
భారీ బరువుల్ని సామూహికంగా ఎత్తేటపుడు, రోడ్ రోలర్ వంటివి లాగేటపుడు, పడవల్ని తెడ్డుతో నడిపేటపుడు అంత కష్టాన్ని అధిగమించడం కోసం 'లాగర లాగర హైలెస్సా..' అని పాడుతుంటారు. కాని, ఆటోమొబైల్ వాహనదారులు బండిలాగేదెలా అనుకునేలా రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక రవాణా పన్ను పెంపుదలను ప్రతిపాదించడం దారుణం. ఇప్పటికే గ్రీన్ ట్యాక్స్‌ను భారీగా బాది, డీజిల్ పెట్రోల్‌పై హెచ్చు వ్యాట్ విధిస్తున్న ప్రభుత్వం రవాణా పన్ను పెంచడం తగదు. పలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రవాణా రంగానికిది మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వుంది. భారీగా పెంచిన గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించాలని ఒక వైపున డిమాండ్ చేస్తుంటే, త్రైమాసిక రోడ్‌ట్యాక్స్‌ను సగటున 30శాతంపైగా పెంచడం పట్ల లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా పన్ను పెంపుదల ప్రభావం కొద్ది మంది మీద లేదా ఒకటి రెండు రంగాలపై మాత్రమేగాక పలు విధాలుగా గొలుసుకట్టు ప్రభావం చూపుతుంది. సరుకులు, రవాణా సేవల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. దాంతో ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. కనుక ఈ పన్ను పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అవశ్యం.
ఆంధ్ర ప్రదేశ్‌లో వసూలు చేస్తున్న రవాణా పన్నులు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే చాలా ఎక్కువని వాహన యజమానులు వాపోతున్నారు. కోవిడ్ సమయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా త్రైమాసికాల్లో పన్ను రద్దు చేయగా ఇక్కడ మాత్రం గోళ్లూడగొట్టి వసూలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కొన్నిటికి 200 రూపాయలు వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ ఇక్కడ 20 వేలుగా ఉందంటే అంతరం ఎన్ని రెట్లు? ఎ.పి లో వ్యాట్ అధికంగా ఉండడంవల్ల డీజిల్, పెట్రోల్ ధరల్లో సరిహద్దు రాష్ట్రాలతో పోల్చితే తీవ్ర వ్యత్యాసం నెలకొంది. ఇలా ఎటు చూసినా దేశమంతా ఒకే మార్కెట్‌గా రూపొందుతున్న ఈ రోజుల్లో రాష్ట్ర రవాణా రంగం ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్న దుస్థితి నెలకొంది. ఒకప్పుడు దక్షిణాది రోడ్డు రవాణాలో ఆంధ్రా వ్యాపారం దేదీప్యమానంగా వెలుగొందింది. కాని, ఇప్పుడు పూలమ్మిన చోట కట్టెలమ్ముకునేలా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా రంగం కుదేలవ్వడం మూలంగా విజయవాడ ఆటోనగర్ వంటివి కళావిహీనమయ్యాయి. మరోవైపున రోడ్ల మరమ్మతులు లేనందున వాహనాలకు మెయింటెనెన్స్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర రవాణా రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అందులో అసంఘటిత కార్మికులు, స్వయం ఉపాధి పొందేవారూ అధికం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే భవన నిర్మాణ రంగం ఇప్పటికే తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. ఇటువంటి వారంతా ఇక్కట్లు పడుతుంటే ఇంకెక్కడి రాష్ట్రాభివృద్ధి? ఒకవైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలకున్న ఉపాధి కూడా పోతే రాష్ట్రం ఏమవుతుంది ?
పన్నులు పెంచకుండా ఖజానాకు ఆదాయం రాబట్టడమెలా? ఉద్యోగుల జీత భత్యాల మొదలు సంక్షేమ పథకాల అమలు చేసేదెలా అని కొందరు ప్రశ్నించవచ్చు. అది కూడా చూస్తే రవాణా రంగంలో సర్కారు ఆదాయం ఏమీ తక్కువగా లేదు. వాహనాలకు జీవిత పన్ను, త్రైమాసిక పన్నుల పేరిట ఏడాదికి దాదాపు ఐదు వేల కోట్లు సమకూరుతోంది. కేవలం పన్నులేగాక రవాణా శాఖ ఫైన్లు కూడా దండిగానే వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఫైన్ల ద్వారా రూ. 262.90 కోట్లు లక్ష్యానికిగానూ రూ.272.83 కోట్లు వసూలు చేసినట్టు ఇటీవల జరిపిన ఆ శాఖాసమీక్షలో వెల్లడైంది (ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, మినీ ట్రాన్స్‌పోర్టు వారిపై పోలీసు శాఖ వేసే ఫైన్లు ఇందులోకి రావు). రైతు పండించిన పంటలు, పండ్లు, కూరగాయల మొదలు రాష్ట్రం ముందు పీఠినవున్న మత్స్య ఉత్పత్తుల వరకు అన్నిటికీ మార్కెట్ కల్పనలో రోడ్డు రవాణా రంగం పాత్ర కీలకమన్న విషయం మరువరాదు. బహుముఖంగా ప్రభావితం చేసే ఈ రంగంపై అదనపు పన్నులు వేయడం తగదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి, ఉపసంహరించుకోవడం విజ్ఞతగా ఉంటుంది.