Nov 09,2023 10:26

'టెన్నిస్‌ ఆటపట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్య కాలంలో నేను సంతోషంగా లేను. ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి. ఇది రాజకీయ సందేశం కాదు. ఇది మానవత్వం. నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను. కొంతకాలంగా మీడియాలో కనబడుతున్న అతి భయానక గాజా యుద్ధ దృశ్యాలు నాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ రోజూ పిల్లలు చనిపోతున్నారు. లోకం చూడని పసివారు అమ్మ కడుపులో ఉండగానే అశువులు బాస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. కుప్పలు కుప్పలుగా మృతదేహాలు.. అందులో పిల్లలే ఎక్కువ.. గాయాలతో నెత్తురోడిన బిడ్డలను పొత్తిళ్లల్లో పెట్టుకుని పరుగెడుతున్న అమ్మలు, నాన్నలు.. శిథిలాల కింద శిథిలమైన తమ వారిని వెతుక్కుంటున్న ఆప్తులు.. ఆకలి కేకలు.. ప్రతి రోజూ ఈ దృశ్యాలు చూస్తున్న నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఆ బాధ నన్ను మరింత కుంగదీస్తోంది' అంటూ కన్నీరు పెట్టింది ట్యునీషియాకు చెందిన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆన్స్‌ జబీర్‌.

ట్యునిసియా టెన్నిస్‌ క్రీడాకారిణి ఆన్స్‌ జబీర్‌ పేరు తెలియని క్రీడాభిమానులు ఉండరు. ఇటీవల మెక్సికోలోని కాంకున్‌లో జరిగిన ఉమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(డబ్ల్యుటిఎ) ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంపై స్పందించారు. ఆ సమయంలో ఆమె కళ్ల నుండి అదేపనిగా కన్నీరు కారుతూనే ఉంది. మానవత్వం నిండిన మనుషులెవరినైనా ఆ భయానక యుద్ధ దృశ్యాలు అంతలా కదిలిస్తాయి మరి. అయితే ఆన్స్‌ అంతకు మించిన మానవత్వ హృదయంతో స్పందించారు. ఈ పోటీలో తనకు వచ్చిన బహుమతి సొమ్ములో కొంతభాగాన్ని పాలస్తీనా పౌరుల సహాయార్థం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
       'ఈ సాయం అక్కడి పౌరులకు ఏమాత్రం ఊరటనివ్వదని నాకు తెలుసు. అయినా నేను వారిని అలా చూస్తూ ఉండలేకపోతున్నాను. అక్కడ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు నన్ను సంతోషంగా ఉండనీయడం లేదు' అంటూ ఆమె చెబుతున్నప్పుడు కన్నీటితో గొంతు పెగల్లేదు. కెమెరా నుండి దూరంగా వెళ్లిపోయింది. ధారాళంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. గాజా యుద్ధ పరిస్థితిపై తమ అభిమాన క్రీడాకారిణి మాట్లాడినందుకు మెక్సికన్‌ నగర ప్రజలంతా ఆమెను వేన్నోళ్ల కొనియాడారు. ఆ క్రీడాప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది. 'ఇది నాకు చాలా కష్టంగా ఉంది. నా గుండె ముక్కలైంది. అందుకే నా ప్రైజ్‌ మనీలో కొంతభాగం వారికి ఇవ్వాలనుకుంటున్నాను' అని ప్రకటించగానే ప్రపంచ క్రీడాభిమానులు క్రీడాస్ఫూర్తికి మించిన ఆమె మానవత్వాన్ని మనసారా అభినందించారు.
        1994లో టునిసియాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో ఆన్స్‌ జబీర్‌ పుట్టారు. అమ్మ కల నెరవేర్చేందుకు మూడేళ్ల ప్రాయం నుండే టెన్నిస్‌ బ్యాట్‌ను చేతబట్టిన ఆన్స్‌ 2021 నాటికి ప్రపంచ టెన్నిస్‌ క్రీడాకారుల్లో మొదటి పదిమందిలో స్థానం సంపాదించారు. అంతేకాదు, అరబ్‌దేశం నుండి ఎంపికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు.
         టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టింది మొదలు ఆమె పేరుతో రికార్డుల వర్షమే కురిసింది. ఆ విజయాలకు గుర్తింపుగా, క్రీడారంగంలో ప్రపంచదేశాల సరసన టునిసియా పేరు నిలబెట్టినందుకు ఆ దేశం ఆమెను సముచితంగా గౌరవించింది. ఒకచేత్తో పిడికిలి, మరోచేత్తో టునిసియా దేశ పతాకను చేబూనిన ఆమె చిత్రపటంతో స్టాంపు ముద్రించింది. టునిసియా ప్రజలకే కాదు, మధ్య ప్రాచ్యం, అరబ్‌ దేశాలు, ఉత్తర ఆఫ్రికా మహిళలకు, పిల్లలకు ఆమె ఒక హీరో. ఆటలో ఆమె గెలిచినా, ఓడినా ఆ ప్రజలు ఆమెపై అమిత ప్రేమను కురిపించేవారు. ప్రపంచం మెచ్చే క్రీడాకారిణిగా, గొప్ప హృదయం గల వ్యక్తిగా ఆమె కీర్తిని తమ మనవళ్లకు, మనవరాళ్లకు చెప్పాలని ఆమె ఆటలాడే క్రీడామైదానాలలో నానమ్మలు, అమ్మమ్మలు బారులు తీరి ఉంటారు. అంతేకాదు.. 'ఆన్స్‌.. నిన్ను చూసే ఆటపై మొగ్గుచూపుతున్నాను. నువ్వు నాలో గొప్ప స్ఫూర్తిని నింపావు' అంటూ అభిమానులు, యువ క్రీడాకారులు ఆమెను కొనియాడుతూ ప్లకార్డులు చేబూనిన దృశ్యాలు ఆ క్రీడామైదానాల్లో కనిపిస్తాయి.

