- సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలోని శంషాబాద్‌లో వెలుగులోకి వచ్చిన అప్సర దారుణ హత్యపై దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయటపడుతున్నాయి. 'హత్య చేయడం ఎలా?' అని ఇంటర్నెట్‌లో సోధించి మరీ పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని కోరిన అప్సరను అంతం చేసేందుకు అతడు పక్కా ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. అప్సరతో వివాహేతర సంబంధం కొనసాగించిన సాయికృష్ణకు అమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ఆమె న్యాయం కోసం పోరాడుతానని హెచ్చరించడంతో ఎట్లాగైనా ఆమెను హతమార్చాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం...''గతేడాది ఏప్రిల్ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సర మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోమని అప్సర కోరింది. తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బెదిరించింది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలనుకొని హత్య చేశాడు' అని పోలీసులు తెలిపారు. హత్యకు వారం రోజుల ముందు 'మనిషిని చంపడం ఎలా?' అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్‌లో శోధించినట్లు పోలీసులు గుర్తించారు. 'జూన్ 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకొని సరూర్‌నగర్ నుంచి బయల్దేరాడు. రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని చెప్పి.. అక్కడి నుంచి గోశాలకి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఇద్దరూ సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేశాడు' అని పోలీసులు పేర్కొన్నారు.