Aug 07,2022 10:16

'మతం మీద నేరుగా పోరాడితే దానికి శాశ్వత అమరత్వం కల్పించడమే!' -కారల్‌ మార్క్స్‌
ఎవరికైనా ఒక మతం ఎందుకు జీవితంలో భాగమైపోతుంది? ఈ భూమ్మీద జన్మించిన ప్రతీ మానవ ప్రాణికీ (జీవకోటికి అని ఎందుకు వాడలేదంటే వాటికి పుట్టుకతో ఏ మతం ఉండదు. ఒక క్రైస్తవ లేదా హిందూ లేదా ముస్లిమ్‌ కుటుంబాల్లో పెరిగే ఆవు తన ముందు ఏ దేవుడి పటాన్నైనా పెడితే, నిరభ్యంతరంగా నమిలి తినేస్తుంది. ఎందుకంటే దానికి మతంతో పన్లేదు, అయ్యో, ఇది మా ఇంటి యజమాని మతం తాలూకూ దేవుడు కదా అని అది అనుకోదు) ఇక్కడ స్పష్టంగా తెలిసే, అందరూ ఒప్పుకునే సత్యం ఏమిటంటే, సకల జీవరాశుల్ని సృష్టించాడని బడాయిగా చెప్పుకోవడమే తప్ప, అనంతకోటి జీవరాశుల్లో ఒక శాతం కూడా లేని మనిషి తప్ప, మరే ప్రాణీ దేవుడ్నిగానీ, మతాన్నిగానీ ఖాతరు చెయ్యవు! అంటే మతం అనేది స్పష్టంగా మనిషి తాలూకూ బిజినెస్‌! నేననేది మతాన్ని బిజినెస్‌ చేస్తూ తెలివిగా వాడుకునే వారి విషయం కాదు! మనిషి స్పృహలో వుండే, చాలా స్పష్టంగానే, తానే కనుక్కున్నాడనే సందర్భం మాత్రమే! ఎందుకు? ఒంటరిగా వున్నప్పుడు ప్రకృతి శక్తులు అర్థంకాక భయంతో, అభద్రతతో కొన్ని భ్రమలు పెట్టుకున్నాడు. రక్త సంబంధీకుల కుటుంబం ఏర్పడ్డాక కొన్ని, తర్వాత కుటుంబాలు కలిసి గుంపుగా బతికేటప్పుడు అందర్నీ కలిపి వుంచే కొన్ని.. గుంపులు కొన్ని కలిసి ఒక తెగలా సామూహికంగా బతికేటప్పుడు మరికొన్ని అదనంగా కలుస్తూపోతాయి. వీరిని పట్టి ఉంచే సూత్రాలు బాహ్య ప్రభావాలు లేనంతకాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. ఒకోసారి రెండు గుంపులు, రెండు తెగలు ఒక దానిమీద ఒకటి దాడులు చేసుకున్నప్పుడు రెండు తెగల్లోని సూత్రాలు కలగాపులగం అవ్వడమో, విజేత తెగ పాటించే ఆ సూత్రాలు, పరాజితులకు అలవాటు చేయడమో సాధారణంగా జరుగుతుంది.
ఆ సూత్రాలు చెప్పిన వ్యక్తి ఆ తెగకు విలువైన వ్యక్తి, రక్షకుడో, ప్రవక్తో, దేవుడు పంపించిన దూతో అవుతాడు. పుట్టుక, ఆహార అన్వేషణ, గెలుపు, మరణంతో ముడిబడి వుండే సూత్రాలు ఆ తెగపెద్ద ఎలా చెబితే అలా నడవడమే.. ఆ తెగ పెద్ద ఏది చెబితే దాన్ని ఆచరణలో పెట్టడం ఆ తెగవాళ్ళు చేయాల్సిన పని. ఇంకో పెద్ద తెగ ఏదన్నా దాడి చేస్తే బలహీనమైన తెగ ఆ సూత్రాల్ని పాటించాలి. జంతువుల్లో కుటుంబాలు లేవా, గుంపులు లేవా, తెగలు లేవా? ఉన్నాయి. ఉదాహరణకి సింహాలు, ఏనుగులు, కాంగ్రూలూ, జిరాఫ్‌లూ (కంగారూలూ, జిరాఫీలు అనకూడదు). అయితేనేం, వాటికి దేవుడితోనో, మతంతోనో పనిబడలేదు!
ఒక తెగకు బాధ్యత వహించే వ్యక్తి సూచనలు, కట్టుబాట్లు ఆ తెగకు సంబంధించిన వారు తప్పక పాటించాలి. తెగ 'రక్షకుడు' అతనే కాబట్టి. మరో తెగ 'రక్షకుడు' చెప్పిన సూత్రాలు ఇంకొకరికి నచ్చుతాయా? 'నా కవే నచ్చాయి, నేను పాటిస్తాను' అని ఇంకొక తెగ వ్యక్తి అంటే ఏం జరుగుతుంది? ప్రాణం విలువలేని రోజుల్లో ప్రాణాలు తీయడం అతి సాధారణమైన విషయం. కాబట్టి తెగ పెద్దగా కొన్ని సూత్రాల్ని పాటించేలా చేయడమే ఒక గొప్ప కసరత్తు. తెగ పెద్ద ఉద్దేశం మాత్రం ఒకటే, తాను 'చెప్పినట్టు' నడిచేవారికి ఒక హామీ, రక్షణ ఉంటుంది.
యూదులు, క్రైస్తవుల గ్రంథాలలో అనేక సందర్భాల్లో మానవ నాగరితలోని లేబ్రాయపు ఆలోచనలు ఒకోసారి ఆశ్చర్యచకితం చేస్తాయి. కొంచెం ఆలస్యంగా వచ్చిన ఖురాన్‌ గ్రంథంలో, తెగల పట్ల పొసగని అనేక విషయాల పట్ల, ఒక సాధారణ జీవనాన్ని గడుపుతూ వున్న మహమ్మద్‌ అనే వ్యక్తి ప్రవక్తగా ఎలా ఎదిగాడు? ఆనాటి అనాగరిక సంచార అరబ్బు ప్రాంతాల తెగల మధ్య తరచుగా జరిగే భయానక యుద్ధాల నేపథ్యంలో బహు దేవతారాధకులుగా ఉంటున్న విభిన్నమైన తెగల్ని ఒక గొడుగు కిందికి తెచ్చే ప్రయత్నం ఎలా చేశాడు? తనకు అల్లా నుంచి 'దివ్యవాణి'గా వినిపించే సూత్రాలను 'సూరా' ల్లో సందర్భానుసారంగా వినిపిస్తూ వచ్చిన ఆ 'దివ్య సందేశాలు' యావత్తూ మానవాళికోసమా?, లేదంటే అరబ్బు తెగల నుద్దేశించి వినిపించాడా? ఇలాంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చిస్తారు రచయిత్రి.
ఖురాన్‌లోని విషయాలు తెలియాలంటే అరబ్‌ తెగల సంచార జీవనం తెలిసి ఉండాలి. ఆరేడు శతాబ్దాల సమయంలో అరబ్‌ ప్రపంచం ఎలా ఉండేదో తెలియాలి. వారి వేషభాషలు, వారి ఆహారపుటలవాట్లు, ప్రవక్త రాకముందు వారి జీవనశైలి ఎలా ఉండేదీ, తర్వాత ఎంతగా మారింది అనేది తెలుసుకోకపోతే నిజాలు తెలియవు. ఉదాహరణకు అరబ్బు తెగలలో కొన్ని ఒంటెను బతికి ఉండగానే ముక్కలుగా కోసి తినేవారట.. అలానే స్త్రీలు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. మహమ్మద్‌ ప్రవక్త దీన్ని గర్హించడం చూస్తాం. అలానే తెగ యుద్ధాలలో పురుషుల మరణాలు ఎక్కువై, వితంతువులు విపరీతంగా ఉండేవారు. వితంతు వివాహం తను చేసుకోవడమే కాదు, వివాహానికి నలుగురిని పరిమితం చేయడం చూస్తాం. (అప్పటికది ముందడుగు!) అలానే ఇటువంటి చాలా అనాచారాలను మహమ్మద్‌ మెరుగుపరచడం గమనిస్తాం.
