
రాజధానిగా అమరావతే కొనసాగాలని అమరావతి నుంచి అరసవల్లికి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర' సోమవారం ప్రారంభమైంది. శాంతి భద్రతల పేరిట పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించగా, నిరసన తెలిపే హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని నొక్కి వక్కాణించిన హైకోర్టు, పాదయాత్రకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. గతంలో తిరుమలకు పాదయాత్ర విషయంలోనూ ఇలానే జరిగింది. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం రోజుకోరకంగా పిల్లిమొగ్గలు వేస్తూ గందరగోళం కొనసాగిస్తున్న ఫలితమే రైతుల సుదీర్ఘకాల ఆందోళనలు, పాదయాత్రలు. వైసిపి ప్రభుత్వం వచ్చీరావటంతోనే అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై వివాదాస్పద చట్టాలు చేసింది. వాటికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగుతుండటంతో రాజధాని పీకల్లోతు సమస్యలో కూరుకుపోయింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, ఆర్నెల్లలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఈ ఏడాది మార్చి 3న తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును అమలు చేసే బదులు సాకులు వెదకడంతోనే అమరావతిపై అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది విదితం.
అమరావతి నిర్వీర్యానికి ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. హైకోర్టులో కేసు నడుస్తుండగానే రాజధానిలోని 19 గ్రామాలతో కలిపి నగర పాలక సంస్థ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. గ్రామసభల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఏకోన్ముఖంగా అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు వచ్చాక ఇప్పుడు మళ్లీ 22 గ్రామాలతో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రక్రియ యావత్తూ వారం రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ చర్యలను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాజధానిలోని 29 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉండగానే, రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలన్న సర్కారు ప్రతిపాదనకు హైకోర్టులో బ్రేక్ పడింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడి వారికైనా అమరావతిలో ఇంటి జాగాలిస్తామంటోంది సర్కారు. ఈ ఫీట్లన్నీ అమరావతి సమస్యను జఠిలం చేసేవే. హైకోర్టు తీర్పు వెలువడ్డాక సైతం కొందరు మంత్రులు తమ విధానం 'మూడే'నంటూ చేస్తున్న ఉటంకింపులు రాజధానిపై గందరగోళాన్ని పెంచుతున్నాయి.
రాజధానిగా అమరావతిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అమరావతి నిర్ణయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పూర్తిగా భాగస్వామ్యమైంది. అధికారంలోకొచ్చాక తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను వైసిపి తప్ప అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం బహుళ నాల్కల ధోరణితో ఉంది. రాష్ట్ర బిజెపి అమరావతి కావాలంటుంది. మరోవైపు అదే పార్టీలోని నేతలు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత పాట పాడుతున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానికి నిధులివ్వాల్సిన కేంద్ర బిజెపి మూడు రాజధానులపై పరివిధాలుగా న్యాయస్థానంలో అఫిడవిట్లు వేసి అయోమయానికి ఆజ్యం పోస్తోంది. అమరావతిలో నెలకొల్పదలిచిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు వీసమెత్తు మొదలు పెట్టలేదు. రాజధాని కోసమే బిజెపితో అనుబంధం పెట్టుకున్న జనసేన బిజెపి ఆడుతున్న నాటకంపై ప్రశ్నించకుండా గమ్మునుంది. రాజధానిపై నెలకొన్న రాజకీయ అనిశ్చితి కేంద్ర బిజెపికి బాగా వాటంగా దొరికింది. అమరావతికి మద్దతు ప్రకటించినప్పటికీ కేంద్రాన్ని నిధులడిగే ధైర్యం టిడిపికి లేదు. 'మూడు'పై ఉన్న అధికార వైసిపి ఎలాగూ అడగదు. దాంతో అసలు దోషి కేంద్ర బిజెపి ఎంచక్కా తన బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. ఇంకా రాజధానిపై అనిశ్చితిని కొనసాగించడం రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలకు నష్టదాయకం. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అమరావతిని అంగీకరించి అభివృద్ధికి చిత్తశుద్ధితో సంకల్పం తీసుకొని గందరగోళానికి చరమగీతం పాడాలి. అందరినీ కలుపుకొని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించాలి.