
ఏలియన్ల జాడ కనుక్కోవడం ద్వారా అమెరికా ముందుంటే అంతరిక్షం లోకి జంతువును పంపించి రష్యా విజయం సాధించింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని కంప్యూటర్ల కన్నా వంద రెట్లు శక్తివంతమైన సామర్ధ్యం కలిగిన కంప్యూటర్ తయారీలో చైనా ఉంటే 95 శాతం మనిషిలా పనిచేసే హ్యూమనోయిడ్ రోబో తయారీలో జపాన్ ఉంది. మరి మనమెక్కడున్నాం? మన దేశంలో పరిశోధన పరిస్థితి ఏంటి? అంటే 'గో కరోనా...గో' అంటూ పళ్లాలు మోగించడం, అనారోగ్యం వస్తే ఆవు మూత్రం తాగించడం, వర్షాలు పడాలంటే ఆడ పిల్లలను నగంగా నడిపించడం. నలభై శాతం మందికి అన్నం దొరకక 'ఆకలి సూచి-2021'లో 116 దేశాలకు గాను భారత్ 106వ ర్యాంకులో ఉంది. ఇది మన కర్మ, నిరుద్యోగం పెరిగితే మన దరిద్రం, ధరలు పెరిగితే మన దౌర్భాగ్యం అనుకోవడం తప్ప అందుకుగల ముఖ్య కారణాలు వెతకడంలేదు. అలాగని పరిశోధనలో భారత్ సున్నా కాదు. ప్రపంచంలో వేసే ప్రతీ వ్యాక్సిన్ లోనూ మూడవ వంతు భారత్ లోనే తయారవుతున్నాయి. అలాగే తొలి ప్రయత్నంలోనే హాలీవుడ్ సినిమా కంటే కూడా తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపై మంగళయాన్ ఉపగ్రహాన్ని పంపిన భారత శాస్త్రజ్ఞుల మేధస్సుకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అంతే కాదు. అవకాశాలు కల్పించి ఆర్థిక సహకారం అందిస్తే మనం కూడా మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ మన ప్రభుత్వాలు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. 2012 వరకు పరిశోధనలకు జిడిపిలో 0.8 శాతం కేటాయిస్తుండగా, బిజెపి అధికారంలోకి వచ్చాక దానిని 0.7 శాతానికి కుదించింది. దాంతో మన దేశంలో యువత అత్యధికంగా ఉన్నప్పటికి పరిశోధన లోను, ఉత్పత్తి లోను భాగస్వాములను చేయలేకపోతున్నాం.
ఐదేళ్ళగా ఫెలోషిప్‌లు కోత
దేశంలో ఉన్నత విద్య నమోదు ఆందోళనకరంగా ఉంది. డిగ్రీ 79.8 శాతం, పి.జి 10.43 శాతం ఉంటే పిహెచ్‌డి 4.2 శాతం మాత్రమే ఉంది. గత పార్లమెంటు సమావేశంలో పరిశోధనలకు కేంద్రం నిధుల కేటాయింపులు సరిగ్గా లేవని ఫెలోషిప్‌లు లేకుండా నాణ్యమైన పరిశోధన ఎలా సాధ్యమని సిపిఎం ఎం.పి డా|| కె.శివదాసన్ ప్రశ్నించిన తరువాత... ఉన్నత విద్యామండలి విడుదల చేసిన గత ఐదేళ్ల ఫెలోషిప్‌ల వివరాలు పరిశోధన పట్ల కేంద్రం నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టాయి. యుజిసి 12 రకాల పేర్లతో ఫెలోషిప్‌లు ఇస్తుంది. 2017లో 53,843 మందికి ఇవ్వగా 2021లో 34,732 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే 19,111 మందికి కోత పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఫెలోషిప్ నిధులు పరిశోధనలకు సరిపోవడంలేదని...పెంచాలని పరిశోధకులు, శాస్త్రవేత్తలు వినతులు ఇచ్చి, ధర్నాలు చేస్తే కొంత మేరకు పెంచారు. నెలకు జెఆర్‌ఎఫ్ రూ. 25,000 నుండి రూ. 31,000కు, ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 31,000 నుండి రూ. 37,000కు పెంచారు. కానీ ఫెలోషిప్‌ల సంఖ్య తగ్గించేశారు.
