Nov 01,2022 19:35

బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన దుర్ఘటనలో మానవ తప్పిదాలే ప్రధాన కారణంగా కన్పిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని ప్రమాదకరంగా ఊపడమూ ఆ విషాదానికి ఓ కారణమైంది. ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. కర్ణాటకలో కొందరు టూరిస్టులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీగల వంతెనపైకి ఏకంగా కారును ఎక్కించి నడిపేందుకు ప్రయత్నించారు.
ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర తీగల వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్‌ బ్రిడ్జిపైకి కారును తీసుకొచ్చారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో టూరిస్టులు కారును వెనక్కి తీసుకెళ్లారు. కారును తోసుకుంటూ వెళ్తున్న దఅశ్యాలు ప్రస్తుతం స్థానిక వార్తా ఛానళ్లలో వైరల్‌ అయ్యాయి. కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కన్పించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.