Jun 07,2022 06:40

వర్తమాన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న తీరు ఏ విధంగా ఉందంటే, అమెరికాలో స్పెక్యులేషన్‌కు పాల్పడే కొద్దిమంది కార్పొరేట్ల ప్రవర్తన కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచవలసి వస్తోంది. ఈ నిరుద్యోగం పెరుగుదల కేవలం అమెరికాకే పరిమితం కాదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటిలోనూ కలుగుతుంది. ఇదే ప్రస్తుత సమస్య లోని ప్రధానాంశం.

ప్రస్తుతం చెలరేగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి పెట్టుబడిదారీ దేశాలన్నీ వడ్డీ రేట్లను ఇప్పటికే పెంచివేశాయి, లేదా త్వరలో పెంచడానికి సిద్ధమౌతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి దెబ్బ నుండి కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వడ్డీ రేట్ల పెంపు ఫలితంగా మళ్ళీ మాంద్యం లోకి దిగజారిపోవడం, నిరుద్యోగం మరింత ఎక్కువగా పెరిగిపోవడం ఖాయం.
     బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు విషయంలో తక్కిన అన్ని దేశాల కేంద్ర బ్యాంకులకూ ఒక ప్రమాణాన్ని నెలకొల్పేది అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బోర్డ్‌. ఈ అమెరికన్‌ రిజర్వు బ్యాంకు మాత్రం వడ్డీ రేట్ల పెంపు వలన వాస్తవ ఆర్థిక వ్యవస్థమీద ఎటువంటి ప్రతికూల ప్రభావమూ ఉండదని వాదిస్తోంది. ఒకవేళ ఏదైనా ఉన్నా అది తాత్కాలికంగా మాత్రమే ఉండబోతుందని అంటోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం ఎటువంటి అవరోధాలూ లేకుండా కొనసాగుతుందని చెప్తోంది. ఈ వాదనను సమర్థించుకోడానికి అది చెప్పే వివరణ వెనక తర్కం మౌలికంగానే తప్పు. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేస్తున్న వాదన ఈ విధంగా ఉంది:
       అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వాదన ప్రకారం ప్రస్తుతం తలెత్తిన ద్రవ్యోల్బణానికి మూల కారణం వేతనాలు పెరిగిపోవడం. ధరలు ఎటూ పెరుగుతూనే వుంటాయి అన్న అంచనాతో ప్రజలు ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతోంది. వడ్డీ రేట్లు పెంచగానే ఇక ధరలు తగ్గుతాయన్న అంచనాకి ప్రజలు వస్తారు (వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రజలు ఖర్చు చేయడానికి వెనకాడతారు. అప్పుడు మార్కెట్‌ లోకి వచ్చే డబ్బు పరిమాణం తగ్గుతుంది. అయితే, మార్కెట్‌ లోకి వచ్చే సరుకుల పరిమాణం తగ్గదు. అందువలన ధరలు తగ్గుతాయి). ద్రవ్యోల్బణం అదుపులోకి రాబోతోందనగానే వేతనాల పెరుగుదల కోసం తాపత్రయం తగ్గుతుంది. దాని ఫలితంగా ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గుతుంది. మొత్తం జరిగే సర్దుబాట్లన్నీ ధరలు పెరుగుతాయన్న అంచనా చుట్టూ తిరుగుతాయి గనుక వాస్తవ ఆర్థిక వ్యవస్థ మీద, అందులో జరిగే ఉత్పత్తి మీద, ఉపాధి మీద దాని ప్రభావం ఏమీ ఉండదు. ఇదీ అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ వాదన. అయితే, ఈ మొత్తం వాదన అంతా శుద్ధ తప్పు. కార్మికుల వేతనాల పెరుగుదల ఎప్పుడూ ధరల పెరుగుదల కన్నా వెనకబడే ఉంటుంది. దాని ఫలితంగా వాళ్ళ నిజవేతనాల స్థాయి పడిపోతూ వుంటుంది. కాబట్టి వేతనాలు పెరిగిపోయినందు వలన ద్రవ్యోల్బణం వస్తోందన్న వాదన పూర్తిగా తప్పు.
    ప్రస్తుత ద్రవ్యోల్బణానికి ఇంకొక కారణంగా ఎక్కువమంది చూపిస్తున్నది రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం. ఈ యుద్ధం వలన అనేక సరుకులకు (ముఖ్యంగా చమురు, ఆహార ధాన్యాలకు) ప్రపంచ మార్కెట్‌లో కొరత ఏర్పడిందని, అందువల్లనే ధరలు పెరిగిపోతున్నాయని వారంటున్నారు. ఈ వివరణను కూడా మనం అంగీకరించలేం. యుద్ధం వలన కొరత ఏర్పడవచ్చు. కాని ఇంతవరకూ అటువంటి కొరత ఏదీ ఏర్పడలేదు. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌ లో సరుకుల సరఫరా దెబ్బ తిన్న సూచనలు ఏవీ కనిపించడం లేదు. కాబట్టి ఆ యుద్ధాన్ని సాకుగా చూపించడం తప్పు. అమెరికాలో ద్రవ్యోల్బణానికైతే ఈ సాకు అస్సలు వర్తించదు.
      అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం అక్కడ ధరలు వేతనాల కన్నా వేగంగా పెరిగిపోతున్నాయి. లాభాల మార్జిన్‌ లను పెంచుకోడానికి అక్కడ కార్పొరేట్లు తమకు నచ్చి విధంగా ధరలను పెంచుతున్నారు. మామూలుగా అయితే ఏవైనా సరుకులకు కొరత ఏర్పడితే వాటి ధరలు పెరుగుతాయి. కాని ఇప్పుడు ధరలు పెరుగుతున్న సరుకులకు మార్కెట్‌లో ఏ విధమైన కొరతా లేదు. ఒకవేళ కరోనా మహమ్మారి కారణంగా ఉత్పత్తిలో ఏర్పడిన ఆటంకాల వలన సరుకుల సరఫరాకు ఇబ్బందులు తాత్కాలికంగా కలిగినా, ఆ తాత్కాలిక ఆటంకాలతో ఏ మాత్రమూ సంబంధం లేని విధంగా ఆ సరుకుల ధరలు పెరిగిపోతూ వుండడం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. లాభాల మార్జిన్లను పెంచుకోవడం కోసం ధరలను ఈ విధంగా పెంచడం స్పెక్యులేటివ్‌ స్వభావాన్ని సూచిస్తోంది.
    ఇటువంటి స్పెక్యులేటివ్‌ ధోరణులు కేవలం స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారులకో, మధ్య దళారీలకో మాత్రమే ఉంటాయని కొందరు అనుకుంటారు. ఉత్పత్తిదారులలో ఇటువంటి ధోరణులు ఉండవని వారు భావిస్తారు. కాని ఆ విధంగా అనుకోడానికి ఆధారమేమీ లేదు. బహుళజాతి కార్పొరేషన్లు తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడంలో కూడా స్పెక్యులేటివ్‌ ధోరణులు ఉంటాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణం అ విధంగా స్పెక్యులేషన్‌ ధోరణుల కారణంగా ఏర్పడింది. ప్రపంచం లోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న అమెరికాలో అసాధారణ రీతిలో మార్కెట్‌ లో రుణాలు అతి చౌకగా లభించడం దీనికి కారణం. అమెరికా అనుసరించిన ద్రవ్య విధానంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ద్వారా మార్కెట్‌ లోకి డబ్బును ఎక్కువగా పంపించడం, అందుకోసం వడ్డీ రేట్లను సున్నా వద్ద, లేకపోతే దాదాపు సున్నా వద్ద కట్టడి చేయడం ఒక ముఖ్యాంశం. సరుకుల ఉత్పత్తిలో వృద్థి లేకుండానే మార్కెట్లో డబ్బు పెరిగిపోవడంతో కార్పొరేట్లు తమ ఉత్పత్తుల రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. అది ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం దానిని అదుపు చేయడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి: ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించి పొదుపు పాటించడం. రెండవది: వడ్డీ రేట్లు పెంచడం. అయితే, ఈ రెండు చర్యలూ ఆర్థిక మాంద్యానికి, నిరుద్యోగం పెరగడానికి దారితీస్తాయి.
     వర్తమాన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న తీరు ఏ విధంగా ఉందంటే, అమెరికాలో స్పెక్యులేషన్‌కు పాల్పడే కొద్దిమంది కార్పొరేట్ల ప్రవర్తన కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పెంచవలసి వస్తోంది. ఈ నిరుద్యోగం పెరుగుదల కేవలం అమెరికాకే పరిమితం కాదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటిలోనూ కలుగుతుంది. ఇదే ప్రస్తుత సమస్య లోని ప్రధానాంశం.
      ప్రపంచం మొత్తం మీద నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడి, అందునా, ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి ఇప్పుడు దేశాల సరిహద్దులను దాటి విచ్చలవిడిగా అటూ ఇటూ పరుగులు తీస్తోంది. అందుకే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వడ్డీ రేట్లను పెంచడం మొదలెట్టారు. అలా చేయకుంటే, ఆ దేశాలనుండి పెట్టుబడి ఎక్కువ వడ్డీ లభించే దేశాలకు - ముఖ్యంగా అమెరికాకు- తరలిపోతుంది. అప్పుడు ఆ దేశాల కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే తగ్గుతుంది. అప్పుడు ఆ దేశం ఆర్థికంగా చాలా చిక్కులలో పడిపోతుంది.
     ద్రవ్యోల్బణానికి మూల కారణమైన అమెరికన్‌ కార్పొరేట్ల స్పెక్యులేటివ్‌ ప్రవర్తనను వేరే పద్ధతుల్లో అదుపు చేయడం బదులు, ప్రపంచం యావత్తూ మరింత ఎక్కువ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేలా చేయడమే సరళీకరణ విధానాల పర్యవసానం. హేతు విరుద్ధతకు ఇది పరాకాష్ట.
     బోల్షివిక్‌ విప్లవం ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతున్న నేపథ్యంలో, ఇంకోవైపు మహామాంద్యం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో తన ఆర్థిక రచనలను సాగించిన జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ కి ఈ హేతు విరుద్ధత గురించి బాగా తెలుసు. ఎలాగైనా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడాలన్నది అతడి తాపత్రయం. అందుకే అతడు ''పెట్టుబడుల మీద సామాజిక నియంత్రణ'' ఉండాలని ప్రతిపాదించాడు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం కల్పించుకోవడంతోబాటు, తగిన ద్రవ్య విధానాన్ని చేపట్టి మొత్తం మీద వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలకు లోబడి వ్యవహరించాలని .అతడు ప్రతిపాదించాడు.
    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నూతనంగా స్వతంత్రం పొందిన మూడో ప్రపంచ దేశాల్లోని చాలా ప్రభుత్వాలు కీన్స్‌ ప్రతిపాదించిన అవగాహనకు అనుగుణంగానే వ్యవహరించాయి. తమ దేశాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ఏ మాత్రమూ దెబ్బ తినకుండానే, స్పెక్యులేషన్‌ను నేరుగా నియంత్రించే కొత్త కొత్త ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. దానితోబాటు నిరుద్యోగం పెరిగిపోకుండా చూసుకున్నాయి. భారతదేశంలో పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీలకే ఇచ్చే ప్రత్యేక ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశారు. దానితోబాటు, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాల విషయంలో కూడా స్పెక్యులేషన్‌కు అవకాశం హెచ్చుగా ఉండే రంగాలకు ఆ రుణాలు అందకుండా కంట్రోల్‌ విధించారు. దానితోబాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడానికి తోడ్పడే ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటువంటి ఏర్పాట్ల వలన స్పెక్యులేషన్‌ ధోరణులు అటు పెట్టుబడులను గాని, ఇటు ఉపాధి కల్పనను గాని దెబ్బ తీయకుండా నిరోధించగలిగారు.
     బ్రెట్టన్‌వుడ్‌ సంస్థలు (ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌) వాటికి వంత పాడే నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ విధమైన వ్యవస్థలను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇటువంటి ఏర్పాట్లు ''ఆర్థిక అణచివేత''గా వాళ్ళు విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైన ప్రత్యక్ష జోక్యమూ ప్రభుత్వం వైపు నుండి ఉండకూడదని వాదించారు. ఆహార ధాన్యాల ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయాలన్నది వారి డిమాండ్‌. మోడీ ప్రభుత్వం చేత ఆ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను చేయించింది ఈ ప్రాతిపదిక మీదనే. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రస్తుతానికి రద్దు చేయించలేకపోయారు కాని ఆర్థిక సరళీకరణను అమలు చేయించడంలో మాత్రం ఒకమేరకు విజయం సాధించగలిగారు.
      ''ఆర్థిక సరళీకరణ'' అంటే ఆచరణలో ద్రవ్య విధాన నియంత్రణ కోసం కేవలం వడ్డీ రేట్లపై మాత్రమే ఆధారపడడం. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా సరళీకరణ కారణంగా అమెరికా మీద ఆధారపడినందు వలన అమెరికన్‌ వడ్డీ రేట్లను బట్టి ఏ దేశ ద్రవ్య విధానమైనా రూపొందాల్సిందే. ఇంకో పక్క ఆర్థిక పొదుపు చర్యలు అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం బట్టే దాని ఖర్చు ఉండాలి. తన ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రభుత్వం సంపన్నుల మీద అదనంగా పన్నులు విధించడం కుదరదు. ఒకవేళ విధిస్తే ఆ సంపన్నులు తమ పెట్టుబడులను ఇతర దేశాలకు తరలించుకుపోతారు. అంటే అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను పెంచితే, దాని ప్రభావం ఇక్కడ మన దేశంలో పెట్టుబడుల మీద, ఉపాధి కల్పన మీద, ఉత్పత్తి మీద నేరుగా పడుతుంది.
గతంలో మన దేశంలో దేశీయ స్పెక్యులేటర్లు మన ఉత్పత్తిని, ఉపాధిని నిర్ణయించే పరిస్థితి ఉంటే, ఇప్పుడు అమెరికా లోని వేళ్ళ మీద లెక్కించగల స్పెక్యులేటర్లు ప్రపంచంలోని ప్రతీ దేశంలోని ఉత్పత్తిని, ఉపాధిని నిర్ణయించడం జరుగుతోంది.
      ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం ఉండిన మన గత కాలపు ఆర్థిక వ్యవస్థను ప్రముఖ ఆర్థికవేత్త డా|| కె.ఎన్‌.రాజ్‌ శ్లాఘించారు. కొద్దిమంది స్పెక్యులేటర్లు దేశంలోని లక్షలాదిమంది శ్రామికుల ఉపాధి అవకాశాలను నిర్ణయించే పరిస్థితి ఆ వ్యవస్థలోే లేకపోవడమే ఆయన మెచ్చుకోలుకు కారణం. ఆర్థిక సరళీకరణ సరిగ్గా ఈ రక్షణనే నాశనం చేసింది. అంతేకాక, ప్రతీ దేశ ఉపాధి అవకాశాలనూ అమెరికన్‌ స్పెక్యులేటర్ల ఇష్టాయిష్టాలకు దాసోహం చేసింది.
      ప్రస్తుతం ప్రపంచంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం గురించి, వడ్డీ రేట్లను పెంచడం గురించి చాలా చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ అంతా దాదాపు నయా ఉదారవాద చట్రం పరిధి లోపలే జరుగుతోంది. ఎంత మేరకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఎంత మోతాదులో నిరుద్యోగం పెరుగుదలకు సిద్ధపడాలన్న చర్చ జరుగుతోంది. కాని నయా ఉదారవాద చట్రం కారణంగానే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగల చాలా వ్యవస్థలు ప్రభుత్వాల చేతుల్లో లేకుండా పోయాయి. కాబట్టి, ఇప్పుడు జరగాల్సిన చర్చ నయా ఉదారవాద పరిధికి లోబడి కాకుండా, ఆ పరిధిని దాటి బైట పడడమెలా అన్నదాని చుట్టూ జరగాలి. అయితే, అది ఎక్కడా కనిపించడం లేదు.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

11