అరిస్టాటిల్‌ బానిసత్వాన్ని సమర్థించడం తప్పైనా అరిస్టాటిల్‌ గొప్ప తాత్వికుడని ఎందుకంటారు? ఒక వ్యక్తి జన్మించిన చారిత్రక నేపథ్యాన్ని నిష్పక్షపాతంగా చూడడం నేర్చుకున్నప్పుడు ఏయే చారిత్రక పరిస్థితుల్లో ఏ సంబంధాలలో వాటిని చెప్పాల్సి వచ్చిందో తెలుసుకొని, తనకు ముందున్న తరంలో మానవ ప్రగతికి అడ్డుగా ఉంటూ, ముందుకు కాకుండా వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే దేనినైనా గర్హించాల్సిందే.
ఈ పరిచయంలో హిజాబ్‌ గురించీ, జిహాదీ గురించీ, బహు దేవతారాధన నుంచి దేవుడొక్కడే అనే భావనలు ఎందుకొచ్చాయో రచయిత్రి వివరించే ప్రయత్నం చేశారు. సెటానిక్‌ వర్సెస్‌ గురించి (రష్దీ లేవనెత్తిన విషయం) కూడా వివరణ వుంది. ఇది మహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని నిష్పక్షపాతంగా చూపే ప్రయత్నం చేసింది. ఆయన జీవన గమనంలో ఎదురైన అన్ని సంఘటనల్ని సూరాల ఆధారాలతో ఉటంకిస్తూ, పెద్ద వయసు ఖతీజాని వివాహం చేసుకోవడం నుంచి, తొమ్మిదేళ్ల ఆయేషానీ, ఇంకా మరి కొందరితో వివాహాలు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు, దివ్యవాణి (ఖురాన్‌) ని వినిపించేటప్పుడు ఆయన ఎంత ఉద్వేగంతో చెమటలు పట్టి, ఒక ట్రాన్స్‌లాంటి స్థితిని పొందేవాడో.. దానధర్మాల పట్ల, నిరుపేదల పట్ల ఎంత దయామయుడో చెబుతూనే.. అదే సమయంలో శత్రు తెగల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండేవాడో కూడా వివరిస్తోంది.
మతాలను సమర్ధించడం, లేదంటే పరమత సహనాన్ని బోధించడమో కాదు కావలసింది. ఏ మతం ఏ చారిత్రక నేపథ్యంలో పుట్టుకొచ్చిందో తెలుసుకోవడం ద్వారా ఆయా మతాచారాల వెనక దాగున్న సాంఘిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం. సానుభూతితో అర్థం చేసుకోవడం, సమకాలీన పరిస్థితుల్లో వాటి ప్రాసంగికత ఏమేరకో తెలుసుకోవడం. కారెన్‌ ఆమ్‌ స్ట్రాంగ్‌ రాసిన ఈ పుస్తకంలో ఒక మతాన్నో, ఆ మతాన్ని ఆచరించే వ్యక్తులపట్లో చిన్న చూపుతోనో.. లేదంటే మూఢభక్తితోనో కాకుండా ఆ మత ప్రవక్త జీవితాన్ని తనకు దొరికిన సమాచారం మేరకు ప్రతిభావంతంగా విశ్లేషించింది. ఏ మతాన్ని ఆచరించే వారైనా ఈ పుస్తకాన్ని చదవచ్చు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అందించిన ఈ పుస్తకాన్ని పి.సత్యవతి గారు చక్కని తెలుగులో తెలుగు పాఠకులకు అందించారు.
- వి. విజయకుమార్‌, 85558 02596