
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్టే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)ను కూడా నిర్వీర్యం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగిపోతుండడానికి ఇదొక ముఖ్య కారణం. 2021-22లో మొదటి పది మాసాల్లో మానవ హక్కుల ఉల్లంఘన కేసులు 37 శాతం పెరిగాయంటూ తాజాగా వెలుగు చూసిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు హక్కుల ఉల్లంఘనలు పెద్దయెత్తున పెరుగుతుంటే, మరో వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సిఫారసు చేసే పరిహార మొత్తాన్ని భారీగా తగ్గించడం మరీ దారుణం. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాల్లోను బిజెపి పాలిత ప్రభుత్వాలు హిందూత్వ సిద్ధాంతంలో భాగమైన మెజారిటేరియన్ వాదాన్ని ముందుకు తెచ్చి తమ అకృత్యాలను సమర్థించుకోజూస్తున్నాయి. మతం, భాష, జాతుల పరంగా ఉన్న మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా దాడులు చేస్తున్నాయి. యుఎపిఎ, దేశ ద్రోహం వంటి క్రూరమైన చట్టాలను వీరిపై ప్రయోగిస్తున్నాయి. ఈ దాడుల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపులో సంకుచితంగా వ్యవహరించడం ఎన్‌హెచ్‌ఆర్‌సికి తగని పని. మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే చోటుచేసుకుంటున్నాయని హౌం మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. మానవ హక్కులకు సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్‌సి యేటా విడుదలజేసే వార్షిక నివేదికను 2019 నుంచి ప్రచురించకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపేసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తే, గత రెండు సంవత్సరాలకు సంబంధించి కొన్ని పొడి పొడి అంకెలను ఇచ్చింది. పార్లమెంటుకు జవాబుదారీ వహించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సిని తన జేబు సంస్థగా మార్చేసింది. మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌గా ఉన్న పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంతో మిలాఖత్ కావడం ఈ దుస్థితికి మరో ముఖ్య కారణం. దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను కాపాడేందుకు 28 ఏళ్ల క్రితం పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన ఎన్‌హెచ్‌ఆర్‌సి మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దానిపై వెంటనే కదలాలి. జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌హెచ్‌ఆర్‌సి దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేసి, కాశ్మీరీయుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి, రాజకీయ నాయకులను నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచి, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సదుపాయాలను స్తంభింపజేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలను ఐరాస మానవ హక్కుల సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు సంస్థలు తీవ్రంగా విమర్శించినా, జాతీయ మానవ హక్కుల సంఘంలో కొంచెం కూడా చలనం లేదు. ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఈ ప్రభుత్వాన్ని గుడ్డిగా వెనకేసుకొచ్చారు. భారత దేశంలో మానవ హక్కుల గురించి బయటి సంస్థలు ఇటువంటి ఆరోపణలు చేయడం మామూలేనని మిశ్రా చెప్పడం ఆయన దివాళాకోరుతనాన్ని తెలియజేస్తుంది. ఆయన దృష్టిలో ఐరాస మానవ హక్కుల సంస్థ కూడా బయటి సంస్థేనన్న మాట. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండగా అన్ని నైతిక ప్రమాణాలను తుంగలో తొక్కి మోడీని బాహాటంగా కీర్తించిన పెద్దమనిషి ఈయన. ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్మన్ అయిన తరువాత ఆ సంస్థ పరువును, స్వతంత్ర ప్రతిపత్తిని గంగలో కలిపి అమిత్‌షా భజనలో తరించారు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కృషి వల్లే జమ్ము కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో శాంతి కొత్త శకం మొదలైందన్నారు. అటువంటి వ్యక్తి ఎన్‌హెచ్‌ఆర్‌సికి అధిపతిగా ఉంటే మానవ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి? మూక దాడులు, బుల్డోజర్ దాడులతో సంఫ్‌ుపరివార్ మూకలు చెలరేగిపోతుంటే, ఎన్‌హెచ్‌ఆర్‌సి నేరపూరిత మౌనం వహిస్తున్నది. గుజరాత్ మారణకాండలో బాధితులకు న్యాయం చేకూర్చేందుకు సుదీర్ఘంగా పోరాడిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేస్తే ఇది అన్యాయమని ప్రపంచమంతా ఘోషించినా ఎన్‌హెచ్‌ఆర్‌సి అస్సలు పట్టించుకోలేదు. జర్నలిస్టు జుబేర్ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ తో సహా పలు పాత్రికేయ సంఘాలు, మేధావులు, న్యాయవాదులు ముక్త కంఠంతో ఖండించినా అది ఇప్పటివరకు నోరు మెదపలేదు. మానవ హక్కుల సంఘం నిష్క్రియాపరత్వం దేశ ప్రజల హక్కులకు భంగకరం.