మనిషి-మనసు ఉన్నచోటనే వుండకుండా...ఉన్నత పథాన విహరించాలి. విహరించడమంటే మనసు వికసించడం. మన: పరిణితికి, వికాసానికి తద్విషయగత చింతనకు దోహదం చేసే శక్తి హాస్యానికి వుంది. దైనందిన జీవితంలో హాస్యం, వ్యంగ్యం...జీవితంలోని అనేక విషయాలను ఆహ్లాదకరంగా మార్చుతాయి. హాస్యరసం లేని జీవితం... నిస్సారం, నిర్జీవం. మనిషన్నాక జీవితంలో కాస్తంత హాస్య రసాస్వాదన వుండాలి. 'జనానికి గానమేనా వుండాలి, హాస్యమేనా వుండాలి... సార్వత్రికమైనవి మరి అట్టే లేవు' అంటాడు భమిడిపాటి. హాస్యం దివ్యౌషధం. ఇది మనసును ఆనందింపజేస్తుంది, ఉల్లాసపరుస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడటానికి, మనోవికాసానికి తోడ్పడుతుంది. మనోవికాసం వల్ల ఇరుకైన మనసు విశాలమైనదిగా కనిపిస్తుంది. మనిషి తన కార్యక్షేత్రంలో నిర్భయంగా సంచరించడానికి మానసికమైన సంసిద్ధతను మనోవికాసం ఏర్పరుస్తుంది. హాస్యం పనిలో ఒత్తిడిని తగ్గిస్తుంది... స్ఫూర్తిని పెంచుతుంది. 'కష్ట సమయంలోనే ఓర్పు, హాస్య దృష్టి పనికొస్తాయి' అంటాడు బుచ్చిబాబు.
స్వచ్ఛమైన హాస్యం అనగానే 'కన్యాశుల్కం' గుర్తొస్తుంది. పెదాలపై చిరునవ్వు మొగ్గలేస్తుంది. సంఘంలోని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడారు. ఈ నాటకంలోని పాత్రలు-గిరీశం అగ్నిహోత్రావధానిని 'అగ్గిరావుడ'ని, కరటక శాస్త్రి 'మూర్ఖపగాడ్దె కొడుక'ని, గిరీశాన్ని రామప్పంతులు 'గిర్రడు', 'బొట్లేరు' అని ఒకరికొకరు వ్యంగ్యంగా పేర్లు పెట్టుకొని హాస్యాన్ని పండిస్తారు. 'పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్', 'మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!' వంటి సంభాషణలు మనసారా నవ్వుకునేలా వుంటాయి. మునిమాణిక్యం 'కాంతాయమ్మ కైఫీయత్'లో ఓ గయ్యాళి మహిళ గురించి ఆయన రాసిన 'కాంతాయమ్మ కైఫీయత్ కథలు' ఎవరినైనా కడుపుబ్బ నవ్విస్తాయి. 'నవ్వులో, గొప్ప నవ్వులో వున్న ఔన్నత్యం దేంట్లో వుంటుంది? అందువల్లనే షేక్స్‌పియర్, కాళిదాసూ గొప్ప వేదాంతాన్ని విదూషకుల చేతా మాట్లాడిస్తారు. పి.జి.ఉడ్‌హౌస్ నవ్వులో, డిక్కెన్సు కారికేచర్స్‌లో, చార్లీచాప్లిన్ చిత్రాలలో ఎన్ని కన్నీళ్లు? ఎంత హాస్యం? ఎంత వేదాంతం? అంటాడు చలం తన మ్యూజింగ్స్‌లో. కానీ, ఇటీవల ప్రసారమౌతున్న కొన్ని సినిమాలు, టీవీ షోలు హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. శరీరం మీద, రంగు, ఎత్తు, ముఖ కవళికల మీద చెత్త జోకులు వేస్తున్నారు. మహిళలను కించబరిచే చౌకబారుతనం, ద్వంద్వార్థాల సంభాషణలు హాస్యం రూపంలో చెలామణీ అవుతోంది. 'సాధారణంగా హాస్యం నవ్వు పుట్టించలేనప్పుడు జుగుప్స కలిగించే ప్రమాదం వున్నది' అంటాడు కొడవటిగంటి. ఈ టీవీ షోలను చూస్తే హాస్యం కన్నా ఎక్కువగా జుగుప్సే కలుగుతుంది.
సాహిత్యంలో, సినిమాల్లో, సమాజంలోని హాస్య సంఘటనలు మనసారా నవ్వుకునేలా చేస్తాయి. ఇటీవల వచ్చే హాస్యం కులమతాలపైన, మహిళలపైన చౌకబారుగా వుండటంతో పాటు మనోభావాలను కించపరుస్తున్నారంటూ సాంస్కృతిక కాలుష్యాన్ని వెదజల్లుతోంది. కారణం ఏదైనా కావొచ్చు... మనిషిలో హాస్య స్ఫూర్తి కొరవడుతోంది. 'నన్ను జూచి వారు నవ్విన పక్షమున... వారిని జూచి నేను నవ్వెదను' అంటాడు చిలకమర్తి. సరదాగా జోక్ చేసినా స్వీకరించలేని ఒత్తిడిలోకి మనిషి నెట్టబడుతున్నాడు. ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంలో 'ప్రజా జీవితంలో హాస్యస్ఫూర్తి చచ్చిపోతోంది' అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే వ్యాఖ్యానించారు. ఉరుకుల పరుగుల జీవితంలో హాయిగా నవ్వుకునే సందర్భాలు తక్కువైపోతున్నాయి. 'మలయపవన మోహన వీచికల వెదకితి నెన్నాళ్ళు/ మందార గంధాల మందహాసము కొరకు' అని ఓ కవయిత్రి అంటే, 'పది నిమిషాలు హాయిగా గట్టిగా నవ్వితే, అది ఎలాంటి నొప్పులు, బాధలు లేని రెండుగంటల గాఢనిద్రతో సమానం' అంటారు ప్రొఫెసర్ నార్మన్ కజిన్స్. జీవితంలో హాస్యానికి పెద్ద పాత్రే వుంది. 'హాస్య స్ఫూర్తి లేని వ్యక్తి జీవితంలో ఎందుకూ కొరగాడ'ని రచయిత ముళ్ళపూడి అంటారు. నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం. అందుకే నవ్వేసెరు హాయిగా...మనసు తేలికపడుతుంది. మెదడు ఆలోచించగలుగుతుంది.