యుజిసి నిబంధనల ప్రకారం నాన్ నెట్ పరిశోధకులందరికీ యుఆర్‌ఎఫ్ (యునివర్సిటీ రీసెర్చ్ ఫెలోషిప్) పేరుతో ఆయా యూనివర్సిటీలు/రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. సెంట్రల్ యూనివర్సిటీలో రూ.12 వేలు, కేరళ వంటి రాష్ట్రాల్లో రూ.8 వేలు నాన్ నెట్ ఫెలోషిప్ ఇస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది పూర్తిగా అమలు జరగడంలేదు. మన రాష్ట్రంలో 2004 నుండి 2009 వరకు రూ.5 వేలు ఇచ్చేవారు. తరువాత మరల ఆపేశారు. పరిశోధన కేంద్రం బాధ్యత అని రాష్ట్రాలు- రాష్ట్రాల బాధ్యత అని కేంద్రం ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ పరిశోధనను గాలికి ఒదిలేశారు. బడ్జెట్ కేటాయింపులు చేయడంలేదు.
అడ్మిషన్లతో పాటే ఫెలోషిప్‌లు
2014 విభజన తరువాత ఆంధ్రాలో అన్నీ రాష్ట్ర యూనివర్సిటీలే మిగిలాయి. సెంట్రల్ యూనివర్సిటీలు లేవు. విభజన హామీలో భాగంగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభించినప్పటికీ 12 గ్రూపుల్లో 400 మంది విద్యార్ధులను మాత్రమే ఎకామిడేట్ చేస్తున్నారు. ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీలు పేరుకే సెంట్రల్ యూనివర్సిటీలు. ఇవి ఆంధ్రా యూనివర్సిటీలో అద్దెకు ఉంటూ ఒక డిపార్ట్‌మెంట్ మాదిరిగా 300 మంది విద్యార్ధులతో నడుస్తున్నాయి. వీటికి తోడు మరో 17 రాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో పరిశోధన అంటే యుజిసి, సిఎస్‌ఐఆర్, జిఎటిఇ, ఎన్‌ఐపిఇఆర్.... వంటి పరీక్షల్లో నెగ్గిన ఫెలోషిప్ హోల్డర్లు ఏటా దాదాపు 200 మంది చేరేవారు. అలాగే కేంద్రం నుండి వచ్చే ప్రాజెక్టులు, రూసా, బిఎస్‌ఆర్ వంటి ఫండ్లు ఆధారంగా ఆయా యూనివర్సిటీలు 4 లేదా ఐదేళ్ళకు ఒకసారి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ పరిక్షలు పెట్టి జాయిన్ చేసుకునేవారు. ఉదాహరణకు ఎయుఆర్‌సిఇటి 2013 లో జరిగితే మరలా 2017లో జరిగింది. అయితే 2015లో యుజిసి, న్యాక్ కమిటీలు ఆంధ్రాకు వచ్చి విద్యా, పరిశోధనా ప్రమాణాలు పరిశీలించి ఆంధ్రాలో పరిశోధకుల సంఖ్య, పరిశోధనల నాణ్యత చాలా తక్కువగా ఉందని చెప్పాయి. దీనిని అధిగమించడానికి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఎపిఆర్‌సిఇటి ప్రతి సంవత్సరం నిర్వహించి పరిశోధకుల సంఖ్య పెంచాలని నిర్ణయం చేసారు. ప్రతి సంవత్సరం కాకపోయినా కరోనా పరిస్థితులు వున్నా సరే రెండేళ్లకు ఒకసారి అంటే 2019, 2021లో పరీక్ష పెట్టి అడ్మిషన్లు ఇచ్చారు. ఎపిఆర్‌సిఇటి 2019 ద్వారా 1920 మంది, 2021 ద్వారా 2300 మంది పరిశోధకులు జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చివరిసారిగా 2007లో జరిగింది. అప్పటి నుండి ఏటా రిటైర్ అవుతున్నారు తప్ప రిక్రూట్‌మెంట్ జరగకపోవడం వలన అన్ని యూనివర్సిటీల్లోనూ యుజిసి నిర్ణయించిన సంఖ్యకు 70 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రా యూనివర్శిటీలో 2006లో 953 పోస్టులను యుజిసి మంజూరు చేసింది. కానీ నేడు కేవలం 90 మంది మాత్రమే మిగిలారు. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు. వారికి గైడ్‌షిప్ ఉండదు. కేవలం పర్మినెంట్ వారికి మాత్రమే గైడ్‌షిప్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో పిహెచ్‌డి అర్హత కలిగిన డిఎల్‌ఎస్ కూడా గైడ్‌షిప్ ఇచ్చి డిగ్రీ కాలేజ్‌లో కూడా పిహెచ్‌డి అడ్మిషన్లు ఇచ్చారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది కానీ ఫెలోషిప్ ఇవ్వడం కోసం మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్మిషన్లు ఇచ్చాం పరిశోధనలు చేసెయ్యండి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ల్యాబుల్లో సరైన ఎక్విప్‌మెంట్లు, ఫండింగ్ లేకుండా పరిశోధనలు ఎలా సాధ్యం. పరిశోధకులు కచ్చితంగా 25 ఏళ్ళ పైబడిన వారే ఉంటారు. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ సొంత డబ్బుతో పరిశోధనలు చేయాలంటే సాధ్యమేనా? ఎంత చిన్న అంశంపై పరిశోధన చేయాలన్నా సరే కనీసం రూ.5 లక్షలు నుండి రూ.15 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. ఇంకా ఎక్కువ అయినా ఆశ్చర్యంలేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధన చేస్తున్న మిత్రులతో మాట్లాడగా మన యూనివర్సిటీ ల్యాబుల్లో అవసరమైన ఎక్విప్‌మెంట్ పూర్తి స్థాయిలో లేని కారణంగా ఎన్‌ఎంఆర్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఎక్స్‌ఆర్‌డి బయోలాజికల్ యాక్టివిటీస్ వంటి టెస్టులన్నీ బయట చేయించుకోవాల్సిందేనని, పిహెచ్‌డి అంతటికీ 200 శాంపిళ్లు చేయాల్సి ఉంటుందని తెలిసింది. ఒక్కో శాంపిల్‌కి రూ. 1000 నుండి రూ. 1500 ఖర్చు అవుతుంది. ఎన్‌ఎంఆర్ కి రూ.2 లక్షలు, హెచ్‌ఆర్‌ఎంఎస్ కి రూ.2 లక్షలు కచ్చితంగా అవుతుంది. స్కోపస్ స్థాయి జర్నల్స్‌లో పబ్లికేషన్ ఉంటేనే సబ్‌మిషన్ కి అనుమతిస్తామని ఎ.యు లో కొత్తగా నిబంధన తీసుకు వచ్చారు. ఆ స్థాయి జర్నల్స్‌లో పబ్లిష్ అవ్వాలంటే ఎన్‌ఎంఆర్, హెచ్‌ఆర్‌ఎంఎస్ తో పాటు ఎక్స్‌ఆర్‌డి, బయోలాజికల్ యాక్టివిటీస్ వంటి మరికొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుంది. వీటికి తోడు అవసరమైన కెమికల్స్ కొనుక్కోవాలి. పెరిగిన ఫీజులు, మెస్ బిల్లులు కట్టుకుంటూ పరిశోధన చేయాలంటే సాధ్యం కాదు. తల్లిదండ్రుల్ని పోషించాల్సిన వయసులో సొంత డబ్బుతో పరిశోధన అంటే సాధ్యమేనా? ఎస్‌సి, ఎస్‌టి, బిసి వారు అసలు చేయలేరు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం-77 తెచ్చి ప్రైయివేట్ కాలేజీలో చదివే పి.జి వారికి విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వలన పి.జి చదివేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీని ప్రభావం పిహెచ్‌డి అడ్మిషన్ల మీద కూడా పడుతుంది. ఒకవేళ పిహెచ్‌డి జాయిన్ అయినా ఫండింగ్ లేకపోవడం వలన పిహెచ్‌డి పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది.
2022-2023 బడ్జెట్‌లో కోత
ఇక నుండి డిఎల్స్, ప్రొఫెసర్ పోస్టులకు పిహెచ్‌డి కనీస అర్హతగా యుజిసి ప్రకటించింది. పిహెచ్‌డి చేసిన వారే బోధిస్తే ఉన్నత విద్యా, పరిశోధనా ప్రమాణాలు పెరుగుతాయి. కానీ ప్రభుత్వాలు ఎంత మందికి పరిశోధన చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి, ఎంత వరకు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి? ఇది విత్తనాలు జల్లకుండా ఫలాల కోసం ఎదురు చూసినట్లే ఉంది. 'గత 35 ఏళ్ల విద్యావిధానం వల్ల ఎటువంటి మార్పులు లేక విద్యా రంగం కుంటుపడిపోయింది. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికే నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకు వచ్చామ'ని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఎన్ని కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారో, పరిశోధనలకు ఎంత నిధులు కేటాయిస్తారో ప్రస్తావించలేదు. బడ్జెట్‌లో పెరుగుదల లేకుండా, కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు లేకుండా కేవలం విధానంలో మార్పు ఎవరి ప్రయోజనాల కోసం? కేంద్రం పెత్తనం కోసమా?కార్పొరేటీకరణ, కాషాయీకరణ కోసమా? కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి 2022-2023 బడ్జెట్‌లో 6 శాతం కేటాయిస్తామని చెప్పినా ఆచరణలో కేవలం 2.64 శాతం మాత్రమే కేటాయించింది. ఫండింగ్ లేకుండా పరిశోధనలు సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వాలు దీన్ని గుర్తించి నిధులు కేటాయించి పరిశోధకులందరికీ ఫెలోషిప్‌లు ఇవ్వాలి.
వ్యాసకర్త : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఎల్.చిన్నారి
సెల్ : 7382004271