగా వచ్చే పండుగలకు ప్రత్యేకమైన పిండి వంటలు చేసుకుంటేనే తృప్తి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు, పల్లె పచ్చదనాలు నిండుగా ఉండేవి. ప్రతి ఊరిలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కలసి పిండివంటలు వండుకునేవారు. ప్రస్తుతం పరిమిత కుటుంబాలు. పక్కవారితో గడిపే సమయం తక్కువ. దాంతో పండుగలకూ ఎవరికి వారే తక్కువ సమయంలో అయిపోయే వంటలు చేసుకోవటం పరిపాటి అయిపోయింది. మరి రేపటి దీపావళికి తియ్యతియ్యగా.. త్వరత్వరగా చేసుకునే కొత్త వంటలు తెలుసుకుందామా..!
మిల్క్‌ మైసూర్‌పాక్‌..

sweets


కావలసిన పదార్థాలు: స్వీట్‌ పాలపొడి-కప్పు, నెయ్యి-11/2 కప్పు, మైదా- 2 స్పూన్లు, పంచదార-4 కప్పులు, నీరు-కప్పు, నిమ్మరసం-1/4 చెక్క
తయారీ: పాలపొడి, మైదా, నెయ్యి బ్రెడ్‌పొడి మాదిరి కలిపి పక్కనుంచాలి. స్టౌపై బాండీ నుంచి పంచదార నీరు పోసి, తీగ పాకం రానిచ్చి నిమ్మరసం పిండాలి. ఒక ట్రేకి నెయ్యి రాసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పాలపొడి ఉండలు కట్టకుండా తిప్పుతూ పాకంలో పోయాలి. క్రీమ్‌లా వచ్చేవరకూ ఆపకుండా తిప్పుతూనే ఉండాలి. అలానే తిప్పుతూ మధ్యమధ్యలో నెయ్యి పోసుకోవాలి. దాదాపు 20 నిమిషాల తరువాత రంగు మారటం ప్రారంభిస్తుంది. నెమ్మదిగా లోపలి నుంచి నురగలా వస్తుంది. ఆ స్టేజ్‌లో పాకం ఉండకడుతుందేమో చూసుకోవాలి. ఉండకడితే మైసూర్‌ పాక్‌ రెడీ అయినట్లే. స్టౌ ఆఫ్‌చేసి మిగిలిన నెయ్యిని వేసి, ఐదు నిమిషాల పాటు స్టౌ మీదే ఉంచి, తిప్పాలి. తర్వాత ముందుగా నెయ్యిరాసి ఉంచుకున్న ట్రేలో పోసి, నాలుగు గంటలు కదపకుండా ఉంచాలి. ఆ తరువాత వేరే ప్లేటులోకి (ట్రేని బోర్లించి) మార్చుకుని, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
స్వీట్‌ సమోసా

