
ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కోసం తప్ప, సంక్షేమ పథకాల అమలుకోసం బహిరంగ మార్కెట్‌లో అమ్మకం పథకం (ఒఎంఎస్‌ఎస్) కింద రాష్ట్రాలకు బియ్యం, గోధుమలు విక్రయించవద్దంటూ ఎఫ్‌సిఐని కేంద్రం ఆదేశించడం అమానుషం. ఆహార భద్రత కల్పించేందుకు, సామాన్యులకు ఆహార ధాన్యాలు అందుబాటు ధరల్లో ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ఆ బాధ్యత నెరవేర్చకుండా అడ్డుపడటం బాధ్యతారాహిత్యం. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సమయంలో కార్పొరేట్లకు లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం అయిష్టంగానే పేదలకు ఉచితంగా ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించింది. ప్రజలకు అంతకుముందున్న రేషన్ పథకాన్ని ఎత్తివేసింది. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా సరఫరా చేసేందుకు ఆహార ధాన్యాలను సేకరించి, నిలువ చేయడం, ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేయడం, రైతులకు సరైన మద్దతు ధర కల్పించడం ఎఫ్‌సిఐ బాధ్యత.
మోడీ ఏలుబడిలో ఏటా ఆకలి సూచీలో దిగువకు పడిపోతూనే ఉంది. గత ఏడాది మరీ ఘోరంగా 121 దేశాలున్న సూచీలో 107వ స్థానానికి దిగజారింది. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సైతం మనకంటే మెరుగ్గా ఉన్నాయంటే... మన పరిస్థితిని అంచనా వేయొచ్చు. తిండి గలిగితే కండగలదోరు.. కండ గలవాడే మనిషోరు... అన్న స్ఫూర్తితో పేదలందరికీ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకుని, దేశాభివృద్ధికి నడుంకట్టాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఆలోచించడం క్షంతవ్యం కాదు.
ప్రజలందరికీ ఆహారం అందుబాట్లో ఉంచడమా? ఇథనాల్ తయారు చేసి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నామని ప్రచారం చేసుకోవడమా? అన్న ప్రశ్న వస్తే ప్రజాస్వామ్య పాలకులెవరైనా పేదలకు ఆహారం అందుబాట్లో ఉంచేందుకే మొగ్గుచూపుతారు. కానీ మోడీ సర్కారు రెండో అంశంవైపే మొగ్గుచూపింది. 2013 ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో 81.3 కోట్ల మంది లబ్ధిదారుల కోసం ఆరుకోట్ల టన్నుల బియ్యం, గోధుమలను కేంద్రం పంపిణీ చేయాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ 1 నాటికి కేంద్రం వద్ద 41.4 మెట్రిక్ టన్నుల బియ్యం 31.4 మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలతో ఆహార సంక్షోభాన్ని రూపుమాపి, నిరుపేదలందరికీ ఆహార ధాన్యాలను అందించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా సమాఖ్య స్ఫూర్తినిసైతం తుంగలో తొక్కి రాష్ట్రప్రభుత్వాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయవద్దని ఎఫ్‌సిఐని ఆదేశించడం దారుణం.
పెట్రో ఉత్పత్తుల్లో 20 శాతం ఇథనాల్‌ను 2030 నాటికి కలపాలని మనదేశం లక్ష్యం కాగా, 2025-26 నాటికే ఆ లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2020-21లో 1.06 మెట్రిక్ టన్నులు, ఈ ఏడాది 1.5 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇథనాల్ ఉత్పత్తి కోసం కేటాయించింది. చెరకు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, బియ్యం నూకలు, గోధుమల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. పేదలకు అందించేందుకు రాష్ట్రాలకు క్వింటాకు రూ.3,400 చొప్పున, ఇథనాల్‌కు క్వింటా రూ.2000 చొప్పున ఆహార ధాన్యాలను గతంలో ఎఫ్‌సిఐ విక్రయించేది. ఈ ధరలో వ్యత్యాసమే కేంద్రం కార్పొరేట్ ప్రాధాన్యతను, సంపన్న దేశాల ఆదేశాలకు మడుగులొత్తుతున్న విధానాన్ని తెలుపుతోంది. తాజాగా, ఇథనాల్‌కే ఆహార ధాన్యాలు విక్రయించాలని ఆదేశించడం ఈ ప్రభుత్వానికి పరిశ్రమ, పారిశ్రామికాధిపతులు తప్ప ప్రజలు, వారి ఆకలి ఏమాత్రం పట్టడం లేదని తేటతెల్లం చేస్తోంది. రోజురోజుకూ మానవాభివృద్ధి సూచీల్లో వెనుకబడుతూ, ఆకలి సూచీలో ముందుకెళ్తున్న దుస్థితిలో సంక్షేమ పథకాలకు మోకాలడడ్డం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం అమ్మరాదని ఎఫ్‌సిఐని మోడీ ప్రభుత్వం ఆదేశించిన తీరు అత్యంత నిరంకుశమైనది, అప్రజాస్వామికమైనది. ఉపశమనం కలిగించేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బిజెపియేతర ప్రభుత్వాలను అడ్డుకోవడం క్షమార్హం కాదు. సమాఖ్య విధానాలకు తూట్లుపొడిచే చర్యలకు స్వస్తి పలకకపోతే ప్రజలే బుద్ధిచెబుతారు.