Oct 28,2022 11:41

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు పాలు తాగమంటే..అస్సలు ఇష్టపడరు. వారికి పాలు తాగడం అలవాటు చేయాలనే తల్లులు.. బూస్ట్‌, హార్లిక్స్‌ వంటి పౌడర్స్‌ను కలిపి ఇస్తుంటారు. అయితే ఆ పౌడర్ల కంటే కూడా.. ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసి ఆ పొడిని పాలల్లో కలిపి తాగిస్తే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇంట్లోనే సులభంగా.. ఏయే ప్రొటీన్‌ పౌడర్స్‌ని ఎలా తయారురుచేయవచ్చో తెలుసుకుందామా..!

విత్తనాలతో 
చియా సీడ్స్‌ : 3 టేబుల్‌ స్పూన్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు - మూడు టేబుల్‌స్పూన్లు, అవిసె గింజలు - మూడు టేబుల్‌స్పూన్లు, గుమ్మడికాయ గింజలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, జొన్నలు - ఒక కప్పు. వీటితోపాటు మీకిష్టమైన విత్తనాల్ని మరికొన్నింటిని కలుపుకోవచ్చు. వీటిని వేయించుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పాలల్లో ఈ పొడితోపాటు, కొద్దిగా బెల్లం కలిపి చిన్నారులకు తాపిస్తే ఆరోగ్యానికి మంచిది. చిన్నారులకే కాదు.. ఈ పొడిని పెద్దలైనా తీసుకోవచ్చు.

కాజు, బాదం పొడి
పల్లీలు - పావుకప్పు, పిస్తాపప్పు - పావుకప్పు, బాదం - పావుకప్పు, జీడిపప్పు - పావుకప్పు, ఎండుకొబ్బరి - పావుకప్పు. వీటన్నింటిని కలిపి దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. లేదా బెల్లం పాకంతో ఈ పొడిని కలుపుకుని లడ్డూలా తయారుచేసుకుని తినవచ్చు.