sweets


కావలసిన పదార్థాలు: మైదా/గోధుమపిండి-200గ్రా, నెయ్యి-1/4 కప్పు, వంటసోడా-1/4 స్పూను, సోంపు-స్పూను, నూనె-డీప్‌ ఫ్రైకి సరిపడా.
స్టప్ఫింగ్‌కు: పచ్చికోవా- 100గ్రా., యాలకుల పొడి- స్పూను, టూటీ ఫ్రూటీ-2 స్పూన్లు, జీడిపప్పు పలుకులు-2 స్పూన్లు, ఎండు కొబ్బరిపొడి-స్పూను, బొంబాయి రవ్వ-స్పూను.
పాకం కోసం: పంచదార-2 కప్పులు, నీరు-150 మి.లీ., పటిక-1/2స్పూన్‌
తయారీ: ఒక బౌల్‌లో మైదా/గోధుమపిండి, వేడి నెయ్యి, వంటసోడా, సోంపు అన్నింటినీ తగినన్ని నీటితో ఐదు నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. తడిగుడ్డ కప్పి, అరగంట పక్కనుంచాలి.
ఈలోగా పచ్చికోవా (పంచదార కలపని), టూటీ ఫ్రూటీ, జీడిపప్పు పలుకులు, ఎండుకొబ్బరి పొడి, యాలుక పొడి, బొంబాయి రవ్వ కొంచెం నీటిని చిలకరించి, అన్నీ ముద్దగా కలుపుకొని, చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి.
స్టౌపై బాండీ ఉంచి పంచదార, నీరు కలిపి గులాబ్‌జామూన్‌ పాకం కంటే కొంచెం చిక్కనయ్యేలా పాకం పట్టి ఉంచుకోవాలి. (పంచదార కరిగి, పొంగు వచ్చే సమయంలో పటిక కలుపుకోవాలి.)
ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న మైదా ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, పొడి పిండి చల్లుతూ పొడవుగా పూరీ మందంలో ఒత్తుకోవాలి. వాటిని మధ్యకు కట్‌ చేసి రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఒక్కొక్క దానిని గరాటులా చేసుకుని, దానిలో కోవా గోళీని ఉంచి ఓపెన్‌గా ఉన్న అంచులకు తడిచేసి, ఎక్కడా లీకేజ్‌ లేకుండా అంచులన్నీ అంటుకునేలా ఒత్తుకుని సమోసాలను చేసుకోవాలి. స్టౌపై బాండీలో నూనెపోసి కాగిన తరువాత స్టౌ ఆఫ్‌ చేసి సమోసాలను వేయాలి. అవి నూనెలో మునిగి వాటంతటవే పైకి తేలాక స్టౌ ఆన్‌ చేయాలి. రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌ మీద వేపి, తర్వాత హైలో పెట్టి, బంగారు వర్ణం వచ్చేవరకూ వేపి తీసుకోవాలి. అంతే స్వీట్‌సమోసా రెడీ!
రసమలై..

sweets 3


కావలసిన పదార్థాలు: ఆవుపాలు-లీటరు., నీరు-3/4 కప్పు, వెనిగర్‌-1/2కప్పు, డ్రై ఫ్రూట్స్‌ పలుకులు-2 స్పూన్లు
పాకం కోసం: పంచదార-ఒకటిన్నర కప్పు, నీరు- ఒకటిన్నర కప్పు
ఫినిషింగ్‌ క్రీమీపాలకు: పాలు-1/2లీ., పంచదార-1/4 కప్పు
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో (తప్పనిసరిగా) ఆవుపాలు తీసుకొని స్టౌమీద పెట్టి మరిగించాలి. పొంగు రావడం ఆగిపోయి మరుగుతూ ఉన్నప్పుడే స్టౌ ఆఫ్‌ చేసి, పాలను గరిటెతో తిప్పుతూ నీరు, వెనిగర్‌ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కలపాలి. అలా కలిపేటప్పుడే పాలు విరిగి నీరు, పాలు వేరుపడతాయి. అలా విరిగిన పాలను పలుచని గుడ్డలో వడకట్టి మరీ గట్టిగా పిండకుండా ఆ విరుగును వేరే ప్లేటులోకి తీసుకోవాలి. దీన్ని మూడు నిమిషాలపాటు గట్టిగా నొక్కుతూ ముద్దగా చేయాలి. ఆ ముద్దను పెద్ద ఉసిరికాయ సైజులో ఉండలుగా చేసుకొని గారెలా తట్టుకొని, మలైలను చేసుకోవాలి.
అడుగు లోతు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని పంచదార, నీరు కలిపి స్టౌ మీద వేడి చేయాలి. పంచదార కరిగి, పొంగు వచ్చాక నెమ్మదిగా మలైలను దానిలో విడవాలి. మూతపెట్టి హై ఫ్లేమ్‌ మీద 15 నిమిషాలు కళపెళ ఉడికించాలి. ఆ తరువాత స్టౌ ఆఫ్‌ చేసి, మూత తీసి వెంటనే ఒక కప్పు చల్లని నీరు పోసి, గంటసేపు పాకంలో మలైలను ఊరనివ్వాలి.
గంట తరువాత గిన్నెలో పాలు, పంచదార తీసుకుని కలుపుతూ సగం అయ్యేవరకూ మరగనిచ్చి, యాలకులపొడి వేసుకోవాలి. పాకంలో ఉన్న మలైలను ఒక్కొక్కటి తీసుకొని, రెండు చేతుల మధ్యా ఉంచి, పాకం పిండి మరిగించిన పాలలో వేసి గంటసేపు నాననివ్వాలి. తరువాత డ్రైఫ్రూట్‌ పలుకులు చల్లితే రసమలైలు రెడీ!