క్విటో : ఈక్వెడార్‌లోని మనుషుల్లో మొదటి ఏవియన్ ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా ఎ-హెచ్ 5) కేసు నమోదైంది. తొమ్మిదేళ్ల బాలికలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌పి) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైరస్ వాహకాలుగా ఉన్న పక్షుల కారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెంది ఉండవచ్చని పేర్కొంది. ఈక్వెడార్‌లోని బలివర్ ప్రావిన్స్‌లో గుర్తించబడిన ఈ కేసు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ (ఇన్‌స్పి ) ప్రయోగశాలలో నిర్థారణైందని ఎంఎస్‌పి నివేదించింది. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు ఉన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు చేతులు శుభ్రంగా కడగడం, మాస్కులు వినియోగించడం, వ్యాక్సినేషన్ వంటి చర్యలు చేపట్టాలని అన్నారు. గత డిసెంబర్‌లో ఏవియన్ ఫ్లూపై హెచ్చరికను జారీ చేసింది. గత డిసెంబర్ వరకు ఈక్వెడార్‌లో 3,00,000 కంటే ఎక్కువ పక్షులు ఈ వ్యాధి బారిన పడినట్లు అంచనా.