011


         విశేషప్రజాదరణ పొందిన క్రీడాకారులు ఆటలో రాణిస్తూ సంఘర్షణలపై స్పందించడం చాలా అరుదు. కానీ ఆన్స్‌ అలా కాదు.. తన చుట్టూ నెలకొన్న పరిస్థితులపై స్పందించకుండా ఉండలేరు. గాజాపై ఇజ్రాయిల్‌ మారణహోమం తలపెట్టిన నాటి నుండి అక్కడి పరిస్థితులను గమనిస్తూ వస్తున్న ఆమె, అనేకసార్లు సోషల్‌ మీడియా వేదికగా గాజా పౌరులకు సంఘీభావంగా నిలబడ్డారు.
          '75 ఏళ్లుగా పాలస్తీనియన్లు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అక్కడి అమాయక పౌరులు పడుతున్న బాధలు ఎంతో వ్యధాభరితం. వారి మతం ఏదైనా, వారి మూలాలు ఏమైనా హింస ఎప్పటికీ శాంతిని కలిగించదు. నేను హింసతో నిలబడలేను. అలాగే వారి భూములు లాక్కున్న వ్యక్తులతోనూ తలపడలేను. కానీ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని స్పందించగలను. అక్కడ ఏం జరుగుతుంతో తెలుసుకోకుండా ఉండలేక పోతున్నాను. చరిత్రను విస్మరించడం బాధ్యతారాహిత్యం. అది శాంతినీ తీసుకురాలేదు. శాంతి ప్రతి ఒక్కరికి అవసరం. అందుకోసం హింసను ఆపాలి. పాలస్తీనాను విడిచిపెట్టాలి' అని గాజా పౌరులకు మద్దతుగా ఇటీవల తన ఇన్‌స్టాలో ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్టు ఆమెలోని క్రీడా స్ఫూర్తికి మించిన గొప్ప మానవతా హృదయానికి ప్రతీకగా నిలుస్తోంది.